టీడీపీ-బీజేపీ పొత్తు రాజకీయ వ్యభిచారమే
హైదరాబాద్ : తెలుగుదేశం-బీజేపీ పొత్తు రాజకీయ వ్యభిచారమేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రెండు పార్టీల అపవిత్ర కలయికను కాంగ్రెస్ కార్యకర్తలంతా గ్రామా గ్రామానికి వెళ్లి ఎండగడతామన్నారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2004 ఎన్నికల తరువాత బీజేపీ మతోన్మాద పార్టీ అని, గోవా అల్లర్లకు నరేంద్ర మోడీ కారణమని చెప్పిన చంద్రబాబునాయుడు ఒక్క క్షణం కూడా మోడీ గుజ రాత్ సీఎం పదవిలో ఉండటానికి వీల్లేదని డిమాండ్ చేశారని అన్నారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు మాటమార్చి నరేంద్రమోడీయే ప్రధాని కావాలని కోరుతుండటం విడ్డూరమన్నారు. నరేంద్రమోడీ విషయంలో అప్పుడు తప్పయింది...ఇప్పుడు ఒప్పు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలమని చెబుతున్న బీజేపీ నేతలు విభజనను చివరిదాకా అడ్డుకునేందుకు యత్నించిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఏన్డీయే హయాంలో చంద్రబాబు అడ్డుకోవడంవల్లే తెలంగాణ ఇవ్వలేకపోయామని అద్వానీ పలుమార్లు చెప్పిన విషయాన్ని వీహెచ్ గుర్తుచేశారు.