హోమియో కౌన్సెలింగ్
నా వయసు 25 ఏళ్లు. చాలాకాలంగా చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, వెంటనే తుమ్ములు ఎక్కువగా రావడం జరుగుతోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను అడిగితే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? - రవి, వరంగల్
అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు.
కారణాలు: అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి.
లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
ఇన్నాళ్ల తర్వాతా తిరగబెడుతుందా?
క్యాన్సర్ కౌన్సెలింగ్
నేను దాదాపు పన్నెండేళ్ల క్రితం కిడ్నీలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. మళ్లీ ఇటీవలే నడుము నొప్పి వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్‌లను పరిశీలించాక డాక్టర్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అది కిడ్నీ నుంచి వెన్నుకు పాకిందంటున్నారు. పన్నేండేళ్ల తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెడుతుందా? అది నయమయ్యే అవకాశం ఉందా? - సతీశ్‌కుమార్, నంద్యాల
కిడ్నీ క్యాన్సర్ లేదా మరికొన్ని క్యాన్సర్లు చికిత్స తీసుకున్నప్పటికీ తిరగబెట్టే అవకాశం ఉంది. అది ఐదేళ్లు, పదేళ్లు, పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాతైనా కావచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్‌పై అదుపు సాధించేందుకు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెన్నుకు రేడియేషన్ చికిత్స తీసుకోవచ్చు. ఎక్స్-నైఫ్ ఎస్‌ఆర్‌ఎస్‌తో క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ప్రక్రియ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవు. నొప్పిని కూడా తక్షణం నివారించవచ్చు.
మా అమ్మగారికి 68 ఏళ్లు. ఆమెకు గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ వచ్చింది. మొదటి దశ (స్టేజ్-1)లో ఉందని డాక్టర్ తెలిపారు. మాకు తెలిసిన డాక్టర్లను సంప్రదిస్తే రెండు మార్గాలు తెలిశాయి. మొదటిది... శస్త్రచికిత్స. రెండోది రేడియోథెరపీ. మేం కాస్త అయోమయంలో ఉన్నాం. శస్త్రచికిత్స అన్నా, రేడియోథెరపీ అన్నా భయంగా కూడా ఉంది. దయచేసి మాకు తగిన మార్గాన్ని సూచించగలరు. - యోగేశ్వరరావు, కాకినాడ
మొదటి దశ సర్విక్స్ క్యాన్సర్‌ను సర్జరీ లేదా రేడియోథెరపీ ద్వారా నయం చేయగలం. అయితే చాలా సందర్భాల్లో దీనికి మొదట శస్త్రచికిత్స చేసి, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మీరు రేడియోథెరపీయే కోరుకుంటే అది కూడా సాధ్యమే. చాలా సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇటీవల రేడియేషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వల్ల రేడియోథెరపీ వల్ల ఇతర దుష్ర్పభావాలు కూడా దాదాపు ఉండవు. మీరు నిర్భయంగా రేడియోథెరపీ చేయించుకోండి.