సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీపీఎంతో పొత్తుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందా? బుధవారంనాటి పరిణామాలను చూస్తే ఇదే నిజమని అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి బుధవారం సీపీఎం కార్యాలయమైన ఎంబీ భవన్‌కు వచ్చి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో అత్యంత రహస్యంగా భేటీ అయ్యి గంటకు పైగా చర్చలు జరిపారు. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తమ్మినేనిని అభినందించే పేరిట కడియం ఎంబీ భవన్‌కు వచ్చారు. ఎన్నికల్లో పొత్తులపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిపోయినందున సీపీఎం ప్రస్తుత ఆలోచనా ధోరణిని కడియం తెలుసుకున్నారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు తమ పార్టీ కట్టుబడి ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎప్పుడూ విమర్శించలేదని, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా అది ఆటంకం కాబోదని తమ్మినేని చెప్పారు. ఈ సందర్భంగా సీపీఎం పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను కడియంకు తమ్మినేని అందజేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని సీట్లపై చర్చ జరిగింది. తమ్మినేని ఇచ్చిన జాబితాపై పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి రెండ్రోజుల్లో ఏ విషయం చెబుతానని కడియం చెప్పినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
సీపీఎంతో పొత్తుకు టీఆర్‌ఎస్ యత్నాలు!
Published Thu, Apr 3 2014 1:44 AM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
Advertisement