ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో యువత ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకం కానున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 18-29ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లే నిర్ణేతలు కానున్నారు. మొత్తం ఓట్లలో 28శాతం యువ ఓటర్లే ఉన్నారు. నియోజక వర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి గెలుపు వేయి నుంచి 15 వేల ఓట్ల లోపు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములు ఎక్కువగా యువత ఓటు పైనే ఆధారపడి ఉన్నాయి.
ప్రస్తుతం మొత్తం ఓటర్లసంఖ్య 1,96,056 ఉండగా అందులో 18-29 ఏళ్లలోపు ఉన్నవారు 57,661 ఉన్నారు. 30-39 ఏళ్ల మధ్య ఓటర్లు 48,355 ఉండగా, అంతకు పైబడిన వారు 90,040 ఓటర్లు ఉన్నారు. యువత, మధ్యవయస్సు వారివి కలిపితే 1,06,016 ఓటర్లు ఉన్నారు. వీరే ఎన్నికల్లో కీలకం కానున్నారు. ఓటింగ్ శాతం కూడా 18-39 వయస్సు ఉన్నవారి నుంచే ఎక్కువగా అవుతుండటంతో అభ్యర్థుల ఆశలన్నీ వారిపైనే ఉన్నాయి.
యువత ఎక్కువగా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నప్పటి నుంచి నియోజకవర్గ అభ్యర్థి గెలుపు కేవలం 10 వేల ఓట్ల తేడాతోనే ఉంటుంది. 1983లో 7,726ఓట్లతో టీడీపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి గెలిచారు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి 12,988 ఓట్లతో గెలిచారు. 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నేరేళ్ల ఆంజనేయులు కేవలం 1,716 ఓట్లతో గట్టెక్కారు. ఆయనే 1994 ఎన్నికల్లో 15,707 ఓట్లతో, 1999లో 1,317 ఓట్లతో గెలిచారు. 2004లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగురవీందర్‌రెడ్డి 10,471 ఓట్లతో విజయం సాధించగా, 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌గౌడ్ 12,345 ఓట్లతో గెలిచారు. ఒక్క 2009 ఎన్నికల్లో మాత్రం టీడీపీ-టీఆర్ ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయగా రవీందర్‌రెడ్డి 36,770 ఓట్లతో గెలుపొందారు. ఇలా నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ఎక్కువ శాతం పదివేల ఓట్ల తేడాతోనే ఉన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులంతా యువజపం చేస్తున్నారు.
అభ్యర్థి భవిత నిర్ణయించేది యువత
Published Sat, Apr 19 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement