వీళ్లే కీలకం
సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో యువత ఓటు కీలకం కా నుంది. యువతరం మనస్సు దోచుకున్న నేతలు తాము ఆశించిన స్థానం దక్కించుకోవడం ఖాయం. ఈ ఏడాది జనవరి నాటికి జిల్లాలో మొత్తం ఓటర్లు 29,00,500 కాగా అందులో 18 నుంచి 39 సంవత్సరాల వారు 16,15,860 మంది. దీన్నిబట్టి సగానికి పైగా ఓటర్లు యువతేనని స్పష్టం అవుతోంది. వీరిలో 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 71,156 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో యువత తీసుకునే నిర్ణయం అభ్యర్థులతో పాటు ఆయా రాజకీయపార్టీల తలరాతలను నిర్దేశించబోతోంది.
యువత మనసు దోచుకుంటే గెలుపు అవకాశాలు మెరుగుపరచుకున్నట్టే. ఇందుకు గత ప్రభుత్వాల హయాంలో యువతకు ఇచ్చిన ప్రాధాన్యం పరిశీలించాల్సిన అవసరం ఉంది.చంద్రబాబు హయాం నుంచి నిన్నటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరకు పరిశీలిస్తే మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వయస్సు సడలింపుతో పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు రీ యింబర్స్‌మెంట్ వంటి పథకాలు యువతకు ఎంతో ప్రయోజనం కల్పించాయి.
కళాశాల స్థాయి నుంచి వృత్తి విద్యా కోర్సులు, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దోహదం చేసింది. చంద్రబాబు నేతృత్వంలో విద్యార్థులకు సకాలంలో మెస్ చార్జీలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో రకరకాల కారణాలు చూపిం చి ఫీజు రీయింబర్స్‌మెంట్ లబ్ధిదారుల్లో కోత వేశా రు. వైఎస్ హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం కూడా మేలు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా జబ్బులు నయం చేసుకున్న వారిలో నిరుపేద యువత కూడా ఉంది. అంతకుముందు చంద్రబాబు హయాంలో అసలు ఇటువంటి పథకమే లేదు. ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ కూడా అప్పట్లో అంతంతమాత్రమే. వైఎస్ తరువాత ముఖ్యమంత్రులుగా నియమితులైన కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోగ్యశ్రీ కొనసాగించినప్పటికీ పలు జబ్బులను ఈ పథకం నుంచి తొలగించారు. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వైఎస్ హయాంలో రాజీవ్ ఉద్యోగశ్రీ పథకం కొనసాగిం చారు.
యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారికి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించిన ఘనత వైఎస్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయస్సు సడలింపు ద్వారా జిల్లాలో యువకులకు ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలకు పాతర వేశారు. ఉపాధ్యాయ నియామకాలు మినహాయిస్తే ప్రభుత్వ కొలువులు పొందిన వారు తక్కువ. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలను ప్రోత్సహించిన ప్రభుత్వం కూడా చంద్రబాబుదే.