
ఏ..బీసీ..డీ ఎన్నికల గారడీ!
‘‘పచ్చనయ్యా... చందమామ... ఎక్కడున్నావూ... నీవు లేక బీసీలంతా గొల్లుమన్నారు, దిగులుపడ్డారు...’’ అంటూ పాడుకుంటూ ఒకాయన కిలకిలా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఆయనను చూసి ఆశ్చర్యపడి మరొకాయన అడిగాడు. ‘‘అదేంట్సార్... ఏదో విషాదగీతం పాడుతున్న ఫీలింగ్ ఇస్తూ... అంతలోనే మళ్లీ అలా నవ్వుతూ వెళ్తున్నారు?’’ అని అడిగాడు. దానికి ఆయన జవాబు చెబుతూ ఇలా అన్నాడు... ‘‘ఇటీవల రాజకీయాల్లో ఒకాయన బీసీనే సీఎం చేస్తాననీ, అలా చేసేదాకా వదలనని, ఎవరడ్డొస్తారో చూస్తా అని... ఇలా రకరకాలుగా రంకెలేశాడు. దాంతో నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. అందుకే ఇలా విషాదగీతాన్నీ పాడుతూ, ఆనందలాస్యాన్నీ ప్రదర్శిస్తూ రెండు ఫీలింగ్‌నూ ఏకకాలంలో చూపిస్తున్నా. సదరు పచ్చనయ్యగారు మాట్లాడిన మాటలు వినగానే నేనెప్పుడో చదివిన... లోకంలో అందరికీ తెలిసిన ఒక కథ గుర్తొచ్చింది’’
‘‘ఏంట్సార్ ఆ కథ’’
‘‘ఒక ఊళ్లో చంద్రన్న, కిట్టన్న అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. కిట్టన్న అవసరాల కోసం ఎప్పుడైనా పదివేల వరహాలు ఇస్తానని చంద్రన్న వాగ్దానం చేశాట్ట. ఒకరోజున వారిద్దరూ కలిసి అడవి అవతల ఉన్న పొరుగూరికి ప్రయాణం కట్టారట. అప్పుడు చంద్రన్న దగ్గర చాలా రొక్కం ఉండటం చూసి కిట్టన్న అడిగాట్ట. ‘‘అన్నా... ఇప్పుడు నీ దగ్గర చాలా రూకలు ఉన్నాయి కదా. ఎలాగూ నీతో పాటు పొరుగూరు వస్తున్నా కదా. అక్కడి సంతలో నాకు అవసరమైన సరుకులు తెచ్చుకుని బాగుపడతా. ఆ డబ్బు ఇప్పుడివ్వు అన్నా’’ అడి అడిగాట్ట. దానికి చంద్రన్న ‘‘ఇప్పుడు నాకు సొమ్మెంతో అవసరం. తర్వాత ఎప్పుడైనా ఇస్తాన్లే’’ అన్నాట్ట.
ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో దూరంగా బందిపోట్లు వస్తున్న అలికిడిని ఇద్దరూ గమనించార్ట. ఆ వెంటనే చంద్రన్న చాలా జాలిగుండె గలవాడిగా ముఖం పెట్టి... ‘‘కిట్టన్నా... నువ్వు పదివేల వరహాలు అడిగావు కదా. ఇదిగో తీస్కో. నీకు వీలైనప్పుడే తిరిగి ఇద్దువుగానీ’’ అన్నాట్ట. బందిపోట్లు వస్తున్న విషయం గమనించి కూడా... ‘హయ్యో... ఈ పాడులోకాన ఇలా పదివేల వరహాలు అడిగీ అడగగానే ఇచ్చే మంచివాడెవడయ్యా... ఇంత అమాయకుడివి ఎలా బాగుపడతావయా చంద్రన్నా’’ అంటూ అతడి దయాగుణానికీ, వితరణశీలత్వానికీ కిట్టన్న ఎంతో ఆనందించాట్ట.
ఈ కథ వినీ వినగానే అప్పటివరకూ కథ వింటున్న వ్యక్తి చర్రుమన్నాడు. ‘‘అసలు కథలో ఇలా ఉండదు. ఆ సమయంలో అప్పు ఇవ్వజూపుతున్న చంద్రన్న కుటిల బుద్ధిని కిట్టన్న అసహ్యించుకుని, అప్పు తీసుకోడానికి నిరాకరిస్తాడు కదా. అయినా మీ కథలో కిట్టన్న... సదరు చంద్రన్నను అమాయకుడంటున్నాడుగానీ అసలు బందిపోట్ల అలికిడి గమనించాక కూడా అప్పు తీసుకోదలచుకుంటున్న కిట్టన్నే కదా అమాయకుడు’’ అన్నాడా శ్రోత.
‘‘ఈ విషయం లోకంలో అందరికీ అర్థమైంది ఒక్క కిట్టన్నకు తప్ప. మరి కిట్టన్న మదిలో ఏముందో! అప్పుడెప్పుడో జరిగిందంటున్న కథ ఇప్పుడు మళ్లీ కొత్తగా జరుగుతోంది నాయనా. ఇప్పుడు లోకంలో అందరికీ తెలుసు ఆ అతితెలివి చంద్రన్న ఎవరో, ఈ అమాయక కిట్టన్న ఎవరో!’’ అంటూ కథ ముగించాడు ఏకకాలంలో నవ్వుతూ, ఏడుస్తూ కనిపించిన వ్యక్తి.
‘‘అవును. అపర దాతృత్వం నటిస్తూ, ఆపన్న హస్తం చాస్తున్నట్టున్న ఆ చంద్రన్న లాంటి మహాకుటిలాత్ముల వ్యవహారశైలికి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు. నేనైతే ఏం చేస్తానో తెలుసా?’’
‘‘ఏం చేస్తారు సార్?’’
‘‘నవ్వుతూ నాకిస్తున్న ఆఫర్ మళ్లీ ఎవ్వరికీ ఇవ్వలేని విధంగా ఆ చంద్రన్న ముఖాన నవ్వు చెరిపేలా చేస్తా. ఎప్పుడూ ప్రజలంతా నవ్వుతూ ఉండేలా చూడాలనుకుంటున్న సిన్సియర్ నేతలకే నా సహకారమందిస్తా’’