పెదపాడు, న్యూస్‌లైన్ : ‘పంటలు దెబ్బతినడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చం ద్రబాబు అప్పట్లో హేళన చేశారు. ఈ విషయూల్ని ప్రజలెవరూ మర్చిపోలేదు. ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ నిలదీశారు. పెదపాడు మండలం కొత్తూరులో దెందులూరు ఎమ్మెల్యే అ భ్యర్థి కారుమూరి నాగేశ్వరావుతో కలసి మంగళవారం ఆయన ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి చంద్రశేఖర్ మాట్లాడారు. మే 7వ తేదీన మహా సంగ్రామంజరగబోతోందని, ప్రజల తలరాతల్ని మార్చే వజ్రాయుధం వారి చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మేలు చేసే నాయకులెవరో ఆలోచించి మంచి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
చాలా గ్రామాల్లో అర్హులైన వారికి నేటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈ విషయంపై గత పాలకులను నిలదీయాలని సూచించారు. ఆ హక్కును ప్రజలకు రాజ్యాంగం కల్పించిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశాడో టీడీపీ నాయకులను నిలదీయూలన్నారు. తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజలపై పన్నుల భారం పెంచి వారి నడ్డివిరిచిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తుపాకులతో రైతులను కాల్పించిన మహానుభావుడు, అంగన్‌వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాలని ధర్నా చేస్తే గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు కూడా ఆయనేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తే.. ధరను రూ.5.25కి పెంచి పేదల నోటికాడ కూడు లాక్కున్నాడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు బెల్ట్ షాపులు పెట్టించి మధ్యాన్ని ఏరులై పారించాడని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా, ప్రతినిధులుగా ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు.
రాజశేఖరరెడ్డి హయూంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా అన్నివర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని వివరించారు. వైఎస్సార్ హయాంలో లబ్ధి పొందిన వారంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. మహిళలకు రూ.78 లక్షల కోట్లను వైఎస్ రుణాలుగా ఇచ్చారని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు రూ.11 వేల కోట్ల రుణాలను రద్దు చేశారన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. దెందులూరు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి సమస్యలను తీర్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.17 వేల కోట్ల నిధులను వైఎస్ కేటాయించారని గుర్తు చేశారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఉపయోగపడేలా అనేక పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయనున్నారని తెలిపారు. ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో గ్రామంలోనే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పేదలకు రూ.వందకే 150 యూనిట్ల విద్యుత్, ఏటా 10 లక్షల ఇళ్లు, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపడతామని వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తణుకు నుంచి పోటీ చేయూలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశించారని, ఆయన ఆశీస్సులతో ఆ నియోజకవర్గాన్ని రూ.600 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెందులూరు నియోజకవర్గానికి తనను పంపించారని, ఇక్కడి ప్రజలకు సేవ చేయూలని ఆదేశించారని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాను తిరిగానని చాలాచోట్ల పిడికెడు మట్టితో రోడ్లు కూడా వేయలేదని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీమంత్రి మరడాని రంగారావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఘంటా ప్రసాదరావు, ఊదరగొండి చంద్రమౌళి, ముంగర సంజీవకుమార్, యువజన నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి, అక్కినేని రాజశేఖర్, గొట్టాపు నరసింహరావు, కత్తుల రవికుమార్ పాల్గొన్నారు.