నేను గెలుస్తా.. నువ్వు గెలుస్తావా
* మురళీమోహన్‌కు టీవీ రామారావు సవాల్
* స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
కొవ్వూరు: ‘నేను గెలుస్తాను.. నాకు ఆ నమ్మకం ఉంది.. నీకుందా’ అంటూ కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్‌ను ఉద్దేశించి సవాల్ చేశారు. శనివారం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్, స్థానిక నాయకులపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సిండికేట్ నాయకుల మాటలు నమ్మి తాను ఒక దళితుడనని కూడా చూడకుండా మురళీమోహన్ తనను అష్టకష్టాలు పెట్టారని ఆరోపించారు.
‘నీ దగ్గర ఒక్క మాట నిలకడ లేదు.. నా వల్ల నువ్వు ఓడిపోతానన్నావు కదా.. ఇపుడు నావల్లే నువ్వు నిజంగానే ఓడిపోతావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఎంతో కష్టపడ్డానని, నా లాంటి కష్టజీవికి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను విస్మరించి నాకు కేటాయించిన సీటును వేరొకరికి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. నా దేవుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ నేతకు ఆంధ్రాలో పనేంటి?
‘గరికిపాటి రామ్మోహనరావు ఎవడు.. అతనొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాడా... తెలంగాణ వాడికి ఆంధ్రాలో పనేంటి’ అని ప్రశ్నించారు. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నాడని నిలదీశారు. అతనికి నచ్చితే టికెట్ వస్తుందా లేకపోతే రాదా అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వకపోయినా స్థానం కోల్పోతామన్న ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.
ఒత్తిళ్లకు లొంగిపోయి చంద్రబాబు తప్పు చేశారని ఆరోపించారు. ఈ లాబీయింగ్‌లు చేసే వారిని పక్కన పెట్టండి చంద్రబాబుగారు అంటూ ప్రాథేయపడ్డారు. మీరు టికెట్ కేటాయించిన వ్యక్తికి అసలు పార్టీ సభ్యత్వం లేదన్నారు. సర్వేలలో 87 శాతం అనుకూలంగా వచ్చిన తననెందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని రామారావు ప్రశ్నించారు. ఇతర పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తారా అని ఆవేదన వ్యక్తం వెలిబుచ్చారు.