తూ.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ఆయన పాలన రాష్ట్రానికి పట్టిన పీడకలగా మిగిలిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా తాళ్లరేవులో ప్రసంగించిన విజయమ్మ ..ఆనాటి టీడీపీ పాలనను కడిగిపారేశారు. చంద్రబాబు పాలనలో ఏదీ సక్రమంగా అమలు జరగలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనంతా కుంభకోణాలమయంగా ఆమె అభివర్ణించారు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పేరు చెప్పే అర్హత లేదన్నారు. సమైక్యాంధ్ర ముసుగేసుకుని కిరణ్ సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. పీఆర్పీని స్థాపించి ఆ తరువాత కాంగ్రెస్ విలీనమైన చిరంజీవి చరిత్రను ఎవరూ మరిచిపోరన్నారు. ఆయనది అభిమానులను తాకట్టుపెట్టిన చరిత్రని విజయమ్మ మండిపడ్డారు.
ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెబుతున్న వీరి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితే లేదన్నారు. ప్రజా అభివృద్ధిని సక్రమైన మార్గంలో చేసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉందని, ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ గెలిపించుకుని చరిత్ర సృష్టిద్దామని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్సార్ గుర్తు చేసుకుని పార్టీని అఖండ మెజారిటీ గెలిపించాలన్నారు.