‘కోట’లో పాగా వేసేదెవరో.. | who are the winners in mahaboobabad | Sakshi
Sakshi News home page

‘కోట’లో పాగా వేసేదెవరో..

Published Mon, Apr 14 2014 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM

‘కోట’లో పాగా వేసేదెవరో.. - Sakshi

‘కోట’లో పాగా వేసేదెవరో..

పునర్విభజనలో భాగంగా 2009లో  మహబూబాబాద్(మానుకోట) పార్లమెంట్ నియోజకవర్గం తిరిగి ఏర్పాటైంది.  ఈ పార్లమెంట్ పరిధిలో గిరిజనుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బలరాంనాయక్ కేంద్రమంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. ఈసారి ఆయన టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
 
 
(తాండ్ర కృష్ణ గోవింద్, హన్మకొండ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లలో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే విజయం వరించింది.  ఆ తర్వాత ఈ స్థానం రద్దై 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు.
 
సీనియరే.. అయినా వ్యతిరేకత
 
మహబూబాబాద్  పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం  కనిపించడం లేదు.  ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక్కో పార్టీకి పట్టుంది. గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బలరాంనాయక్ అనూహ్యంగా విజయం సాధించారు.  ఈ సారి ఎన్నికల్లో మిగిలిన పార్టీ అభ్యర్థులకన్నా  బలరాం నాయక్ సీనియరే అయినా, ఆయనపై అదేస్థాయిలో వ్యతిరేకత ఉంది.
 
కోయ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ములుగు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పినపాక సిట్టింగ్ ఎమ్మెల్యే రేగకాంతారావుకు డీసీసీ అధ్యక్షపదవి ఇచ్చిన గంటలోపే ఊడిపోవడం వెనక బలరాంనాయక్ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఇది కోయవర్గం నుంచి వ్యతిరేకతను మరింత పెంచనుంది. బలరాంనాయక్‌కు సన్నిహతుడైన దొంతిమాధవరెడ్డి వరంగల్ డీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడం, నర్సంపేటలో రెబల్‌గా బరిలో ఉండడం వల్ల ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంది.
 
భద్రాచలం సబ్‌డివిజన్‌లోని వరరామచంద్రపురం, చింతూరు వంటి  మండలాలను సీమాంధ్రలో కలిపారు. ఈ ప్రభావం ఎన్నికలపై పడనుంది. గతంలో మహాకూటమి ఓట్లు తనకు అనుకూలంగా క్రాస్ అయినట్టు ఈ సారి మిత్రపక్షమైన సీపీఐ ఓటుబ్యాంకు ఇతర పార్టీల వైపు మళ్లుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
తొలిసారి బరిలో టీఆర్‌ఎస్

 
మహబూబాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తొలిసారి పోటీ చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు సంస్థాగత బలం అంతగా లేకపోవడం ఆ పార్టీకి కొంత ఇబ్బందే. ఈ జిల్లాలో ఇల్లందులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తుండటం సీతారాంనాయక్‌కి కలిసి వచ్చే అంశం.
 
టీడీపీకి గడ్డుకాలం
 
టీడీపీ నుంచి బరిలో ఉన్న బానోతు మోహన్‌లాల్ ఎదురీదుతున్నారు. డోర్నకల్, ఇల్లందులనుంచి ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు సిట్టింగ్‌లు సైకిల్ దిగి కారెక్కడంతో ఆ పార్టీ బాగా బలహీనపడింది. గత  ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో  విజయం సాధించినా ఈసారి ఇబ్బందులు తప్పడంలేదు.
 
  పినపాక, భద్రాచలంలలో ఆ పార్టీ ఎన్నడూ విజయం సాధించలేదు. మహాబూబాబాద్ అసెంబ్లీసెగ్మెంట్‌లో పార్టీ కోసం పాటుపడిన నాయకులు లేరు. మరోవైపు  కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కవిత పాతుకుపోయారు. నర్సంపేట, ములుగులలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం.  
 
 లోక్‌సభ నియోజకవర్గం:మహబూబాబాద్
 
 నియోజకవర్గం ఏర్పడింది    : 2009
 ప్రస్తుత ఎంపీ            : బలరాం నాయక్ (కాంగ్రెస్)
 ప్రస్తుత రిజర్వేషన్        : ఎస్టీ
 
 నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు:

 మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, ములుగు, ఇల్లందు, భద్రాచలం, పినపాక.  
 మొత్తం ఓటర్లు            : 13,57,806
 ఇతరులు                   : 65
 ప్రస్తుతం బరిలో నిలిచింది    : 17
 
 ప్రత్యేకతలు: ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు ఎస్టీ రిజర్వుడు స్థానాలే. గిరిజన ఓటర్ల సంఖ్య ఎక్కువ. అటవీ, ఖనిజ సంపదలకు నెలవు. ఇల్లందు, పినపాకల్లో   సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. పోలవరం ముంపు ప్రాంతాలు ఇక్కడ ప్రస్తుతం ప్రధాన సమస్య.
 
 ప్రధాన అభ్యర్థులు వీరే:
 
 బలరాం నాయక్ (కాంగ్రెస్), ప్రొ.సీతారాం నాయక్ (టీఆర్‌ఎస్),
 డాక్టర్. తెల్లం వెంకట్రావు(వైఎస్సార్‌సీపీ),మోహన్‌లాల్ (టీడీపీ)
 
 స్పీడ్‌మీదున్న ఫ్యాన్
 
మహాబూబాబాద్ నుంచి వైస్సార్‌సీపీ తరఫున టి. వెంకట్రాం బరిలో ఉన్నారు. మహాబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనకబడిన గిరిజనులే ఉన్నారు. ఇందులో చాలా మంది వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫించన్లు వంటి పథకాల వల్ల లబ్ధి పొందారు. వీరిలో  వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూలత ఉంది.
 
 ఈ ప్రభావం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాలతో పాటు వరంగల్ జిల్లాలోని డోర్నకల్, ములుగులలో పోలింగ్‌పై ఉంటుంది. నర్సంపేట నియోజకర్గంలో సీపీఎంకు గట్టి ఓటుబ్యాంకు ఉంది. పొత్తులో భాగంగా ఈ ఓటర్లు వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడితే ఇక్కడ ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.
 
 
 బలరాంనాయక్ (కాంగ్రెస్)
 
 నే.. గెలిస్తే..
1. హామహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తా.
2.  శృంగేరీ పీఠం సహకారంతో ములుగులో
3. మెడికల్ కాలేజీ ఏర్పాటు. ఇల్లందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా.  
4. హామహబూబాబాద్‌లో 500 సీట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ,
5. ఏటూరునాగారంలో సైనిక్ స్కూల్ కోసం ప్రయత్నిస్తా.
6. తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు కంతనపల్లి ప్రాజెక్టును వేగంగా పూర్తి  చేయిస్తా. భద్రాచలంలో గోదావరిపై  రెండో బ్రిడ్జి నిర్మిస్తా.
 
 బలాబలాలు..

 
 అనుకూలం

 హాపార్లమెంట్ పరిధిలో నాయకులు, ఓటర్లతో పరిచయాలు.
1.   లంబాడా సామాజిక వర్గం అండ.
2.  కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు.
3.  మంత్రి పదవిలో ఉన్నా వివాదాలకు దూరంగా ఉండటం.
 4. సొంత పార్టీలో అసమ్మతి  లేకపోవడం.
 
 ప్రతికూలం

1. కేంద్రమంత్రి పదవిలో ఉన్నా అంతగా అభివృద్ధి చేయలేకపోవడం. పెల్లెట్ పరిశ్రమ, గిరిజనవర్సిటీ ఏర్పాటు  హామీలకే పరిమితం కావడం.
2. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నర్సంపేట నుంచి రెబల్‌గా బరిలో ఉండటం,
3. రేగకాంతారావుకు డీసీసీ అధ్యక్ష పదవి దూరం కావడంతో కోయ వర్గంలో ఏర్పడిన అసంతృప్తి.
 
 
 సీతారాం నాయక్ (టీఆర్‌ఎస్)

 
 నే.. గెలిస్తే..
 
1. గిరిజన తండాల్లో గుడుంబా తయారీ నివారించి గిరిజనులకు ఉపాధి కల్పిస్తా.
2.  సహజ వనరులను  శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగించుకుంటాం.
3.  ఖనిజ సంపద ఆధారంగా కొత్త పరిశ్రమలు నెలకొల్పుతాం.
4.  మహబూబాబాద్ కేంద్రంగా జిల్లా ను ఏర్పాటు చేసి, సమగ్రాభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తా.
5.  నియోజకవర్గంలోని పీజీ కేంద్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా.
 
 బలాబలాలు..
 
 అనుకూలం

1.   ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యం,  తెలంగాణ సెంటిమెంట్.
2.    విద్యాధికుడు కావడంవల్ల విజన్‌తో పని చేస్తారనే నమ్మకం.
3.   లంబాడా సామాజిక వర్గం ఓట్లు.
4.   ఇటీవలే డోర్నకల్, ఇల్లందులలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడం
5.  సీమాంధ్రలో కలవబోతున్న పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల్లో కాంగ్రెస్‌పై గూడుకట్టుకున్న ఆగ్రహం.

 ప్రతికూలం

1.  తెలంగాణ సెంటిమెంట్‌పైనే ఎక్కువ ఆధారపడటం.
2.  ఇల్లందు, పినపాక, భద్రాచలంలలో టీఆర్‌ఎస్‌కు అనుకున్నంతగా బలం లేకపోవడం.
3.  రాజకీయాలకు కొత్త కావడం.
 
 డా. వెంక ట్రావు (వైఎస్సార్ సీపీ)
 
 నే.. గెలిస్తే..


1.   కోట్లాది మందికి లబ్ధి చేకూర్చిన వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను  తెలంగాణలో  కచ్చితంగా కొనసాగిస్తాం.
2.   పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచేందుకు కృషి చేస్తా.
3.   ఆరోగ్యశ్రీలో అన్ని రకాల రోగాలను చేర్పిస్తా.
4.   భద్రాచలం కేంద్రం జిల్లా ఏర్పాటు.
5.   గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నిస్తా.
 
 బలాబలాలు..

 
అనుకూలం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు.

1. సీపీఎంతో పొత్తుతో ఆపార్టీ ఓటు బ్యాంకు అండగా ఉండటం కలిసివచ్చే అంశం.
2. కోయసామాజిక వర్గం అండ
3. ఖమ్మం జిల్లాలో పార్టీకి లభిస్తున్న ఆదరణ
4. పోలవరం ముంపు మండలాల ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకుపోవడం.
 

ప్రతికూలం
 వరంగల్ జిల్లాలో రాజకీయాలకు కొత్త అవడం.
 
 మోహన్‌లాల్ (టీడీపీ)
 
 నే.. గెలిస్తే..

1.  తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తా. అన్ని గ్రామాల్లో మినరల్ వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేస్తా.  
2.  గిరిజన యూనివర్సిటీ మంజూరు కోసం పాటుపడతా.
3.  బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శాయశక్తులా కృషి చేస్తా.
4.   ప్రజలుకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా.
 
 బలాబలాలు..
 
 అనుకూలం

1.   బీజేపీతో పొత్తు
2.   సొంత సామాజిక వర్గం ఓట్లు
3.  ములుగు, నర్సంపేటలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ప్రతికూలం
4.   గత ఎన్నికల్లో మాదిరి క్రాస్‌ఓటింగ్ భయం
5.   చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో పార్టీపై సడలిన విశ్వసనీయత
6.   ఇల్లందు, డోర్నకల్‌లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తరఫున పోటీలో ఉండటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement