నేడు జిల్లాకు జననేత జగన్
* కర్నూలు, నంద్యాలలో పర్యటన
* ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక ఉదయం 9.30 గంటలకు కర్నూలు
* కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగసభ
* 11.30 గంటలకు నంద్యాల పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో జనభేరి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాజన్న బిడ్డ రాక కోసం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్రను సృష్టించేందుకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆయన రాక ప్రత్యేకతను సంతరించుకుంది. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగేందుకు.. తన విశ్వసనీయతను ప్రజలకు వివరించేందుకు సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌షో నిర్వహించి.. ఉదయం 9.30 గంటలకు కొండారెడ్డి బురుజు వద్ద జనభేరి సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో నంద్యాలకు వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు అక్కడి పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు రోడ్‌షో ద్వారా చేరుకుని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లోనే అనంతపురం జిల్లాకు వెళ్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ జగన్ జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
మొదటి విడతలో పత్తికొండ, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన జనభేరి సభలకు జనం నీరాజనం పలికారు. తొమ్మిదేళ్ల టీడీపీ, వైఎస్ మరణానంతరం నాలుగున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించడంతో ప్రజలను ఆలోచింపజేసింది. విశ్వసనీయత చుట్టూ సాగిన ఆయన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరో విడత ఆయన జిల్లాలో పర్యటించనుండటం శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతోంది. జనభేరి సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వసన్నద్ధమవుతున్నారు.
జనభేరికి తరలిరండి
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన జనభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎస్.వి.మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9.30 గంటలకే జనభేరి బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.