ముంచెత్తిన మమత
పి.గన్నవరంలో జగన్; మలికిపురం,
కొత్తపేటల్లో షర్మిల ఎన్నికల ప్రచారం
అన్నాచెల్లెళ్లకు బ్రహ్మరథం పట్టిన కోనసీమ
అడుగడుగునా పరవళ్లు తొక్కిన అభిమానం
మండుటెండలోనూ గంటల తరబడి నిరీక్షణ
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ జనభేరి పేరుతో ఓ పక్క వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి, మరోపక్క ఆయన సోదరి షర్మిల శనివారం జరిపిన పర్యటన కోనసీమవాసుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మరో మూడు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయం కోసం అన్నాచెల్లెళ్లు కోనసీమలోని రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్నారు. ఇద్దరూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి కోనసీమలోకి అడుగు పెట్టారు. సమయం లేకపోయినా కోనసీమవాసులపై ఉన్న అభిమానంతో జగన్‌మోహన్‌రెడ్డి పి.గన్నవరంలో జరిగిన వైఎస్సార్ జనభేరిలో పాల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన పశ్చిమలో పర్యటన ముగించుకొని జిల్లాలోని పి.గన్నవరంలో వైఎస్సార్ జనభేరిలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో బయలుదేరి విశాఖ వెళ్లాలి. పశ్చిమగోదావరి నుంచి బయలుదేరేసరికే నాలుగుగంటలు దాటడంతో పి.గన్నవరం పర్యటన రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గన్నవరంలో జగన్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది తమ అభిమాన నాయకుడిని చూడలేకపోతామేమోనని కలవరపడ్డారు.
సమయం మించినా..గన్నవరం వచ్చిన జననేత
అయితే గన్నవరంలో వేలాది మంది అభిమానులు మండు టెండను సైతం లెక్క చేయకుండా తన కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారని తెలుసుకున్న జననేత ఎంత ఆలస్యమైనా గన్నవరం వచ్చాకే విశాఖ వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పాలకొల్లు నుంచి సాయంత్రం 4.10 గంటలకు పి.గన్నవరం చేరుకున్నారు. ఆకాశంలో హెలికాప్టర్‌ను చూడగానే జనం ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. జగన్ రాకతో వందలాది మంది యువకులు భారీ జెండాలు, బైకు ర్యాలీలతో హోరెత్తించారు. గన్నవరం సెంటర్ నుంచి మూడువైపులా రహదారులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయాయి. సుమారు 25 నిమిషాల పాటు సాగిన జగన్ ప్రసంగానికి అడుగడుగునా ప్రజలు జేజే ధ్వానాలు పలికారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్ విశ్వసనీయతకు పట్టం గట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ ‘జోహార్ వైఎస్సార్.. జై జగన్’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.
మలికిపురం తరలి వచ్చిన‘రాజోలు దీవి’
ఇక జగన్ సోదరి షర్మిల పశ్చిమగోదావరి జిల్లా గణపవరం నుంచి నేరుగా మలికిపురం చేరుకున్నారు. రాజోలు దీవి నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. షర్మిల తన ప్రసంగంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లు పట్టం గట్టిన కుప్పం పంచాయతీని కనీసం మున్సిపాలిటీ కూడా చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. సుదీర్ఘంగా చేసిన షర్మిల ప్రసంగంలో ప్రతి పలుకుకూ జనం స్పందించారు.అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఆలోచించని బాబు ఇప్పుడు వారిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని, దాన్ని నమ్మితే నట్టేట ముంచుతాడని హెచ్చరించారు. ‘జగనన్నకు ఒక్కసారి అవకాశమిస్తే జీవితాన్ని మీకు అంకితం చేస్తా’డన్నప్పుడు ప్రజలు జేజే ధ్వానాలు పలికారు. మలికిపురం వైఎస్సార్ జనభేరి ముగించుకున్న షర్మిల తిరిగి పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వెళ్లారు. అక్కడ జనభేరి అనంతరం రాత్రి 9.15 గంటలకు తిరిగి రావులపాలెం మీదుగా కొత్తపేట చేరుకున్నారు.
జనం పోటెత్తిన కొత్తపేట..
సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వేలాదిగా జనం పోటె త్తడంతో కొత్తపేట కిక్కిరిసిపోయింది. అటు అంబాజీపేట, ఇటు రావులపాలెం రహదారులు జనంతో కిటకిటలాడాయి. షర్మిల రాగానే వేలాది మంది ఎదురేగి మరీ స్వాగతం పలికారు. కొత్తపేటలో కూడా షర్మిల సుమారు ముప్పై నిమిషాల పాటు ప్రసంగించారు. ఇక్కడ కూడా చంద్రబాబు తీరును ఎండగడుతూ జగన్ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు. ఐదు సంతకాలతో రాష్ర్ట దశదిశలను జగనన్న మార్చబోతున్నాడన్నప్పుడు హర్షధ్వానాలు మార్మోగాయి. అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు అసెంబ్లీ అభ్యర్థులు కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, బొంతు రాజేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, పార్టీ నేతలు మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్‌రాజు పాల్గొన్నారు.