
‘నాన్నింటి వాళ్లు ఏదో అన్నారని అమ్మ ఒక్కటే చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వెళ్లి అమ్మ కన్నీళ్లు తుడిచావా?’ అయితే నువ్వు లీడర్‌వే! ‘నాన్నకు ఒంట్లో బాగోలేనప్పుడు స్కూటీపై కూర్చొబెట్టుకుని నువ్వే ఆసుపత్రికి డ్రైవ్ చేసుకెళ్లావా?’ అయితే నువ్వు లీడర్‌వే. ‘ఇంటి సంగతులే కాదు, పొరుగింటి బాధలూ పట్టించుకున్నావా? సహాయం చేశావా? సలహా ఇచ్చావా? సమాధాన పరిచావా?’ అయితే నువ్వు లీడర్‌వే. నీ వయసెంతని కాదు. అమ్మాయ్.. నువ్వు లీడర్‌వే!
గర్ల్ లీడర్!
పదమూడేళ్ల అమ్మాయి, పద్నాలుగేళ్ల అమ్మాయి.. పోనీ పదిహేడూ పద్దెనిమిదేళ్ల అమ్మాయి .. ఏ ఉద్యమాన్ని లీడ్ చెయ్యగలదు? ఏ ప్రభుత్వాన్ని దారిలో పెట్టగలదు?గట్టిగా ఒక నినాదం చెయ్యగలదా? పిడికిలిని బిగించి ‘కదలిరండి’ అని ప్రజలకు గట్టిగా ఒక పిలుపును ఇవ్వగలదా? ‘ఎస్.. షి కెన్’ అంటోందేమిటి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్). ‘షీ ఓన్లీ కెన్’ అని కూడా! ఏమిటి అంత నమ్మకం గర్ల్ లీడర్‌షిప్ మీద! ‘త్వరలోనే చూస్తారుగా’ అని యు.ఎన్! ఏం చూడబోతున్నాం మనం! అది తర్వాత. ఐక్యరాజ్యసమితి కాదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ఒక గర్ల్ లీడర్‌ని కళ్లారా చూసింది. ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి సభ అది. జనం కిక్కిరిసి ఉన్నారు. ఇప్పుడున్న పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఆయన చెబుతున్నారు. రానున్న పాలన ఎంత ధీమా ఇవ్వబోతోందో వివరిస్తున్నారు. ‘‘నేను స్టేజ్ మీదకు రావచ్చా?’.. ఓ గర్ల్ లీడర్! గర్ల్‌లీడర్‌కి అనుమతి లభించింది.
అప్పటి వరకు ఆమె గర్ల్ మాత్రమే. కష్టాన్ని చెప్పుకోడానికి రాలేదు ఆమె. కష్టాల్ని చెప్పడానికి వచ్చింది! ‘‘మాట్లాడు తల్లీ’’ అన్నారు జగన్. ఆమె మాట్లాడింది. మామూలుగానే మాట్లాడింది! సభ వింది. ఉద్వేగంతో ఊగిపోయింది. చప్పట్లు కొట్టింది. రాష్ట్రంలో ప్రజాసేవలు ఎంత ‘మహత్తరంగా’ ఉన్నాయో ఆమె మాట్లాడుతోంది. ‘‘... ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. మొన్న ఒకావిడ, మా పక్కింటి ఆవిడ.. గౌరీ అనే ఆవిడ నొప్పుల్తో బాధపడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే నేను పరుగెట్టుకెళ్లాను. అప్పుడు వాళ్లింట్లో ఎవ్వరూ లేరు. లేకపోతే.. నేను 108కి ఫోన్ చేస్తే.. వాళ్లు చెప్పింది ఏంటి తెలుసా? ఎక్కడుంటారు, ఏమైందీ అని.. వివరాలన్నీ అడిగేసి, అడిగిన తర్వాత.. ‘టైర్ పంక్చర్ అయిందమ్మా. ఇప్పుడు రాలేము. స్టాఫ్ కూడా ఎవ్వరూ లేరు’ అని చెప్పారు. ‘మరి ఏం చెయ్యమంటారు సార్.. ఇక్కడ ఒకావిడ.. పరిస్థితి చాలా విషమంగా ఉంది.
చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు మీ పరిస్థితి గురించి చెబుతున్నారు...’ అని, ఆమెను ఎలా తీసుకెళ్లాలో తెలీక పిల్లల ఆటో వెళుతుంటే.. షేరింగ్ ఆటో.. అందులో ఎక్కించుకుని తీసుకెళుతుంటే.. ఆటో కుదుపులకు ఆమె బ్లీడింగ్ ఎక్కువవుతుంటే.. ఎక్కడికి వెళ్లాలో తెలీక దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళితే.. తీసుకెళ్లిన ఐదు నిముషాలలో ఆమె ప్రసవించింది. మరి తీసుకురాకపోయి ఉంటే ఆమె ఏమయుండేదో ఒక్కసారి ఆలోచించండి. అంటే అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం’’ అని ఆ అమ్మాయి చెబుతున్నప్పుడు జగన్‌కి ఆమె లీడర్‌లానే కనిపించినట్లుంది.. అభినందనగా ఆమె తల నిమిరారు. పంచ్ డైలాగుల్లేవు. పరిణతి చెందిన గొంతు లేదు. వాక్య నిర్మాణం లేదు. ప్రసంగ విధానం లేదు. సింపుల్‌గా తనకు ఎదురైన అనుభవాన్ని చిన్న చిన్న మాటలోల చెప్పింది.. అంతే. ఆ అనుభవంలో ఆవేదన ఉంది.
ఆక్రోశం ఉంది. ఆగ్రహం ఉంది. ప్రజల అసహాయత ఉంది. ప్రభుత్వ ఉదాసీనత ఉంది. ఇన్ని ఉన్నాయి. మరి ఆమెలో.. ఆ అమ్మాయిలో.. లీడర్‌షిప్ ఎక్కడ ఉంది? వ్యవస్థని ప్రశ్నించడంలో ఉంది! ఒక సామాజిక అంశాన్ని ప్రజల దృష్టికి తేవడంలో ఉంది. అందుకే ఆమె గర్ల్ లీడర్. ఇలాంటి గర్ల్ లీడర్‌ల కోసమే ఐక్యరాజ్య సమితి వెదుకుతోంది.వెదకి ఏం చేస్తుంది? యుద్ధానికి పంపిస్తుందా? అవును యుద్ధానికే. ఆడపిల్లల చదువుల్ని, ఆరోగ్యాన్ని, ఆలోచనల్ని పట్టించుకోని సామాజిక రుగ్మతలపైకి, దురాచారాలపైకి, వివిధ పేదరికాల పైకి యుద్ధానికి పంపిస్తోంది. ఆ యుద్ధ నినాదం ‘గర్ల్ అప్’. ఆ యుద్ధం పేరు గ్లోబల్ 5కె. ఆ యుద్ధం జరగబోతున్నది భారత్‌లో. ఆ యుద్ధానికి సంసిద్ధమౌతున్న సైన్యం కనీసం 2000 మంది ఆడపిల్లలు. ఎవరికోసం జరుగుతున్న యుద్ధమిది? రాజస్థాన్‌లో కనీస సంక్షేమానికి, ఏమాత్రం సంరక్షణకు నోచుకోని ఆడపిల్లల్ని ఆదుకోవడం కోసం జరుగుతోంది.
ఒక ఆడపిల్ల కోసం ఇంకో ఆడపిల్ల చేయబోయే యుద్ధం! ∙∙ కరెక్ట్ పనేనా ఆడపిల్లల్ని యుద్ధానికి పంపడం? ఐక్యరాజ్యసమితికి ఎంత బలం ఉంది! ఎంత బలగం ఉంది! ఒక్క ఆదేశం ఇస్తే దేశాలన్నీ లైన్‌లోకి వచ్చి నిలబడతాయి. ఒక్క ఉత్తర్వుతో ఆ దేశాలన్నీ తమ ప్రభుత్వాల్ని లైన్‌లో నిలబెడతాయి. ‘ఫలానా చోట ఆడపిల్లలపై వివక్ష ఉంది. కలెక్టర్‌కి చెప్పి కరెక్ట్ చెయ్యి’ అని చెప్పొచ్చు. ‘మీరిలా ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తుంటే మీ ఊరి అభివృద్ధికి ఒక్క పైసా ఇచ్చేది లేదని’ బెదిరించవచ్చు. ‘ఆడపిల్లని బడికి పంపని ఇంట్లోంచి రేషన్ కార్డు తీసేసుకుంటామనీ, ఆడపిల్లను కూలి పనికి పంపుతున్నారని తెలిస్తే ఇంటి పెద్ద చేత ఊరికి ఒక రోజు ఊడిగం చేయిస్తామని’ హెచ్చరించవచ్చు. ఇవన్నీ చేయాలి గానీ, ఆడపిల్ల చేతికే కత్తి ఇచ్చి పంపడం ఏంటి? కత్తి ఇవ్వబోవడం లేదు ఐరాస. కత్తి కంటే పదునైన, కత్తికంటే పవరైన గుడ్డసంచీని చేతికి అందిస్తోంది.
అందులో విరాళాలు సేకరించి ఐక్యరాజ్య సమితికి పంపిస్తారు గర్ల్ లీడర్స్. ఇంటింటికీ వెళ్లేమీ సేకరించరు. 5కె రన్ తీస్తారు. తీస్తున్నప్పుడే విరాళాలు సేకరిస్తారు. వాటిని ఆడపిల్లల జీవితాల్ని మెరుగుపరిచే పథకాలకు, ప్రణాళికలకు, పర్యవేక్షణకు సమితి ఖర్చు చేస్తుంది.సంచీ, సేకరణ ఓకే. ఎందుకిలా ఐక్యరాజ్యసమితి గర్ల్స్‌లోని లీడర్స్‌ని మోటివేట్ చేస్తోంది? ఎందుకిలా ‘రిజిస్టర్ చేసుకుని 5కె రన్‌లో పాల్గొనండి’ అని ఆన్‌లైన్‌లో ఆహ్వానం పలుకుతోంది? ఆడపిల్లల్ని లీడర్స్‌గా మార్చడం కోసం! 5కె రన్‌లో రన్ ఒక్కటే ఉండదు. ఉత్సాహం కలిగించే విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది. ఉత్ప్రేరకంగా పనిచేసే స్పీచ్‌లు ఉంటాయి. ‘నా ముఖం నేనేమి లీడర్‌ని’ అని ఏ అమ్మాౖయెనా బిడియంగా నవ్వి, వెనక్కి జరిగితే ఊరుకోరు. ముందుకు లాగుతారు. చేత్తో చెయ్యి ఎత్తిపట్టి ఆ పిల్లని ప్రపంచానికి పరిచయం చేస్తారు.
‘నాన్న అమ్మ మీదకు చెయ్యెత్తినప్పుడు నువ్వెప్పుడైనా నాన్న చేతిని అడ్డుకున్నావా?’ అయితే నువ్వు లీడర్‌వే! నాన్నింటి వాళ్లు ఏదో అన్నారని అమ్మ ఒక్కటే.. చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వెళ్లి అమ్మ కన్నీళ్లు తుడిచావా?’ అయితే నువ్వు లీడర్‌వే. ‘నాన్నకు ఒంట్లో బాగోలేనప్పుడు స్కూటీపై కూర్చొబెట్టుకుని నువ్వే ఆసుపత్రికి డ్రైవ్ చేసుకెళ్లావా?’ అయితే నువ్వు లీడర్‌వే. ‘బడిలో తమ్ముడిని ఏడిపిస్తున్నవాడి చెంపను నువ్వెళ్లి ఛెళ్లుమనిపించావా?’ అయితే నువ్వు లీడర్‌వే. ‘క్యూలో కరెంట్ బిల్లు కడుతున్నప్పుడు నీ వెనుక ఉన్నవాళ్లు ముందుకు తోసుకెళుతుంటే.. ‘ఏయ్.. ఆగు’ అని.. క్యూ అంతా అదిరిపడేలా నువ్వు అరిచావా?’ అయితే నువ్వు లీడర్‌వే. ‘ఇంటి సంగతులే కాదు, పొరుగింటి బాధలూ పట్టించుకున్నావా? సహాయం చేశావా? సలహా ఇచ్చావా? సమాధాన పరిచావా?’ అయితే నువ్వు లీడర్‌వే.
సొంత సైన్యం అక్కర్లేదు. సాయుధురాలివి కానక్కర్లేదు. విప్లవ సాహిత్యం చదివుండనక్కర్లేదు. నీ పనిలో నువ్వుంటావు. పక్కనెవరో బాధలో ఉంటారు. వెళ్లి, ఏమైంది అని అడుగు. అడిగి, ఆ బాధను పోగొట్టేందుకు చేయగలిగింది చెయ్యి. అది చొరవ. అది బాధ్యత. రెండూ కలిసిందే నాయకత్వం.ఏ ఆడపిల్లలో ఉండదు చొరవ, బాధ్యత కలిసిన నాయకత్వం? అందుకే ఐరాస గర్ల్ లీడర్స్‌ని ఎంపిక చేసుకుంది. తను చేసేది చేస్తోంది. వీళ్లు చేయగలరనుకున్న దాన్ని చేయిస్తోంది. ఐరాస దగ్గర డబ్బుల్లేక కాదు. పిల్లల్ని ‘ఇన్‌వాల్వ్’ చెయ్యాలనుకుంది. ఆడపిల్లల సమస్యల్ని ఆడపిల్లల చేత ఫోకస్ చేయించాలనుకుంది. వీళ్ల 5కె రన్ మే 18న జరుగుతోంది. ‘గర్ల్ అప్’ 2010లో మొదలైంది. తొమ్మిదేళ్లుగా ఆడపిల్లల్లోని లీడర్‌షిప్‌ని పరుగులు పెట్టిస్తోంది. ఈ ఏడాది మన దేశంలో. రాజస్థాన్ కోసం. అక్కడి ఆడపిల్లల కోసం.
Comments
Please login to add a commentAdd a comment