
కీనోవాతో మరో ఆహార విప్లవం?!
నేటి ఆహార అవసరాలకు సరిపోయే విశిష్ట పోషక విలువలున్న కొత్త ఆహార పంటేదైనా ఉందా?
కీనోవా.. ఇది విశిష్టమైన పౌష్టిక విలువలున్న ఆహార పంట. మధుమేహాన్ని, గుండె జబ్బులను నివారించగల అవకాశం కలిగి ఉండడం ప్రత్యేకత. అందుకే ఈ తిండి గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ. 610 ధర పలుకుతోంది. వరి సాగుకు అవసరమైనంత నీరు, భూసారం, శ్రమ అవసరం లేని పంట కావడం మరో విశిష్టత. ఈ అద్భుతమైన పంటపై పాలకులు, శాస్త్రవేత్తలు దృష్టిపెడితే దేశానికి పౌష్టికాహార లోపం తీరడంతో పాటు చిన్న రైతుల తలరాతా మారుతుందంటున్నారు శాస్త్రవేత్త డా. కే శ్రీనివాస రావు.
నేటి ఆహార అవసరాలకు సరిపోయే విశిష్ట పోషక విలువలున్న కొత్త ఆహార పంటేదైనా ఉందా? తక్కువ వనరులతో మెట్ట భూముల్లోనూ సులభంగా పండించడానికి వీలయ్యే పంటేదైనా ఉందా? అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం, గోధుమలకు అనేక రెట్లు ఎక్కువ ధర రాబట్టే పంట, చిన్న రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటేదైనా ఉందా? బహుశా, ఈ ప్రశ్నలన్నిటికీ గత నాలుగేళ్లుగా నేను తింటున్న ‘కీనోవా’ సమాధానం కావచ్చు. ఆ జిజ్ఞాసతోనే మరింత లోతుగా తెలుసుకోడానికి కీనోవా పంటను అధికంగా పండించే బొలీవియా దేశానికి వెళ్లా. అక్కడ ప్రభుత్వాధికారుల నుంచి రైతుల దాకా అందరినీ కలిశాను. వారితో సంభాషణల్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ విశేషాలను మీతో పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం.
అధిక ప్రొటీన్లు.. అమినో ఆమ్లాలు..
కీనోవా మొక్క శాస్త్రీయ నామం ‘చేన్నోపోడియం కీనోవా’. ఇది దక్షిణ అమెరికాలో ఏండీ పర్వత శ్రేణిలో సుమారు 7 వేల ఏళ్ల నుంచి పండుతున్న పంట. కీనోవానే అక్కడి ప్రజలకు ముఖ్యమైన తిండిగింజ. 1993లో నాసా(అమెరికా అంతరిక్ష సంస్థ) శాస్త్రవేత్తలు దీనిలో ఉన్న అధిక ప్రొటీన్లు, వాటిలోని వాంఛనీయమైన అమినోఆమ్లాల నిష్పత్తిని గుర్తించాక కీనోవా బియ్యానికి గిరాకీ పెరిగింది. ఈ పంట పండే బొలీవియా, పెరు, ఈక్వడార్, కొలంబియా దేశాల్లో ఉత్పత్తి, ఎగుమతులు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) ఈ పంటను గుర్తించి గత ఏడాదిని ‘అంతర్జాతీయ కీనోవా సంవత్సరం’గా ప్రకటించింది.
కీనోవా బియ్యానికి భలే గిరాకీ!
భారతదేశంలో పండే ఎన్నో చిరుధాన్యాలు, ఓట్స్, పప్పుధాన్యాలలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని పోషకాలు కీనోవాలో కంటే ఎక్కువగానూ ఉండొచ్చు. కానీ, వాటిని వరి అన్నానికి బదులుగా ప్రతి రోజూ తినలేం. కానీ కీనోవాను వరి అన్నానికి బదులుగా రోజూ తినగలం. వరి అన్నానికి బదులుగా కీనోవాను రోజులో ఒకసారి మన ఆహారంలో తీసుకుంటే ఊబకాయాన్ని, గుండెజబ్బులను నివారించవచ్చని కొలంబియా విశ్వవిద్యాలయం (న్యూయార్క్)లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఏ ఏ దీక్షిత్ తెలిపారు. కీనోవాలో ప్రొటీన్లు, పీచుపదార్థం అధికంగా ఉన్నాయి. మలబద్ధకం, మధుమేహం ఉన్నవారికి వరి అన్నానికి బదులుగా వాడదగిన మంచి ఆహారం అవుతుంది.
అందుకే ఇతర చిరుధాన్యాలకు లేని గిరాకీ కీనోవాకుంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో కీనోవా బియ్యం కిలో ధర పది డాలర్లు(రూ. 610) ఉంది! గత పదేళ్లలో అంతర్జాతీయ విఫణిలో కీనోవాకు గిరాకీ 18 రెట్లు పెరిగి ప్రస్తుతం ఏడాదికి లక్ష టన్నులకు చేరుకుంది. ఈ పంట సాగుకు భూసారం, నీరు, శ్రమ వరి సాగుకు అవసరమైనంతగా అవసరం లేదు. అందుచేత చిన్న రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే పంట అవుతుందని ఆశిస్తున్నారు. ఇన్ని మంచి లక్షణాలున్న కీనోవా హరిత విప్లవం, శ్వేత విప్లవంలా మన తరం ఆహార విప్లవం అవుతుంది!
ఇప్పుడేం చేద్దాం?
భారత్‌లో ఆహార, ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్న వివిధ శాస్త్రజ్ఞులు కీనోవా గుణగణాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి భారతదేశపు ప్రజల ఆరోగ్య ఆహార అవసరాలకు కీనోవా ఎంతవరకు ఉపయోగపడుతుందో నిశ్చయించాలి. వివిధ రంగాల్లో నిపుణులు ఏకాభిప్రాయానికి రావాలి. ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఈ పంటపై అవసరమైన పరిశోధనలు చేయాలి. దేశంలో ఉన్న 130 వ్యవసాయ వాతావరణ మండలాల్లో ఎక్కడెక్కడ దీన్ని పండించవచ్చో రైతులకు తెలియజేయాలి. కీనోవా దిగుబడి ప్రస్తుతం ఎకరానికి సుమారుగా 300 కిలోలు మాత్రమే.
అందుకే అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలి. మధుమేహం, గుండెజబ్బు తదితర జబ్బులను నివారించడంలో కీనోవా ఉపయోగాన్ని వైద్యులు, శాస్త్రజ్ఞులు తగిన రీతిలో క్షేత్ర పరీక్షలు చేసి నిర్దిష్టమైన సూచనలివ్వాలి. భారత్‌లో వరి, గోధుమ సాగవుతున్న విస్తీర్ణంలో ఒక శాతం విస్తీర్ణంలో కీనోవాను పండించినా 20 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది! చిన్న రైతు నుంచి పెద్ద జబ్బులు ఉన్న వారి వరకు అందరికీ లబ్ధిని చేకూర్చే సదవకాశం కీనోవా ద్వారా మనకు అందుబాటులో ఉంది. శాస్త్రవేత్తలు, వైద్యులు, అధికారవర్గం, రాజకీయ నేతలు.. సమావేశమై కీనోవాను వివిధ కోణాల్లోంచి విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటే.. అది కొత్త తరానికి కావలసిన ఆహారాన్ని, రైతులకు చక్కని ఆదాయ భద్రతనూ సమకూర్చుతుంది.