బెగ్గర్ల కోసం ఒక బ్యాంక్!
బెగ్గర్ల కోసం, బెగ్గర్ల చేత, బెగ్గర్లతో నిర్వహింపబడుతున్న బ్యాంక్ అది! పేరు ‘మంగళ బ్యాంక్’. బీహార్‌లోని గయలో ఉంటుంది. బహుశా ముష్టెత్తుకొనే వాళ్ల కోసం ఏర్పడిన తొలి బ్యాంక్ ఇదే కావొచ్చు. భిక్షాటన చేసి బిచ్చగాళ్లు సంపాదించుకునే మొత్తంతో ఈ బ్యాంక్‌ను నడుపుతున్నారు. దీనికి ఒక మేనేజర్, ట్రెజరర్, డెరైక్టర్లు ఉన్నారు. వీరందరూ కూడా భిక్షగాళ్లే. ప్రత్యేకంగా ఆఫీసు లేదు కానీ.. మాంఝీఅనే ఒక బిచ్చగాడి ఇంటి నుంచి ఈ బ్యాంక్ ఆపరేట్ అవుతూ ఉంటుంది.
గయలో ‘మా మంగళగౌరీ మందిర్’ అని ఒక ప్రముఖ దేవాలయం ఉంది. భక్తుల తాకిడి బాగా ఉంటే ఆ ప్రాంతంలో చాలా మంది యాచకులు ఉంటారు. అనునిత్యం రద్దీగా ఉంటే ఆ ఆలయ ప్రాంగణంలో దానం చేస్తే పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండటంతో వీళ్లకు బాగానే గిట్టుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది కిందట యాచకులంతా ఒక సొసైటీగా ఏర్పడి బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మొత్తం 40 మంది ఖాతాదారులున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ వారానికి 20 రూపాయలు చొప్పున కట్టాలి. దీంతో వారానికి దాదాపు ఎనిమిదివందల రూపాయల నిధి ఏర్పడుతుంది. అంటే నెలకు 3,200 రూపాయలు. ఇలా ఏడాదిగా నడుస్తున్న బ్యాక్ టర్నోవర్ దాదాపు 40 వేల రూపాయలకు చేరింది.
ఈ డబ్బును ఖాతాదారులకు అప్పుగా ఇస్తారు. కనీసం ఎనిమిది వేల రూపాయల వరకూ రుణపరిమితి ఉంటుంది. అత్యవసరాల సమయాల్లోనే అప్పు ఇస్తారు. నెల వరకూ ఎలాంటి వడ్డీ ఉండదు. రెండో నెల నుంచి తక్కువ పర్సెంట్‌లోనే వడ్డీ పడుతుంది. కొన్ని టర్మ్‌లలో లోన్‌ను తీర్చేయాల్సి ఉంటుంది. దీని వల్ల తమకు చాలా ఉపయోగం కనిపిస్తోందని.. అత్యవసర సమయాల్లో ఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొన్న యాచకులు చెబుతున్నారు. యాచకులే అయినా వీరి సంఘటిత శక్తి బాగానే ఉందనుకోవాల్సి వస్తోంది. వీరు ఇలాగే ఆ బ్యాంక్ టర్నోవర్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేసి.. ప్రపంచానికి కొత్త ఆర్థిక పాఠాలు చెబుతారేమో చూడాలి!