డెయిరీ.. ఉజ్వల భవితకు దారి | advantages with dairy sector | Sakshi
Sakshi News home page

డెయిరీ.. ఉజ్వల భవితకు దారి

Published Sun, May 11 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

డెయిరీ.. ఉజ్వల భవితకు దారి

డెయిరీ.. ఉజ్వల భవితకు దారి

గెస్ట్ కాలమ్
 
నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. దేశంలో డెయిరీ ఉత్పత్తులు, డెయిరీ ప్రాసెసింగ్, నిర్వహణ  సేవలు, పరిశోధనలతోపాటు సుశిక్షితులైన డెయిరీ నిపుణులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ రంగ సంస్థ. అంతేకాకుండా డెయిరీ రంగంలో పరిశోధన, బోధన రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్. ‘ప్రస్తుతం దేశంలో డెయిరీ రంగంలో నిపుణుల అవసరం ఎంతో ఉంది. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సులవైపే దృష్టి సారించకుండా.. డెయిరీ రంగంలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. 2020 నాటికి వేల సంఖ్యలో మానవ వనరుల డిమాండ్ ఏర్పడనుంది. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు దీర్ఘకాలిక లక్ష్యంతో డెయిరీ రంగంలో కెరీర్ ప్లానింగ్ చేసుకుంటే అద్భుత ఫలితాలు సొంతమవుతాయి’ అంటున్న నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కర్నాల్) డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ.కె.శ్రీవాత్సవతో ఇంటర్వ్యూ..
 
 డెయిరీ సైన్స్ కోర్సుల ప్రాముఖ్యత, ప్రయోజనాలు తెలపండి?
 గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో డెయిరీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. అదేవిధంగా పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో విధానాల పరంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మరోవైపు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేనేజ్‌మెంట్, పేటెంటింగ్ వంటి విభాగాల్లోనూ నిపుణుల కొరత అధికంగా ఉంది. వీటికి అనుగుణంగా నిరంతరం ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ శిక్షణనిచ్చే కోర్సులే.. డెయిరీ సైన్స్ కోర్సులు. మరో ఆరేళ్లలో దేశంలో డెయిరీ సైన్స్ నిపుణుల డిమాండ్ వేల సంఖ్యకు చేరుకోనుంది. కాబట్టి విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే దృష్టి సారిస్తే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
 
 ప్రస్తుతం దేశంలో డెయిరీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు?

 దేశవ్యాప్తంగా 18 ఇన్‌స్టిట్యూట్‌లలో డెయిరీ టెక్నాలజీలో బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 500 నుంచి 600 మంది మాత్రమే అభ్యర్థులు బయటికొస్తున్నారు. డిమాండ్- సప్లయ్ కోణంలో ఈ సంఖ్య చాలా తక్కువ. మరింత మంది గ్రాడ్యుయేట్ల అవసరం ఉంది. పీజీ స్థాయిలో డెయిరీ టెక్నాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి స్పెషలైజేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. కాబట్టి ఫలానా స్పెషలైజేషన్‌కు డిమాండ్ అధికం అని చెప్పలేం.
 
 ఆర్ అండ్ డీ అవకాశాలు, ఆవశ్యకతపై మీ అభిప్రాయం?
 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలో.. ఏడు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు యానిమల్ సెన్సైస్, యానిమల్ హెల్త్, డెయిరీ ప్రొడక్షన్, డెయిరీ ప్రాసెసింగ్, జెనెటిక్ ఎవాల్యుయేషన్/కన్జర్వేషన్ తదితర అంశాల్లో పరిశోధన కోర్సులను అందిస్తున్నాయి. మాలిక్యులర్ జెనెటిక్స్, జీనోమిక్స్, న్యూట్రి-జీనోమిక్స్, ప్రొటియోమిక్స్, మెటబాలమిక్స్ అంశాలు పరిశోధనల పరంగా ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్‌కు సంబంధించి హై-హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ట్రీట్‌మెంట్, పల్స్‌డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ట్రీట్‌మెంట్, పల్స్‌డ్ లైట్ ట్రీట్‌మెంట్ అంశాలు ప్రధానమైనవి. కేవలం కోర్ అంశాలే కాకుండా.. సంబంధిత అంశాలైన ప్యాకేజింగ్ ఇన్నోవేషన్స్, నానో టెక్నాలజీ అండ్ బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ విభాగాల్లోనూ ఆర్ అండ్ డీ అవకాశాలు అనేకం.
 
 విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు?

 డెయిరీ సైన్స్ ఉత్తీర్ణులకు విదేశాల్లోనూ అనేక అవకాశాలున్నాయి. ఉపాధి, ఉద్యోగాలపరంగా కొన్నేళ్లుగా పీహెచ్‌డీ ఉత్తీర్ణులు మొదలు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు అనేకమందికి ఉద్యోగాలు లభించాయి. ముఖ్యంగా ఆఫ్రికా, మిడిల్-ఈస్ట్ దేశాల్లోని డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో అవకాశాలు మరింత అధికంగా ఉన్నాయి. ఎన్‌డీఆర్‌ఐ గణాంకాల ప్రకారం- గత పదేళ్లలో ఇక్కడ ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 50 శాతం మంది విదేశాలకు వెళ్లారంటేనే విదేశీ అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతోంది.
 
 ముఖ్యమైన ఉపాధి వేదికలు?
 డెయిరీ సైన్స్ కోర్సుల ఉత్తీర్ణులకు డెయిరీ ప్లాంట్స్, కమర్షియల్ డెయిరీ ఫామ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పశు సంవర్థక శాఖ, బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూషన్స్, స్వచ్ఛంద సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. వీటితోపాటు డాక్టోరల్ స్థాయీ అభ్యర్థులు ఎంఎన్‌సీ జీతాలకు దీటుగా యూనివర్సిటీ, పరిశోధన సంస్థలలో బోధనా రంగంలో ప్రవేశించవచ్చు. తద్వారా ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుకోవచ్చు.
 
 స్వయం ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా లభించే అవకాశాలు?

 సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్/ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోణంలోనూ ఎన్నో మార్గాలు ఉన్నాయి. డెయిరీ ఫామ్ ఏర్పాటు మొదలు.. ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు ఎన్నో రకాల స్వయం ఉపాధి మార్గాలు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు వంటి అవకాశాలున్నాయి. సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రణాళికలుంటే.. ఐసీఏఆర్, ఎన్‌డీఆర్‌ఐ సహా ఈ కోర్సులను అందించే ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు స్టార్ట్-అప్ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
 
 భవిష్యత్తు కెరీర్ అవకాశాలు ఎలా ఉండనున్నాయి?
 నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్‌పవర్ రీసెర్చ్-న్యూఢిల్లీ  సర్వే ప్రకారం.. అగ్రికల్చర్, యానిమల్ సెన్సైస్‌కు సంబంధించి 2020 నాటికి ప్రతి ఏటా 40వేల మంది గ్రాడ్యుయేట్లు, 10,500 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2,800 మంది డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణుల అవసరం ఏర్పడనుంది. అగ్రికల్చర్, యానిమల్ సైన్స్‌కు అనుబంధ రంగంగా ఉన్న డెయిరీ సైన్స్‌లో 2020 నాటికి డెయిరీ సైన్స్, ప్రాసెసింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ నుంచి డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణులకు ఏటా 35వేల మందికి అవకాశాలు లభించనున్నాయి.
 
 డెయిరీ రంగ అభివృద్ధి, మానవ వనరుల శిక్షణకు సంబంధించి ఎన్‌డీఆర్‌ఐ చేపడుతున్న చర్యలు?

 ఆసియాలోనే డెయిరీ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటై డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఇన్‌స్టిట్యూట్.. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో యూజీ, 12 విభాగాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సదరన్ రీజనల్ స్టేషన్-బెంగళూరు, ఈస్టర్న్ రీజనల్ స్టేషన్-కళ్యాణిలలో రీసెర్చ్, టీచింగ్ కోర్సులను అందిస్తున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా యూజీ, పీజీ కోర్సుల్లో.. ఎన్‌డీఆర్‌ఐ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్లు కల్పిస్తాం. ఇక్కడ బోధన విధానం, కరిక్యలంలోనూ క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించేందుకు పెద్దపీట వేస్తున్నాం. ఈ క్రమంలోనే బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఏడాది వ్యవధి ఉండే ‘ఇన్-ప్లాంట్ ట్రైనింగ్’ పేరుతో విద్యార్థులను డెయిరీ పరిశ్రమలకు ప్రాక్టికల్ శిక్షణకు పంపుతున్నాం. ఫలితంగా ప్రాక్టికల్ నైపుణ్యాలతోపాటు అక్కడ బాగా రాణించిన విద్యార్థులకు ఆయా సంస్థల్లోనే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
 ఔత్సాహిక విద్యార్థులకు సలహా?
 దేశంలో డెయిరీ రంగం అభివృద్ధి సాధించాలంటే.. వేల మంది మానవ వనరుల అవసరం ఉంది. అందుకు తగ్గట్టు విద్యావకాశాలు కూడా పెంపొందాలి. విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధమవ్వాలి. కెరీర్ అంటే.. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ మాత్రమే అనే అపోహ వీడాలి. డెయిరీ రంగంలో అవకాశాలను సొంతం చేసుకునే దిశగా విద్యార్థులు దృష్టి సారిస్తే ఉజ్వలమైన కెరీర్‌ను అందుకోవచ్చు. దీంతోపాటు సామాజిక ప్రగతికి కూడా దోహదం చేసినట్లవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement