సాక్షి ప్రతినిధి, కడప: ఒకనాడు ఉప్పు-నిప్పులా ఉన్న ప్రస్తుత టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి, ఆయనకు మద్దతుగా నిలిచిన తాజా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పరస్పరం చేసుకున్న ఆరోపణలివి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఏడేళ్లు కాలయాపన చేశారు. ప్రొద్దుటూరు పట్టణ వాసులు తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేవారు. ఈ సమస్యను తీర్చేందుకు కుందూ-పెన్నా వరద కాలువను రూపొందించారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.70 కోట్ల అంచనా వ్యయంతో పనులను మంజారు చేశారు. ఈపీసీ సిస్టమ్ ద్వారా పనులు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు అలైన్‌మెంట్ మార్చేవారు. దీంతో పలువురు కోర్టుకెళ్లారు. పర్లపాడు, కొత్తపేట గ్రామస్తులు కోర్టుకు వెళ్లడం వెనక లింగారెడ్డి ప్రమేయం ఉందని పలుమార్లు మాజీ ఎమ్మెల్యే వరద ఆరోపించారు.
పెన్నా అనవాళ్లనే కోల్పోతున్న ప్రొద్దుటూరు...
ప్రొద్దుటూరు అంటే టక్కున గుర్తుకొచ్చేవి మూడే అంశాలు... పెన్నా తాగునీరు, కన్యకాపరమేశ్వరీ అమ్మవారిశాల, బంగారు వ్యాపారం... వీటిల్లో పెన్నా నది అనవాళ్లు క్రమేపీ కనుమరుగు కావడంతో ప్రస్తుతం పట్టణవాసులు తాగునీటికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
పెన్నానది చెంతన ఉన్నప్పటికీ మూడు రోజులకు ఒకమారు నీరు సరఫరా అవుతుందంటే అక్కడి ఇబ్బందులను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు ఒక కారణం ప్రకృతి సంపద ఇసుకను తరలించడం కాగా, మరో కారణం పెన్నానదిని ఆక్రమించి పరిశ్రమలను నెలకొల్పడమే అని పలువురు పేర్కొంటున్నారు. ఇసుకను యధేచ్ఛగా తరలించడం వెనుక రహస్య ‘హస్తం’ ఎవరిదనేది ప్రొద్దుటూరు వాసులకు తెలిసిన విషయమే.
చెప్పేందుకే నీతులు...
రాజకీయాల కోసం ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసకుంటూ కాలం వెలిబుచ్చిన లింగారెడ్డి, వరదరాజులరెడ్డి ఇరువురూ ఒకే పార్టీ గొడుగు కిందకు చేరారు. కలిసికట్టుగా ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. ఏడేళ్ల క్రితం మంజూరైన వరదకాలువ పనుల్లో ఇలాగే వ్యవహరించి ఉంటే ఈపాటికి ఆపనులు పూర్తయి ప్రొద్దుటూరు దాహార్తికి బెంగలేకుండా పోయేది. రాజకీయాల కోసం ఏకమైన నేతలకు సమస్యల సాధనలో చిత్తశుద్ధి లేదనే ప్రత్యర్థుల ఆరోపణలకు బలం చేకూరుతోంది.
బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరి ఆపార్టీ టికెట్ సొంతం చేసుకున్న వరదరాజులరెడ్డి కుందూ-పెన్నా కాలువ పనుల్లో ఆ చాతుర్యం చూపలేకపోయారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరదరాజులరెడ్డి శాంతివచనాలు పలుకుతూ అవకాశమిస్తే ప్రొద్దుటూరులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని చెబుతున్నారు. మరి మూడు దశాబ్ధాలుగా ఆఇరువురి చేతుల్లోనే పాలనా పగ్గాలు ఉన్నాయి కదా.. అప్పుడేమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చెప్పేందుకే...
Published Sat, May 3 2014 2:10 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement