కాంగ్రెస్‌కు మద్దతు ప్రసక్తే లేదు: వైఎస్సార్ సీపీ
► రాష్ట్ర ప్రయోజనాలే కొలబద్దగా కేంద్రంలో పాత్ర
► తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా వ్యవహరిస్తాం
► చంద్రబాబులా సాగిలబడే తత్వం మాది కాదు
► జాతీయ స్థాయిలో మా విధానం స్పష్టం
► కేంద్రంలో మద్దతుపై వక్రీకరించడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వాటిని పట్టుబట్టి సాధించుకుంటామని పేర్కొంది. కేంద్రంలో మోడీ ఉండొచ్చు, మరెవరైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే మద్దతునిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు సత్యదూరమని ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు...
► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో పైచేయి సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చునని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి పట్టుబట్టి సాధించుకోవచ్చని మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అనేకమార్లు ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. చంద్రబాబులా ఢిల్లీలో సాగిలపడిపోం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తామని పోలింగ్ ముగిసిన తరువాత పులివెందులలో జరిగిన పత్రికా సమావేశంలోనూ విస్పష్టంగా ప్రకటించారు.
► చంద్రబాబు రాష్ట్రంలో మోడీని చూపి ఓట్లు అడగ్గా జగన్‌మోహన్‌రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతామంటూ ప్రజా మద్దతు కోరిన విషయం అందరికీ తెలుసు. ఈ అంశాలను పట్టించుకోకుండా ఆంగ్ల మీడియా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై తోచిన రీతిలో కల్పితాలతో కథనాలు ఇవ్వడం సమంజసం కాదు.
► రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. 25 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికగా మా మద్దతు మోడీకా, మల్లయ్యకా, ఎల్లయ్యకా అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ప్రజల్లో భయాందోళనలు, సందిగ్ధతను సృష్టిం చేందుకు పార్టీ వైఖరిని వక్రీకరిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలి.
జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, బాలశౌరి తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పోలింగ్ సరళి గురించి వారు పార్టీ అధినేతకు వివరించారు.