లోక్‌సభ పోరులోనూ గులాబీ హోరు
సాక్షి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయదుందిభి మోగించింది. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మెదక్ నుంచి టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 3,97,029 ఓట్ల మెజారిటీతో గెలుపొంది కొత్త చరిత్ర సృష్టించారు. కేసీఆర్ 6,57,492 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి. శ్రవణ్ కుమార్ రెడ్డికి 2,60,463 ఓట్లు, టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌కు 1,81,804 ఓట్లు పోలయ్యాయి.
1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు 2.19 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా.. తాజాగా కేసీఆర్ ఇంతకు మించి భారీ మెజారిటీ సాధించి ఇందిరా పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 11,93,548 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా .. కేసీఆర్‌కు 55.08 శాతం ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ రెడ్డికి 21.82, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్‌కు 15.23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా.. మెదక్ లోక్‌సభ స్థానానికి రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయాల్సి రానుంది.
జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1,44,631 ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌పై గెలుపొందారు. బీబీ పాటిల్‌కు 5,08,661 ఓట్లు పోలు కాగా సురేష్ షెట్కార్ 3,64,030 ఓట్లు, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు 1,57,497 ఓట్లు సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దు అయి జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఆవిర్భవించిన విషయం తెలిసిందే.
మొత్తం 10,97,242 ఓట్లు పోలుగా టీఆర్‌ఎస్‌కు 46.35 శాతం, కాంగ్రెస్‌కు 33.13 శాతం, టీడీపీకి 14.35 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సురేష్ షెట్కార్ నాటి టీఆర్‌ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్‌పై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1.44 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి కొత్త రికార్డును సృష్టించారు.