ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో రోజు గడిస్తే మున్సిపల్ ఫలితాలు బహిర్గతం కానున్నాయి. 42 రోజుల సుదీర్ఘ సస్పెన్స్‌కు తెరబడనుంది. రెండు రోజులు ఆగితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠకు లోనవుతున్నారు.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. జిల్లాలో పోలింగ్ 77.09 శాతంగా నమోదైంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నో తంటాలు పడ్డారు. ఎవరెన్ని తాయిళాలు ప్రకటించినా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో ఫలితాలు వస్తే కాని వెల్లడయ్యే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్, తెచ్చిన టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు కళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ డీలా పడిపోయిందనే చెప్పవచ్చు. ఒక్క గజ్వేల్ నగర పంచాయతీలో మినహా మిగిలిన అన్ని చోట్ల టీడీపీ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి, సదాశివపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వార్డులు రావచ్చని సమాచారం.
సంగారెడ్డి, మెదక్ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో టీడీపీ-టీఆర్‌ఎస్ పార్టీల మధ్య హోరాహోరి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మూడు చోట్ల కూడా చైర్‌పర్సన్ ఎంపికకు అవసరమైనన్నీ మెజార్టీ వార్డులు రాకపోవచ్చని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్వతంత్ర, ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు కీలకం కానున్నారు. వారు ఎవరికి మద్దతు తెలిపితే ఆ పార్టీయే చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
అందోల్‌లో ఆసక్తికరం...
అందోల్ నగర పంచాయతీ ఎన్నికల సమయంలో బాబూమోహన్ టీడీపీలో ఉన్నారు. ఆయన తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకున్నారు. మరో వైపు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా అందోల్‌పై ప్రత్యేక దృష్టిసారించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, మధ్య పోరు హోరాహోరీగా ఉండవచ్చని తెలుస్తోంది. త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ఎన్నికల తరువాత బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ చైర్‌పర్సన్ ఎంపిక ఆసక్తికరంగా మారనుంది.
గజ్వేల్ కీలకం..
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల ఫలితాలు జగ్గారెడ్డి జయాపజయాన్ని, గజ్వేల్ ఎన్నికలు కేసీఆర్ మెజార్టీని అంచనా వేసే వీలుంది. దీంతో రాజకీయ విశ్లేషకులు ఈ మూడింటి ఫలితాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో టీఆర్‌ఎస్, టీడీపీ హోరాహోరీగా తలపడనున్నాయి. సంగారెడ్డిలో కాంగ్రెస్, సదాశివపేటలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెల 13న స్థానిక సంస్థల కౌంటింగ్ ఉండడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటి నుంచే ఉత్కంఠకు గురవుతున్నారు.