
పద్మావతి రిలీజ్ కాబోతోంది! ఎప్పుడు అనేది తర్వాత. ఇప్పుడైతే సెన్సార్‌బోర్డు ఓకే చేసింది. యు.ఎ. సర్టిఫికెట్ ఇచ్చేసింది. పెద్దలు చూడొచ్చు. పిల్లలూ చూడొచ్చు. మరి ఇప్పటి వరకు గొడవ గొడవ చేసినవాళ్లు చూడొద్దా? చూడొచ్చు. వాళ్ల కోసమే బోర్టు కొన్ని సీన్స్‌ని కట్ చేయిస్తోంది. కొన్ని అంటే ఓ 26. పేరును కూడా మార్చాలట! ‘పద్మావత్’ అని! అంతేకాదు, సినిమా స్టార్ట్ అయ్యే ముందు, మధ్యలో కొన్ని సీన్లు వచ్చినచోట ‘డిస్‌క్లెయిమర్’ పెట్టమంది. అంటే.. ఇవి మా బుద్ధికి పుట్టినవి కావు. అక్కణ్ణుంచి, ఇక్కణ్ణుంచి తీసుకున్నవి మాత్రమే అని.
ఇవన్నీ చేశాక, మళ్లీ సెన్సార్ టీమ్ అంతా ఒకసారి కలిసి సినిమాను చూస్తుందట. ఆ తర్వాత మాత్రమే భన్సాలీని పిలిచి, ‘ఇదిగో బాబూ.. సర్టిఫికెట్. ఇక నీ సినిమా ఆడించుకో’ అని చెప్తుందట. భన్సాలీ ఇవన్నీ చేస్తాడా? లేక లీగల్‌గా ఫైట్ చేసి తన ‘పద్మావతి’ని చెక్కుచెదరకుండా ప్రదర్శించుకుంటాడా? అదేం తెలియడం లేదు. నిర్మాతలు కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. రిలీజ్‌కు ఓకే చెప్పి, కొన్ని షరతులు పెట్టిన సెన్సార్‌బోర్డు రోజుకో న్యాయ నిర్ణేతల టీమ్‌ని రప్పించి ‘పద్మావతి’ షో వేస్తోంది. అందరూ న్యాయ నిర్ణేతలే అయితే సినిమా చూసేదెవరు అని ప్రొడ్యూజర్లు పొగిలి పొగిలి దుఃఖిస్తున్నారు.