‘సచివులు’ ఎవరో!?
- ఆశలపల్లకిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు
- ‘తెలంగాణ’ తొలి సర్కారుపై జోరుగా చర్చ
- 16న తేలనున్న ప్రధాన పార్టీల భవితవ్యం
- అప్పుడే మొదలైన ‘మంత్రుల’ చర్చ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందూరు జిల్లా రాజకీయ నేతలను ఆశల పల్లకీ ఎక్కిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో తమ దంటే తమదే విజయమని ఢంకా కొడుతుం డగా.. కొత్త సర్కారులో కొలువు దీరేందుకు నేతలు పోటీ పడుతున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో జిల్లా నుంచి ఎవరికి ప్రాధాన్యం దక్కుతుందనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఆశిస్తున్నట్లు ఎవరికీ అధికారం వచ్చినా, మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఆందోళన ఆయా పార్టీల నేతల్లో కనిపిస్తోంది.
రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల కు జరిగిన ఎన్నికలు రాజకీయ పార్టీలలో ఫలి తా ల ఉత్కంఠను కలిగిస్తున్నాయి. నిజామాబాద్ లోక్‌సభ, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బో ధన్, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితా ల విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా, మిగతా స్థానాల్లో ఫలితాలు ఏ పార్టీలకు అనుకూలమన్న చర్చ కూడా ఉంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ‘తెలంగాణ’లో తొలి ప్రభుత్వం మాదేనని చెప్పుకుంటున్నా, ఆ పార్టీ నేతలలో మాత్రం ఇంకా సందిగ్ధమే ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిల్లాలో ఎవరెవరు గెలుస్తారు? ఎవరికీ మంత్రిగా అవకాశం దక్కుతుంది? అనే ఆలోచనలో పడిపోయారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందనుకున్నా కూడా ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ పార్టీ అధినేత ఇప్పటికే కొందరు సీనియర్ల పేర్లను ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, జూన్ మొదటి వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌లో ఎవరికి పదవులు దక్కుతాయి? మంత్రి పదవి వరించే టీఆర్‌ఎస్ నేతలు ఎవరు? అనే చర్చ ఆ రెం డు పార్టీల నేతలు, క్యాడర్‌లో జరుగుతోంది.
గెలుపోటములపై తేలని ఉత్కంఠ
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరిగినా, ఇంకా గెలుపోటములపై అంచనాలు కొనసాగుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం, అం దులో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనే అంశాలపైనా అదే రకమైన చర్చలు జరుగుతున్నా యి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో ఎవరు ప్రభుత్వం ఏర్పా టు చేసినా జిల్లాకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే, సీనియర్ నేత, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే ఆయనకు తప్పకుండా కీలక మంత్రిగా అవకాశం దక్కనుంది.
ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయాన్ని ఇదివరకే మోతెలో కేసీఆర్ ప్రకటించారు కూడా. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన హన్మంత్ సింధే, గంప గోవర్ధన్‌లలో ఒకరికి కూడా ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రూరల్ నుంచి బరిలో ఉన్న పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ గెలిస్తే ఏకంగా జిల్లాకు సీఎం పదవే వరించే అవకాశం లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పరిస్థితులు మారితే కీలక మంత్రిగానైనా డీఎస్‌కు ఛాన్స్ ఉంటుందంటున్నారు. షబ్బీర్‌అలీ, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి గెలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవిస్తే వారికి కూడ ఆ మంత్రివర్గంలో పెద్దపీట ఉంటుందని ఆ పార్టీ కేడర్ చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఈ నెల 16న ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.