కడలి తరంగం
‘నువ్వే గెలుస్తావు నాయనా.. నీకు ఓటు వేయడానికే ఇన్నాళ్లు బతికున్నాను’ అని ఓ వృద్ధుడు.. ‘నిండు నూరేళ్లు సల్లగా ఉండు తండ్రీ.. మీ నాన్నలాగా ప్రజల్ని చల్లగా చూడు’ అంటూ ఓ అవ్వ.. ‘మీ నాన్న పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం వల్లే నా మనవరాలికి ఆపరేషన్ చేయించా.. మీ కుటుంబం బాగుండాలి బాబు’ అంటూ ఓ అమ్మమ్మ.. ‘ధరలు పెరిగిపోయాయి.. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కట్టుకోలేక పోతున్నా.. నువ్వు అధికారంలోకి వచ్చాక పేదోళ్ల గూడు సంగతి చూడు తమ్ముడూ’ అంటూ ఓ అక్క.. ‘జగనన్నా నువ్వు ముఖ్యమంత్రి కావల్ల.. మాలాంటోళ్లను ఆదుకోవల్ల’ అంటూ ఓ వికలాంగుడు.. ‘మా స్టూడెంట్స్ అంతా జగన్ అన్నకే ఓటు వేస్తామని అంటున్నారు.. నా ఓటు నీకే.. నువ్వు అధికారంలోకి వస్తేనే మాకు ఫీజులు వస్తాయి..పై చదువులకు అవకాశం కుదురుతుంది.. బెస్టాఫ్ లక్ అన్నా’ అంటూ విద్యార్థులు.. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కదిపినా బుధవారం జననేత జగన్మోహన్‌రెడ్డి పర్యటనలో ఇవే మాటలు వినిపించాయి.
సాక్షి, అనంతపురం : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన కళ్యాణదుర్గం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. జననేత పర్యటనలో అడుగుతీసి.. అడుగు పెట్టలేని విధంగా జనం పోటెత్తారు. రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరడంతో జననేత వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
ప్రతి చోటా కార్యక్రమంలో షెడ్యూల్ సమయం కన్నా మూడు..నాలుగు గంటలు ఆలస్యమైంది. ఓ వైపు బాణుడు చండ్రనిప్పులు కక్కుతున్నా.. అడుగడుగునా అభిమాన ప్రవాహం అడ్డుపడగా, అందరితోనూ ఆత్మీయంగా మాట్లాడుతూ.. అందరి సమస్యలను సావధానంగా వింటూ ముందుకుసాగారు. దీంతో రోడ్ షో ప్రతిచోటా ప్రకటించిన సమయాని కంటే బాగా ఆలస్యంగా సాగింది.
కడలి తరంగంలా కళ్యాణదుర్గం
మంగళవారం రాత్రి రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరులో రోడ్‌షో అనంతరం కళ్యాణదుర్గం చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోయ తిప్పేస్వామికి చెందిన శెట్టూరు మార్గంలోని మామిడితోటలో బస చేశారు. ఉదయం 11.20 గంటలకు జగన్ బయటకు రాగానే.. ఆ ప్రాం తమంతా జనసందోహంతో నిండిపోయింది. జననేతను చూసిన జనం జై..జగన్..జైజై..జగన్ అంటూ ఒక్కసారిగా నినదించడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్‌షో పట్టణంలోని టీ సర్కిల్‌కు చేరుకునేసరికి మధ్యాహం 12.30 గంటలైంది. కాగా తిప్పేస్వామి మామిడితోట నుంచి టీ సర్కిల్ వరకు జనం వరద కాలువలా బారులు తీరారు.
కళ్యాణదుర్గం చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జనం పోటెత్తడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైల్లు పరుగెత్తాయి. టీసర్కిల్ జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడి చీకటి పరిపాలనను గుర్తు చేస్తూ జగన్ చేసిన ప్రసం గం ప్రజలందర్నీ ఆకట్టుకుంది. మహానే త డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల మధ్య నుం చి వెళ్లి సరిగ్గా నాలుగున్నర సంవత్సరాలవుతోంది.. అయినా ఆయన మీ మధ్య ఉన్నాడనిపిస్తోందని జగన్ అన్నారు. ఈ క్రమంలోనే మహానేత ఎక్కడున్నాడని జగన్ ప్రశ్నించగా.. ప్రజలు ఒక్కసారిగా మాగుండెల్లో ఉన్నాడంటూ చేతులు పెకైత్తి నినదించారు. రాముడి రాజ్యం మనం చూడలేదని జగన్ అనగానే.. మేము రాజన్న రాజ్యం చూశామని ప్రజలు ప్రతిస్పందించడంతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు ఎలాంటి ముఖ్యమంత్రి కావా లో మీరో తేల్చుకోవాలని జగన్ ప్రజలకు సూ చించగా ఇంకెవరు.. మీరే మా ముఖ్యమంత్రి అంటూ ప్రజలు పెద్ద పెట్టున నినదించి మరోమారు జననేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పోటెత్తిన పెనుకొండ
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు పెనుకొండకు రావాల్సిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి 8.45 గంటలకు చేరుకున్నారు. జననేతను చూసేందుకు నియోజకవర్గ ప్రజలు మధ్యాహ్నం 3 గంటలకే పెనుకొండకు చేరుకుని తమ అభిమాన నేత కోసం రాత్రి వరకు వేచి ఉన్నారు. తొలుత పెనుకొండ వీధుల్లో రోడ్‌షో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి.. అంబేద్కర్ సర్కిల్‌లో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆద్యంతం ప్రజల కరతాళ ధ్వనుల మధ్య సాగింది. జగన్ చేసిన ప్రతి ప్రసంగానికి జనం ఈలలు, కేకలు వేసి అభిమానాన్ని చాటారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏ గడ్డైనా తింటాడని అన్నపుడు ‘ఔను..ఔను’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. మహానేత గర్వపడేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదవాడికి వరంలా చేస్తానని అన్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పం దన వ్యక్తమైంది.
పమాదాల బారిన పడిన వారికి ఉచిత చికిత్సతో పాటు వారు కోలుకునేంత వరకు వైద్యుల సూచనల మేరకు.. నెలకు రూ.3వేలు చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక చేయూతనిస్తానని చెప్పినపుడు జనం ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చదువును పూర్తి చేసుకుని..ఉద్యోగం కోసం వేచి చూస్తున్న ప్రతి నిరుద్యోగ విద్యార్థికి ఉద్యోగం ఇప్పించేందుకు ఒక అన్నలా కృషి చేస్తానని అన్నపుడు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన కనిపించింది. పెనుకొండలో శంకర్‌నారాయణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రిగా చేసి మీ ముందుకు పంపుతానని జగన్ అన్నప్పుడు ‘కచ్చితంగా గెలిపిస్తాం’ అంటూ ప్రజ లు నినదించారు. మన పార్టీ కొత్త పార్టీ.. మన గుర్తు ఫ్యాన్ గుర్తు మీలో ఎంతమందికి మన గుర్తు తెలుసో చెప్పండి అని జగన్ అన్నపుడు వేలాది చేతులు ఒక్కసారిగా పైకి లేచాయి.
మొత్తానికి బుధవారం రోడ్‌షో సాగిన చోటం తా జనం బారులు తీరి జననేతకు స్వా గతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో అనంతపురం ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, వైఎ స్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అభ్య ర్థి శ్రీధర్‌రెడ్డి, కళ్యాణదుర్గం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాలగుండ్ల శం కర్‌నారాయణ, అనంతపురం ఎమ్మెల్యే బి.గుర్నాథ్‌రెడ్డి, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, పైలా నరసిం హయ్య, బాబురెడ్డి అలియాస్ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
భానుకోటలో జన విస్పోటనం
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బహిరంగ సభ అనంతరం కంబదూరు మండలం మల్లాపురం, పాలవాయి, ఎగువపల్లి,రాంపురం, దేవేంద్రపురం, భట్టుబానిపలి,్ల నూతిమడుగు మీదుగా సాయంత్రం 4.25 గంటలకు రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని భానుకోటకు చేరుకున్న జగన్ అక్కడ రోడ్‌షో నిర్వహించారు. అప్పటికే జనం రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. జననేతను చూసి ఒక్కసారిగా పులకించిపోయారు. వారి ఆప్యాయతలకు లోనైన జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కాగా కనగానపల్లి నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు సైతం భానుకోట వద్ద ఆగిపోవడంతో అందులోని ప్రయాణీకులందరూ కిందకు దిగి జననేతను చూడడానికి , కర చాలనం కోసం ఎగబడ్డారు.
అనంతరం తరగకుంట చేరుకున్న జగన్.. మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రోడ్‌షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రి 7.10 గంటలకు క నగానపల్లి క్రాస్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసందోహాన్ని చూసి చిరునవ్వుతో వారిని పలకరిస్తూ.. రోడ్‌షో ద్వారా అభివాదం చేస్తూ ముందుగా నడిచారు. 7.50 గంటలకు మామిళ్లపల్లికి చేరుకుని మామిళ్లపల్లి క్రాస్‌లోని మహానేత విగ్రహానికి రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో కలసి పూలమాల వేసి నివాళి అర్పించారు.