సమ్మోహనుడు
కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత... మోహన్ పక్కన ఇవన్నీ పెట్టకపోయినా పర్వాలేదు. మోహన్ అంటే చాలు. ఆ పేరే ఒక ఉనికి. అస్తిత్వం. కర్మాగారం. పొలిటికల్ కార్టూనిస్ట్‌గా మోహన్ తెలుగు పత్రికా రంగంలో చూపిన ప్రభావం, ఆ ప్రభావంతో తయారైన కొత్త తరం అందరికీ తెలుసు. తెలుగుగడ్డ ఉద్యమాల పురిటిగడ్డగా ఎదగడానికి మోహన్ గీత గోడగోడపై ఎలా మండిందో, నిప్పులు ఎలా ఎగచిమ్మిందో అందరికీ తెలుసు. మోహన్ రేఖ జాతీయస్థాయి కార్టూనిస్టుల పక్కన కాలరెత్తుకొని నిలబడి తెలుగువాడి దమ్మును ఎలా నిరూపించిందో కూడా తెలుసు. కాని నిజంగా మోహన్ గురించి ఎందరికి తెలుసు? పాలపిట్ట పత్రిక తెలియచేసే ప్రయత్నం చేసింది.
మోహన్‌పై విశేష సంచిక వెలువరించింది. మోహన్‌తో కాకుమాను శ్రీనివాసరావు చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, శివాజీ, మృత్యుంజయ్, పాండు, అన్వర్, తైదల అంజయ్య, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, చందు సుబ్బారావు, జావేద్ తదితరులు రాసిన వ్యాసాలు, మోహన్ బొమ్మలు... అన్నింటితో పేజీ పేజీన ఉత్సవ సౌరభం. తెలుగు నేలపై ఉద్యమరేఖా వికాసం, కార్టూన్ వికాసం, అందుకై మోహన్ తొలచిన దారి తెలియాలంటే ఈ సంచిక తప్పనిసరిగా చూడాలి.
వెల: రూ.30; ప్రతులకు: 040 - 27678430
విశేష సంచిక