బుల్లి రాష్ట్రం - భారీ ఓటింగ్
భారతదేశపు ఈశాన్యం మారుమూలన ఉన్న చిట్టి రాష్ట్రం త్రిపుర. నెలల తరబడి ఈ రాష్ట్రం పేరు కూడా తలుచుకోకుండా గడిపేయొచ్చు. అలాంటి అనామక రాష్ట్రం త్రిపుర. కానీ ఆ రాష్ట్రంలో ఎన్నికలైతే మాత్రం 93 శాతం పోలింగ్ జరుగుతుంది. అంత చైతన్యం ఉంది ఓటర్లలో.
అయితే ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అదేమిటంటే సరిహద్దుకు అటువైపు నుంచి బంగ్లాదేశీలు చొరబడి ఓటు వేసి వెళ్లిపోతూ ఉంటారట. రాష్ట్ర రాజధాని అగర్తలా పట్టణం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. బహుశః ప్రపంచంలో ఇలా ఉన్న ఏకైక రాష్ట్రం త్రిపురయేనేమో!
చాలా మంది బంగ్లాదేశీలు ఉదయమే అగర్తలాకి వచ్చి రిక్షాలు తొక్కుకుని, డబ్బులు సంపాదించుకుని, సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతూంటారు. అందుకే ఎన్నికలు రాగానే 856 కిమీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తారు.
త్రిపురలో ఉన్నవి రెండు లోకసభ సీట్లు. కానీ రెండు విడతలలుగా ఎన్నికలు జరుగుతాయి. అక్కడ తూర్పు త్రిపుర, పశ్చిమ త్రిపుర అని రెండు లోకసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. అందుకేనేమో వెస్ట్ త్రిపురలో ఏప్రిల్ 7న, తూర్పు త్రిపురలో ఏప్రిల్ 12 న ఎన్నికలు జరుగుతాయి. ఒకప్పుడు గిరిజన తీవ్రవాదం త్రిపుర అటవీప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు సమస్య కాసింత సద్దు మణిగింది. కానీ సరైన రోడ్లు, కమ్యూనికేషన్లు లేనందున పోలింగ్ నిర్వహించడంలో ఎన్నో సమస్యలుంటాయి. అందుకే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు.