పురాతనం సనాతనం | Addictive eternity | Sakshi
Sakshi News home page

పురాతనం సనాతనం

Published Thu, Jun 5 2014 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

పురాతనం సనాతనం

పురాతనం సనాతనం

శరీరాన్ని క్షాళన చేసుకోవడంతో పాటు, మనసునూ  క్షాళన చేసుకోవాలన్నదే ఈ పుణ్యనగరం ఇచ్చే సందేశమని అనిపిస్తుంది.
 
పార్వతిని పరిణయమాడేందుకు కైలాసాన్ని వీడి వచ్చిన శివుడు నివాసం కోసం ఎంచుకున్న నేల వారణాసి అని పురాణ గాథలు చెబుతాయి. ఈ పట్టణానికి ఉత్తరాన ఉన్న వారుణ, దక్షిణంగా ఉన్న అసి (లేదా అస్సి) అనే చిన్న చిన్న నదుల నుంచే  వారణాసి అన్న పేరు వచ్చిందని ప్రతీతి. కాశీని పురాతన పట్టణంగా పేర్కొంటుంది ఋగ్వేదం. ‘బెనారస్ అంటే చరిత్ర కంటె పురాతనం... సంప్రదాయం కంటె సనాతనం’ అంటాడు మార్క్‌టై్వన్. అందుతున్న ఆధారాలను బట్టి ఈ పుణ్యక్షేత్రం 30 శతాబ్దాల నాటిది. వేదాలు, రామాయణ-భారతాలు, జైన గ్రంథాలు, బౌద్ధుల జాతక కథలు- భారతీయ ఆత్మతో అనుబంధం ఉన్న ప్రతి అక్షరం కాశీకి కైమోడ్పులర్పించినదే.
 
హిమసానువులలో పుట్టి సాగరం వైపు బంగ్లాదేశ్‌కు సాగే అద్భుత గంగా జలహారంలో కాంతులు వెదజల్లే ఒక మణి... వారణాసి. కాశీ అన్నా అదే. కొద్దిమందికే పరిచితమైన నామం - అవిముక్త. ఆంగ్లేయులు రుద్దిన పేరు బెనారస్ లేదా బనారస్. కాశీ జ్యోతిర్లింగాలలో ఒకటి. శక్తి పీఠాలలోనూ ఒకటి.
 
వారణాసి అంటే పరస్పర విరుద్ధ దృశ్యాల మేళవింపు. ‘హర హర మహాదేవ్!’ అంటూ విశ్వేశ్వరుడి నామస్మరణ ఒకవైపు, ‘అల్లాహో అక్బర్’ అంటూ మసీదుల నుంచి ప్రార్థనలు మరోవైపు కాశీలో సర్వసాధారణం. ఇరుకు ఇరుకు సందులనీ, వాటిలోనే నిరంతరం సంచరించే ఆవుల మందలనీ దాటుకుని వచ్చాక కంటికి నిండుగా, విశాలంగా దర్శనమిస్తుంది గంగా ప్రవాహం. త్రిపథగ, జాహ్నవి, భాగీరథి వంటి పేర్లతో ప్రసిద్ధమైన ఆ గొప్ప నది పవిత్రత గురించి విన్న గాథలు ఓ పక్క గుర్తుకు వస్తుంటాయి. మరో పక్క నదిని అడుగడుగునా కలుషితం చేస్తున్న మనిషి చేష్టలు కంటపడుతూ ఉంటాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాన్ని తెచ్చి ఆ పవిత్ర నదిలో కలిపేందుకు నిర్మించిన భారీ పైపులు మరీ బాధ కలిగిస్తాయి.

కానీ సగం కాలిన మృతదేహాలను గంగలోకి తోసే పద్ధతికి చాలా కాలం కిందటే స్వస్తి చెప్పారన్న విషయం సంతోషపెడుతుంది. జానెడు గోచీతో, జడలు కట్టిన జుట్టుతో, ఒళ్లంతా బంకమట్టి పూసుకుని లోకం సంగతి పట్టించుకోకుండా గంగ చిరు కెరటాల దగ్గరే గంటల తరబడి ధ్యానంలో మునిగి ఉండే బైరాగులు తీరమంతా కనిపిస్తారు. ఘాట్‌లకు అవతలే దుకాణాలలో పట్టు వస్త్రాలను కళ్లప్పగించి చూస్తూ ప్రపంచాన్ని మరచే భక్తకోటి కనిపిస్తుంది.
 
కాశీని చూడడమంటే గంగను చూడడమే. సోపాన పంక్తులతో గంగను దర్శింపచేసేవే ఘాట్‌లు. ఎనభయ్ నాలుగు వరకు ఉన్నాయవి. అస్సి, మణికర్ణిక, దశాశ్వమేధ్, జైన్, మహానిర్వాణ్, హనుమాన్, నారద, మంగళగౌరి, సింధియా ఘాట్ - ఇలా. ప్రతి ఘాట్‌కు ఒక కథ ఉంది. ఇంకా, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. ఉత్తర జన్మ లేకుండా కాశీలో కన్నుమూయాలని వచ్చేవారు వేలాదిగా ఉంటారు.

తమ పార్ధివ శరీరానికి కాశీలో గంగ తీరాన అంత్యక్రియలు జరగాలని కోరుకునే వారూ ఎక్కువే. ఈ రెండు ఘాట్లు వాటికే ప్రసిద్ధి. మోక్షాన్ని కోరి వచ్చే వారితో సహా, కాశీలో ప్రాణాలు విడిచే ప్రతి ప్రాణికి కూడా అంతిమ క్షణాలలో సాక్షాత్తు శివుడే ‘రామ’ నామాన్ని కుడిచెవిలో వినిపిస్తాడని ఓ విశ్వాసం. తరతరాలుగా ఒకే దీపం నుంచి మంటను తీసుకుని తలకొరివి పెట్టే ఆచారం మణిక ర్ణిక ఘాట్‌లో ఉంది. ఈ రెండు ఘాట్ల దగ్గరే కాక, కనీసం ఐదు చోట్ల స్నానమాచరించడం సంప్రదాయం.
 
ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆ నగరంలో మతోన్మాదంతో జరిగిన విధ్వంసానికీ, స్పర్థలతో వర్థిల్లిన విజ్ఞానానికీ కూడా ప్రత్యక్ష సాక్షి గంగ. ముస్లిం దండయాత్రల ఆనవాళ్లు విశ్వేశ్వరుడి సన్నిధిలోనే కనిపిస్తాయి. ఔరంగజేబు ధ్వంసం చేసిన ఆలయాన్ని 1780లో ఇందోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కార్ పునరుద్ధరించింది. తరువాత సిక్కు పాలకుడు రంజిత్‌సింగ్ గోపురానికి బంగారు తాపడం చేయించాడు.

పూర్వపు ఆలయాన్ని ధ్వంసం చేసిన స్థలానికి పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వరుడి గుడి గోపురం, మసీదు గోపురం పక్కపక్కనే కనిపిస్తాయి. ఈ మసీదును జ్ఞానవాపి మసీదు అనే అంటారు. జ్ఞానవాపి అంటే పాత ఆలయం కట్టిన స్థలం పేరు. ఒక్క గోడే అడ్డు. అన్నపూర్ణ మందిరం దాటాక శివాలయం కనిపిస్తుంది. ఎప్పుడైనా కావచ్చు, కాశీలో మొత్తంగా రెండు వేల ఆలయాలు వెలిశాయని చెబుతారు. వాటిలో ఐదు లక్షల ప్రతిమలు కొలువైనాయనీ అంటారు.
 
కాశీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రఖ్యాతమో, జ్ఞానానికి కూడా అంతే పేర్గాంచింది. మహామహోపాధ్యాయ మకుటాలను అలంకరించిన కాలం నుంచీ మదన్‌మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్మించే వరకు ఆ ఖ్యాతి నిలబడే ఉంది. సంస్కృత విద్యకు వారణాసి విశ్వ ప్రఖ్యాతి గాంచిన పీఠం.
 
జైన, బౌద్ధ గురువులూ కాశీని సందర్శించారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఈ నగరం వాడే. బుద్ధుడు జ్ఞానం పొందిన తరువాత తొలి సందేశం ఇచ్చిన సార్‌నాథ్ కాశీ శివార్లలోనే ఉంది. ‘అష్టాధ్యాయి’ రచయిత పాణిని, ఆచార్య త్రయం (శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు) బసవన్న గంగాస్నాన మాచరించినవారే. మొగలుల కొలువులో పని చేసిన జగన్నాథ పండితరాయలు ఆ నది ఒడ్డుకు లవంగితో కలసి వచ్చి 53 శ్లోకాల ‘గంగా లహరి’ని ఆలపించాడు. తన లాక్షణిక గ్రంథానికి  రసగంగాధరమనే పేరు పెట్టుకున్నాడాయన.

పెద కోమటి వేమారెడ్డితో కాశీ వచ్చిన శ్రీనాథుడు, అపారమైన ప్రేమతో స్కాందపురాణంలోని కాశీ ఖండాన్ని అనువదించే పనికి శ్రీకారం చుట్టాడు. గౌతమి తీరంలో ఆ అనువాదం పనిని పూర్తిచేశాడా ‘ఈశ్వరార్చన కళాశీలుడు.’ ఝాన్సీ లక్ష్మీభాయి ఇక్కడే పుట్టింది. ఆమె వీరగాథతో పాటు కబీర్ కవితలనూ ఆ నది విన్నది. ‘అన్ని జీవుల గొంతుకలు ఆ నది గొంతుకలో ఉన్నాయి’ అంటాడు హెర్మన్ హెస్ తన అద్భుత నవల ‘సిద్దార్థ’లో. కాశీ, పక్కనే కొద్దిపాటి ఒంపుతో ప్రవహించే గంగ ఆధునిక కాలంలోనూ రచయితలనీ, కవులనీ ఆకర్షిస్తూనే ఉంది. అందుకేనేమో, హెస్ తన నవలలోనే మరోచోట, ‘అది జీవ శబ్దం. నిత్యంగా వుంటూ, తెంపు లేకుండా మారుతూ ఉండే శబ్దం ఆ నది’ అంటాడు. గోస్వామి తులసీదాస్ ‘రామ చరితమానస్’ గంగ ఒడ్డున కూర్చుని రాశాడని చెబుతారు. ఆయన పేరిట ఒక ఘాట్ కూడా ఉంది.

విభూతిభూషణ్ బంధోపాధ్యాయ పథేర్‌పాంచాలీ, అపరిచితుడు నవలల్లో, శరత్‌బాబు వాక్యాలలో గంగ గలగలలు వినిపిస్తూనే ఉంటాయి. రవీంద్ర కవీంద్రుడు వంగ దేశంలోని ఘాజీపూర్ నుంచి వారణాసికి  పడవ ప్రయాణం చేశారు. ఆ యాత్ర లోనే నౌకాభంగం, చోఖెర్‌బాలి అనే రచనలకు అంకురార్పణ జరిగింది. గంగాతీరంలోని మార్మికత, కాశీ ఆధ్యాత్మిక శక్తులను అక్షరబద్ధం చేయడానికే ప్రేమ్‌చంద్ ‘సేవాసదన్’ నవల రాశారని అనిపిస్తుంది. కొన్ని పురాతన సంప్రదాయాలను ఆ మహా రచయిత నిరసించినా ఆ చరిత్రాత్మక ఘాట్‌ల మధ్య ‘ప్రేమ్‌చంద్ ఘాట్’ కూడా వెలిసింది. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ రాశారు.

తెలుగువారు ఎందరు కాశీ పండితులుగా అవతరించారో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు తన ‘కాశీయాత్ర చరిత్ర’లో ఎంత రమణీయంగా వర్ణించలేదు! వీరంతా అక్షరాలతో ఆ ప్రవాహాన్ని ఆరాధిస్తే, తన షెహనాయ్ నాదంతో పూజించిన మహా కళాకారుడు బిస్మిల్లాఖాన్. మీరొచ్చి అమెరికాలో స్థిరపడకూడదా! అని ఎవరో అడిగితే, అక్కడ గంగ లేదు మరి! అని సమాధానం ఇచ్చిన ఆరాధకుడాయన. ఇక్కడ పుట్టాడు కాబట్టే పండిట్ రవిశంకర్ సితార్ వాదనం గంగా ఝరిలా ఉరుకుతుంది.
 
పగలంతా భక్తుల స్నానాలతో రంగుమారిపోయే గంగ, రాత్రి వేళ కాంతి రేఖలను  అలంకరించుకుంటుంది. చీకట్లు ముసిరాక, ఘాట్ల సోపానాల మీద నుంచి నిత్యం గంగమ్మకు ఇచ్చే దీపాల హారతి ఓ అందమైన వేడుక. ఒకే రకం వస్త్ర ధారణతో, భారీ దీపపు గుచ్ఛాలతో, మంగళవాద్యాల నడుమ, భక్తి గీతాలాపన మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిని నదిలోనే పడవల మీద కూర్చుని వీక్షించవచ్చు. గుహుడి వారసులుగా చెప్పుకునే ఒక తెగవారు పడవలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. లేదా గట్టునే భక్తకోటితో కూర్చునీ చూడొచ్చు. హారతి పడుతూ మెట్ల మీద నిలబడి గుండ్రంగా తిప్పే దీపపుగుత్తుల వెలుగులతోనూ,  పుణ్యస్త్రీలు అరటిదొప్పలలో వెలిగించి నదిలో విడిచిపెట్టే  దీపాలు కెరటాల మీద వయ్యారంగా సాగిపోతూ చిందించే చిరు వెలుగులతోనూ కొన్ని గంటల సేపు గంగ కిన్నెరలా మెరిసిపోతుంది. ఆ నిశిలో కన్ను ఎటు తిప్పినా ఈ సుందర దృశ్యమే కనిపిస్తుంది.
 
కాశీ అంటే దీపకాంతుల నగరమని అర్థం. హిందూ చింతనలో వెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కారణం ఏదైనా నేటికీ ఆ కాంతుల నగరి హిందువుల గుండెలను స్పందింపచేస్తూనే ఉంది. గంగతో శరీరాన్ని క్షాళన చేసుకోవచ్చు. మనసును క్షాళన చేసుకోవాలంటే ఒక్క  జ్ఞానంతోనే సాధ్యమన్న సందేశం అక్కడ వినిపిస్తుంది.  కాశీ, గంగ, మణికర్ణిక మనకి వెల్లడించే సత్యం ఇదే. మనసుని క్షాళన చేసే జ్ఞానానికి ప్రతీకే వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ.
 
- డాక్టర్ గోపరాజు నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement