వాషింగ్టన్: భారత ఉపఖండం కారణంగా భూమిపై అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయన్న విషయం మీకు తెలుసా..? 5 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండం, భారత ఉపఖండం విడివిడిగా ఉండేవని మీరు ఎప్పుడైనా చదివారా..? అప్పట్లో ఆసియా ఖండం, భారత ఉపఖండం మధ్యలో ఉండే టెథీస్ అనే పురాతన సముద్రం గురించి మీరు విన్నారా..? అయితే మీరు 5 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన మార్పులు తెలుసుకోవాల్సిందే. సరిగ్గా 5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి.. ప్రస్తుత ఆసియా ఖండంలా ఏర్పడింది.
ఈ ఘటన ద్వారానే ఖండాల స్థితిగతులు, ప్రపంచ వాతావరణంతోపాటు ఇంకా మరెన్నో మార్పులు భూమిపై చోటుచేసుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే తాజాగా దీని కారణంగానే ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. దీంతో భూమిపై జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎమ్మా కాస్ట్ తెలిపారు. దీనికోసం 7 కోట్ల ఏళ్ల క్రితం నాటి అతిసూక్ష్మ సముద్రపు గవ్వలను ఉపయోగించి సముద్రాల్లోని నైట్రోజన్‌ను రికార్డు చేశారు.
అప్పటి నైట్రోజన్ పరిస్థితులను పోల్చి చూశారు. అలాగే పురాతన సముద్రాల్లో ఉండే 15ఎన్ –14ఎన్ నైట్రోజన్ పరిస్థితులను పునర్ నిర్మించారు. అనంతరం అప్పటి ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులను గమనించారు. దీన్ని బట్టి అప్పట్లో 15ఎన్–14ఎన్ నైట్రోజన్ స్థాయిలు అత్యధికంగా ఉండేవని, దీంతో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను బట్టి భవిష్యత్తులో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఊహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment