లతికా చక్రవరి
లతికా చక్రవర్తి వయసు 90 ఏళ్లు. ఈ వయసులో ఇంక పనులేం చేస్తారు.. ‘కృష్ణా, రామా.. అనుకుంటూ రోజులు వెళ్లబుచ్చక..’ అనుకుంటారు ఎవరైనా. కానీ, ఈ బామ్మ భారతదేశం నలుమూలలా ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైనపాత చేనేత చీరలు, కుర్తాలు, బట్టలు సేకరించి వాటితో అందమైన ‘పొట్లి’ బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు.చేత్తో పట్టుకునే సంచులు, పర్సులను రీసైక్లింగ్ చేయడం అంటే ఈ బామ్మకు మహా ఇష్టం. ‘‘ఆడవాళ్లు ప్రతిబ్యాగ్‌తోనూ ఒక బంధాన్ని, ఓ ప్రత్యేకమైన కథను కలిగి ఉంటారు’’ అని చెబుతుంది. ఏ తరానికైనా పనికివచ్చే ఎన్నోముచ్చట్లతో పాటు, పనే దైవంగా భావించాలని చెబుతున్న ఈ బామ్మ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
లతిక 1930లో అస్సాంలోని ధుబ్రి పట్టణంలో జన్మించారు. ‘‘చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేదాన్ని. కానీ, మా కుటుంబ సంప్రదాయ పద్ధతులు పై చదువులకు వెళ్లకుండా నన్ను అడ్డుకున్నాయి. కాలేజీలో చేరకుండానే కృష్ణ లాల్ చక్రవర్తితో పెళ్లైంది. తను సర్వే ఆఫ్ ఇండియాలో సర్వేయర్‌గా చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా తను ఏ రాష్ట్రానికి వెళితే నేనూ అక్కడికి వెళ్లాను. బయటకు వెళ్లి గుర్తింపు తెచ్చే పనులు చేయాలని ఉండేది. కానీ, నా భర్తకు నేను బయటకు వెళ్లి సంపాదించడం ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు. వాళ్ల ఆలనా పాలనతో ఇంట్లోనే ఉండిపోయాను. కానీ, నా జీవితం ఇలాగే నాలుగ్గోడల మధ్య ఉండిపోకూడదు అనిపించేది. ఒక ఏడాది ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో టీచర్‌గా పనిచేయాలనే ఆలోచనతో తొలిసారి బయటికి అడుగుపెట్టాను. పనిలో ఉన్న ఆనందం, స్వయంకృషితో సంపాదించే డబ్బు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడూ ఇంటిపట్టున ఉండాలనే ఆలోచన కూడా చేయలేదు. మా రోజులు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటిలా అప్పుడు చాలా వస్తువుల అవసరం లేదు. ఒకసారి వాడిన వస్తువులును తిరిగి చక్కగా ఉపయోగించుకునేవాళ్లం. ఎలాంటి భేషజాలు లేవు. ఒకరితో పోల్చి చూసుకోవడం ఉండేది కాదు. దీంతో చాలా సంతోషంగా ఉండేవాళ్లం’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు లతిక.
వృథా ఇష్టం ఉండదు
యాభైఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన లతిక పిల్లలతో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ రోజులు గడిపేశారు. అయితే, ఆమె స్వయంకృషి, అభిరుచి.. తొమ్మిది పదులకు చేరువవుతున్న దశలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా చేశాయి. ఇప్పుడు ఆమె ఒక బిజినెస్ ఉమెన్. తను తయారు చేసిన అందమైన ‘పొట్లి’ సంచులను తయారు చేస్తూ వాటిని అమ్ముతున్నారు. ‘‘పాత బట్టలను పడేయడం అంటే ఇష్టముండేది కాదు. ఆ మాటకొస్తే ఏదైనా వృథా అవుతుంటే నా మనసు చివుక్కుమంటుంది. పాత చీరలతో పిల్లలకు కుర్తాలు కుట్టేదాన్ని. కుర్తాలతో పర్సులు, సంచులు తయారు చేసేదాన్ని. అయితే వాటిని అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. మా బంధువుల్లోనే ఎవరైనా అడిగితే ఇచ్చేదాన్ని..’’ అంటూ తన వ్యాపారం ఎలా మొదలైందీ వివరిస్తారు లతిక. రెండు–మూడు రోజుల్లో ఒక బ్యాగును తయారు చేస్తారామె. అలా.. మొదట ఓ 300ల బ్యాగులను తయారు చేశారు. బామ్మ ఆసక్తిని చూసిన మనవడు ‘లతికాస్ బ్యాగ్’ పేరుతో ఆమె కోసం ఒక వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు. బామ్మ కుట్టిన బ్యాగులను వెబ్‌సైట్‌లో పెట్టడంతో వాటికి డిమాండ్ పెరిగింది. న్యూజిలాండ్, జెర్మనీ నుంచి కూడా లతిక బ్యాగులకు ఇప్పుడు గిరాకీ వస్తోంది!
సంతోషాన్నిచ్చే వ్యాపకం
‘‘నా భర్త 65 ఏళ్ల క్రితం ఓ కుట్టుమిషన్‌ని కానుకగా ఇచ్చాడు. దానిమీదే ఈ బ్యాగులను కుట్టడం మొదలుపెట్టాను. మా కోడలు, కూతుళ్లు వాడేసిన చీరలూ తీసుకున్నాను. పాత క్లాత్‌తో కుట్టిన ఈ బ్యాగులకే టాజిల్స్, ఎంబ్రాయిడరీతో కొత్తగా రూపు కడతాను. అయితే బ్యాగులను అమ్మాలనే ఉద్దేశంతో ఈ పనిని మొదలుపెట్టలేదు. వీటి తయారీలో ఒక ఆనందాన్ని పొందుతాను. నా వయసును మర్చిపోతాను. నా భక్తి అంతా నా బ్యాగ్ రూపకల్పనలోనే ఉంటుంది. నా హృదయంతో వీటిని తయారు చేస్తాను. ఈ తరం అమ్మాయిలకు కూడా నా బ్యాగులు నచ్చుతున్నాయంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వయసు మీద పడినవాళ్లు కూడా నా బ్యాగులను ఇష్టపడతారు..’ అంటూ బ్యాగుల గురించి ఎన్నో విషయాలను చెబుతారు లతిక.ఈ బామ్మ తన వయసు పెరుగుతుందనే భావన దర చేరనీయరు. అందుకే తన గదిలో ఒక్క అద్దాన్నీ ఉంచుకోరు. ఎంతసేపూ స్నేహితులతో గడపడం, నలుగురి మధ్యలో మాట్లాడుతూ ఉండటాన్ని ఇష్టపడతారు. ముడతలు పడిన చేతులతో ముచ్చటగా తీర్చిదిద్దే ఒక్కో బ్యాగ్‌కు ఒక్కో అందమైన పేరు పెట్టి మురిసిపోతుంటారు– ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment