రూ.200 పింఛన్‌ను 700 చేస్తా: వైఎస్ జగన్ | Ys jagan mohan reddy assures to increase disabled pensions | Sakshi
Sakshi News home page

రూ.200 పింఛన్‌ను 700 చేస్తా: వైఎస్ జగన్

Published Wed, Mar 19 2014 2:21 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Ys jagan mohan reddy assures to increase disabled pensions

* రాజమండ్రి రోడ్‌షోలో తనను కలిసిన వృద్ధులు, వితంతువులకు జగన్ భరోసా
* నాన్న ఓ పెద్దకొడుకులా మీ కోసం ఆలోచించారు..
* రూ.75గా ఉన్న పింఛన్‌ను రూ.200 చేశారు
* వైఎస్ వెళ్లిపోయాక ప్రభుత్వం ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు
* నేను మీ మనవడిలా మీ కోసం ఆలోచిస్తున్నాను..
* సీఎం కాగానే రెండో సంతకం పెన్షన్ల ఫైలుపైనే చేస్తా..
* నాన్నలాగే ఒకటో తేదీనే పింఛను ఠంఛనుగా అందిస్తా..

 
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: వృద్ధులు, వితంతువులకు రూ.200గా ఉన్న పింఛన్‌ను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.700 చేసి వారిని ఆదుకుంటానని, వికలాంగులకు రూ.1000 పింఛన్‌ను అందేలా చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాను సీఎం కాగానే పెన్షన్ల ఫైలు మీదే రెండో సంతకం చేస్తానని, చంద్రబాబులా అబద్ధపు హామీలివ్వనని, మాట తప్పనని ఉద్ఘాటించారు. ‘‘చంద్రబాబు రాక్షస పాలనలో.. ముష్టివేసినట్లు రూ.75 పింఛను ఇచ్చేవారు. అప్పటికే పింఛను పొందుతున్న వారెవరైనా చనిపోతే కానీ కొత్తవారికి ఇచ్చేవారు కాదు.
 
 ఆసరా లేని వారికి అండగా ఉండాలన్న సంకల్పంతోనే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అర్హులైనప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేశారు. అది కూడా రూ.75 ఉండే పింఛన్‌ను రూ.200కు పెంచి ప్రతి నెలా ఠంచన్‌గా 1వ తేదీనే ఇంటిముంగిటికే వచ్చేలా చేశారు. ఆపన్నుల మోములో ఆనందం చూడాలని ఆయన తపించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఆ మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం కాదు కదా కనీసం ఉన్న వారికి కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. నాడు మా నాయన ఓ పెద్దకొడుకులా మీకోసం ఆలోచిస్తే.. మీ మనవడిలా నేను మీకోసం ఆలోచిస్తున్నాను’’ అని జగన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మంగళవారం రాజమండ్రి నగరంలో రోడ్‌షో నిర్వహించారు. దారిపొడవునా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలు జగన్‌ను కలసి తమకు పింఛను అందడంలేదని, వచ్చే పింఛను సరిపోవడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు.
 
 రెండు నెలలు ఓపిక పట్టండి: ‘‘నాయనా మాకు పింఛన్ అందడం లేదు.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. ఆసరా లేకుండా ఉన్నాను.. పింఛన్ ఇప్పించి ఆదుకోండి బాబూ’’ అంటూ గోరక్షణపేట సెంటర్‌లో వృద్ధులు షేక్ బేగం, డి.నాగ వేణి, పి.వరలక్ష్మి తదితరులు జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. ‘‘మరో రెండు నెలల్లో మనం కలలుగనే రాజన్న రాజ్యం వస్తుంది.. అప్పుడు వృద్ధులకు ఏడొందలు.. వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పిస్తాను’’ అంటూ జగన్ వారిలో మనోధైర్యం నింపారు. అలాగే మేదరపేటకు చెందిన పాటి నాగేశ్వరరావు జగన్‌ను కలిసి.. స్కూటర్ ఢీకొట్టడంతో కాలు పోయిందని, వికలాంగుల పింఛన్ కూడా రావడంలేదని, ఆదుకోవాలని కోరగా ‘‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది.. నీకు వెయ్యి పింఛన్ వస్తుంది. ధైర్యంగా ఉండు’’ అని ఆయన భరోసా ఇచ్చారు.
 
 మందులు కొనుక్కోమంటున్నారయ్యా:
‘‘అయ్యా మీ నాయన దయ వల్ల రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. కొంతకాలం మందులు ఉచితంగానే ఇచ్చేవారు. ఇపు్పుడు మందులు కొనుక్కోమంటున్నారు. నా దగ్గర డబ్బుల్లేవు.. ఎలా కొనుక్కుంటాను? నేను ఎలా బతకగలను?’’ అంటూ జాంపేట మార్కెట్‌లోని బాలయోగి వీధికి చెందిన బోనుల పసమ్మ జగన్ వద్ద బావురుమంది. అజాద్‌చౌక్ సెంటర్‌లో జననేతను కలిసి ఆదుకోవాలని మొరపెట్టుకుంది. త్వరలోనే మంచిరోజులు వస్తాయని జగన్ ఆమెకు అభయమిచ్చారు.
 
 ప్రజాభిమానం ముందు చిన్నబోయిన భానుడు
  రాజమండ్రి నగరంలో జగన్ రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. నడినెత్తిన సూరీడు నిప్పులు చెరుగుతున్నప్పటికీ జనం లెక్కచేయకుండా జగన్ కోసం రోడ్లకిరువైపులా బారులు తీరారు. దీంతో రోడ్‌షో సాగిన దారులన్నీ జనగోదారులయ్యాయి. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన జగన్ రోడ్‌షో నగర పురవీధుల మీదుగా 10 కిలోమీటర్ల మేర ఎనిమిది గంటలపాటు సాగింది. ప్రజలు వరద గోదావరిలా వెల్లువెత్తడంతో పర్యటన ఆద్యంతం తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. రోడ్ షో అనంతరం వేమగిరి, కడియపులంక, జొన్నాడ, రావులపాలెం మీదుగా 9.30 గంటలకు అమలాపురం చేరుకున్న జగన్.. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిట్టబ్బాయి ఇంటిలో బస చేశారు. జగన్ బుధవారం అమలాపురంలో రోడ్‌షో, ముమ్మిడివరం సభలో పాల్గొననున్నారు.

 వైఎస్సార్ రుణం తీర్చుకుంటా: ముత్యాలపాప
 విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప మంగళవారం రాజమండ్రిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జగన్‌ను కలిసి వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ తనను పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్లేనన్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.
 
 పార్టీలోకి చేరికలు
 విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కందుల రఘుబాబు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న రాజమండ్రిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. బేబీనాయన ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి జగన్ తన పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. జగన్ పర్యటనలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, విజయనగరం, శ్రీకాకుళం పార్టీ జిల్లా అధ్యక్షులు పెన్మత్స సాంబశివరాజు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, రౌతు సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,  విజయనగరం, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకులు బేబి నాయన, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, రాజమండ్రి నగర , రూరల్ కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
 
 
 నాన్నతో ఫోన్‌లో మాట్లాడన్నా..
రాజమండ్రి ఐఎల్‌టీడీ సెంటర్‌లో జగన్ రోడ్‌షో సాగుతుండగా అరుణ అనే విద్యార్థిని పరుగుపరుగున వచ్చింది. ‘అన్నా వైఎస్ చలవతోనే చదువుకుంటున్నాను. మా నాన్న కూడా మిమ్మల్ని చూసేందుకు రావాలని ఆశపడ్డారు. కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారన్నా.. ఒకసారి ఫోన్‌లో మాట్లాడన్నా’ అని అరుణ ఫోన్‌చేసి జగన్‌కు ఇచ్చింది. ఫోన్‌లో అరుణ తండ్రిని పలకరించిన జగన్ ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ‘పాపను బాగా చదివించు.. త్వరలో మంచి రోజులువస్తాయి. అందరూ చల్లగా ఉంటారు’ అని భరోసా ఇచ్చారు. అదే సెంటర్‌లో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న మట్టా జ్యోతిని చూసి చలించిన జగన్ వాహనం దిగి నేరుగా ఆమె ఇంటికెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆమె కష్టాలు విని అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement