వచ్చేదాంట్లో పోతే ఎలా!
భరణం
భరణం అడిగేటపుడు నెలనెలా కొంత అడిగేకన్నా మొత్తం ఒకేసారి ఇవ్వమనటం మంచిది. ఎందుకంటే నెలనెలకూ వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు కనక దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పెళ్లంటే నూరేళ్ల పంట!! పాట వరకూ ఓకే. కానీ ఇది అందరికీ వర్తిస్తుందనుకోలేం. మన దేశంలో ప్రతి వెయ్యిలో 15 పెళ్లిళ్లు విడాకులతో ముగుస్తున్నాయి. స్వీడన్, అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం బాగా ‘వెనకబడినట్టే’. కానీ ఇది సంతోషించాల్సిన వెనకబాటు. ఈ సంతోషాన్నిలా ఉంచితే, అత్యధిక శాతం విడాకుల కేసులలో భరణం దగ్గరే గొడవ మొదల వడం మనం గమనిస్తున్నాం. 90 శాతం విడాకుల కేసుల్లో పరస్పర అంగీకారం ఉండదని, భరణం కోసం పోరాటం తప్పదని చెబుతారు బాలీవుడ్‌లో ఎందరో సెలబ్రిటీల విడాకుల్ని హ్యాండిల్ చేసిన న్యాయవాది మృణాళినీ దేశ్‌ముఖ్. విడాకుల కేసులు చూసే న్యాయవాది వందనా షా అయితే తన సొంత అనుభవాన్ని రంగరించి... ‘‘విడాకులు కోరుకునే మహిళలు ఆర్థిక వ్యవహారాల్ని మొదట గాడిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు భర్తతో కలిసి బ్యాంకు ఖాతా ఉంటే దాన్ని విడదీసుకోవాలి.
నగలు లాకర్లో ఉంటే వాటిని తను తీయగలిగేట్టు చూడాలి. వీటన్నిటి తరవాతే విడాకుల గురించి ఆలోచించాలి’’ అని హెచ్చరిస్తుంటారు. 14 ఏళ్ల కిందట ఆమె భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. అప్పుడు చేతిలో రూ.750 మాత్రమే ఉన్నాయి. పెళ్లికి ముందే తల్లిదండ్రులు చనిపోవటంతో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీని పరిస్థితి. చివరికి తన పనిమనిషి ఇంట్లోనే తలదాచుకుందామె. విడాకుల విచారణలో... తనకు పెళ్లి సమయంలో వచ్చిన దుస్తులు, బహుమతులు ఇచ్చేస్తే చాలంది. అయినా కేసు పదేళ్లు సాగింది. చివరికి విచారణకు హాజరవుతూనే ‘లా’ చదివిందామె. ఇపుడు వందన తనలాంటి మహిళల తరఫున వాదిస్తూ వారికి న్యాయం చేయటానికి ప్రయత్నిస్తోంది.
మగవాళ్లకూ భరణం!
చాలా కేసుల్లో.. భర్త జీతంలో పన్ను చెల్లించదగ్గ ఆదాయంలో 25 నుంచి 35 శాతం భరణంగా ఇస్తారు. అయితే వ్యాపారాలు నిర్వహించే వారి విషయంలో ట్యాక్సబుల్ ఇన్‌కమ్ అనే సూత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోదు. అదే విధంగా సదరు మహిళ పనిచేస్తున్నా సరే... ఆమె గౌరవంగా బతకడానికి భరణం అవసరమని కోర్టు భావిస్తే మంజూరు చేస్తుంది.
సహజంగా భరణం అడిగేది మహిళలే అయినా... హిందూ, పార్శీ చట్టాలు మగవాళ్లకూ భరణం అడిగే అవకాశం కల్పిస్తున్నాయి.
విడిపోవడం తప్పదనుకున్నప్పుడు...
విడిపోదామనుకున్న మహిళలు తమ వాదనకు తగ్గ ఆధారాలు ముందు సంపాదించాలి. భర్త వేరొకరితో ఉంటున్నారని ఆరోపిస్తే దానికి తగ్గ ఆధారాలు పెట్టుకోవాలి.భరణం అడిగేటపుడు నెలనెలా కొంత అడిగేకన్నా మొత్తం ఒకేసారి ఇవ్వమనటం మంచిది. ఎందుకంటే నెలనెలకూ వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు కనక దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుమేరకు ఒకేసారి తీసుకునే మొత్తం క్యాపిటల్ రిసీట్ కిందికి వస్తుంది. కాబట్టి దీనిపై ఎలాంటి పన్నూ ఉండదు.
అయితే స్థిరాస్థులను ఒకేసారి బదలాయింపు చేసినా పన్ను వర్తిస్తుంది.
ఖర్చులు పెరిగి భరణం సరిపోని పక్షంలో ఎక్కువ అడగాలంటే మరో పిటిషన్ వేయాలి. అందుకే ఒకేసారి మొత్తం తీసుకోవటం ఉత్తమం.ఇల్లు, భూముల వంటి స్థిరాస్థుల విషయంలో అది ఎవరిపేరిట ఉందో వారికే లీగల్‌గా హక్కుంటుంది. కాకపోతే అది కొనటానికి డబ్బు తానే పెట్టానని, కనక అవతలి వ్యక్తి నిరూపిస్తే ఆ వ్యక్తికీ చెందుతుంది. అందుకే ఆస్తిని అమ్మేసి ఇద్దరూ పంచుకోవటమనేది ఉత్తమ మార్గం. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేవారు కనక విడిపోదామనుకున్న పక్షంలో మహిళకు భరణం అడిగే హక్కుండదనే ఇటీవలి తీర్పులు చెబుతున్నాయి. వారికి పిల్లలున్నా సరే.. వివాహం కాదు కనక భరణం మంజూరు చేయలేమని కోర్టులు చెబుతున్నాయి.