సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఇద్దరు వేరువేరు పార్టీలకు జిల్లా అధ్యక్షులు. ఒకరేమో ప్రత్యక్ష రాజకీయాల్లో అపార అనుభవం ఉన్ననేత. మరొకరు రాజకీయాల పట్ల అత్యంత ఉబలాటం ప్రదర్శించే నేత. ఇరువురు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరాటపడ్డారు. వారిలో ఒకరికి టికెట్ రాగా మరొకరికి టికెట్ రాలేదు. ఇరువురు నామినేషన్లు దాఖలు చేసినా ఎన్నికల బరి నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం జిల్లా వ్యాప్తంగా కష్టపడ్డారు. మరోమారు టికెట్ దక్కుతుందని భావించిన తరుణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైంధవుని పాత్ర పోషించి అడ్డుకున్నారు. తనకు టికెట్ తప్పక వస్తుందని భావించిన లింగారెడ్డి అంతకు మునుపే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బీఫారం మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి దక్కడంతో స్వత ంత్ర అభ్యర్థిగా లింగారెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని విశ్లేషకులు భావించారు. కాగా ఊహించనిరీతిలో బుధవారం ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఆవిధంగా లింగారెడ్డి ఎన్నికల బరి నుంచి కాడి కింద వేశారు. సమైక్యాంధ్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాభిమాన్ని చూరగొంటూ వచ్చారు. అయితే ఒక్కమారు రాజకీయ ప్రవేశం చేయడంతో సామాజిక కార్యక్రమాల తెరవెనుక దాగి ఉన్న అసలు లక్ష్యం బహిర్గతమైందని పరిశీలకులు భావించారు. కడప అసెంబ్లీ అభ్యర్థిగా విన్నూతంగా ప్రచార పర్వాన్ని సాగిస్తూ వచ్చారు. అంతలోనే అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ తతంగం వెనుక అంతుచిక్కని వ్యవహారం దాగి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
సాకుల కోసం వెతుకుతున్న నేతలు....
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కాలం కలిసివస్తే రాజకీయ ఎదుగుదల లభిస్తుంది. ఇవన్నీ అంచనా వేసుకునే రాజకీయాల్లో ప్రవేశిస్తుంటారు, అయితే ఆయా పార్టీల ప్రోత్సాహం కూడా అందుకు అవసరమే. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లింగారెడ్డికి తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసినట్లు పరిశీలకుల అభిప్రాయం. తన చిరకాల ప్రత్యర్థి వరదరాజులరెడ్డికి సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆయన అనుచరులు భావించారు. అనూహ్యంగా ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ కోసమే పనిచేయాలనే తలంపు ఉంటే అనుచరులతో ఎందుకు నిందించినట్లు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అదే విధంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి సైతం తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎన్నికల బరిలో నిలవాలనే తలంపుతో ఉన్న తరుణంలో సమైక్యాంధ్ర పార్టీ తన చేతుల్లోకి వచ్చి చేరిపోయింది. జిల్లా కన్వీనర్‌గా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఆమేరకు కడప అసెంబ్లీ సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే పరిశీలకులు సైతం ఊహించని రీతిలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అందుకు కారణాలుగా పార్టీ పోటీ చేయమందికానీ, ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గౌస్‌పీర్‌ను కూడా తానే బరిలో నిలిపానని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనే ఉపసంహరించుకోవడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని పలువురు విశ్వసిస్తున్నారు. అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ఇటు సమైక్యాంధ్ర పార్టీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఇరువురు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.
ఇరువురు నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకు కారణం కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి అని పలువురు చెప్పుకొస్తున్నారు. లింగారెడ్డితో అభ్యర్థి వాసు సుధీర్ఘ మంతనాలు నిర్వహించడంతోనే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా శ్రీనివాసరెడ్డికి సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి సమీప బంధువు. సింగారెడ్డి కుటుంబానికి శ్రీనివాసులరెడ్డి మనవడు అవుతాడు. బంధువుల నుంచి వచ్చిన ఒత్తిడి, చర్చల ఫలితంగానే సింగారెడ్డి వెనక్కి తగ్గినట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇద్దరు జిల్లా అధ్యక్షులు ఔట్!
Published Thu, Apr 24 2014 3:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement