సమాజంలో నెలకొన్న సమస్యల గురించి అందరికీ అవగాహన ఉంటుంది. వాటి పరిష్కార మార్గాల గురించి కూడా అందరికీ తెలుసు.
సమాజంలో నెలకొన్న సమస్యల గురించి అందరికీ అవగాహన ఉంటుంది. వాటి పరిష్కార మార్గాల గురించి కూడా అందరికీ తెలుసు. అయితే అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే చొరవ మాత్రం చాలామందిలో ఉండ దు. అలాగే తమ వ్యక్తిగత పరిస్థితుల గురించి చెబుతూ సమాజాన్ని సంస్కరించేంత ఓపిక, శక్తి తమకు లేవనే వారే ఎక్కువమంది కనిపిస్తుంటారు. అయితే సంస్కర్త హృదయానికి వ్యక్తిగత సమస్యలతో, వయసు, ఆర్థికస్థాయులతో పని లేదని కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. ఫలానా పని త మ స్థాయికి ఎక్కువ అనే భావన లేకుండా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల అనూరాధ బండారి.
మూడు వందల జనాభా ఉన్న బొమ్మనల్లి గ్రామంలో ఆమె ఒక అనామకురాలు. ‘ఫలానా వారి అమ్మాయి, ఏదో చదువుకొంటోంది...’ అనే గుర్తింపు మాత్రమే ఉంది. అయితే ఆ చిన్నపిల్లకు పెద్దపెద్ద ఆశలున్నాయి. తమ గ్రామానికి నీటి కరవును తీర్చాలనే తపన వాటిలో ముఖ్యమైనది. అందుకే తనను అదరగొట్టి బెదరగొట్టే జనాల మధ్య అనూరాధ మౌనంగా ఉండిపోలేదు. పెద్దపెద్ద వాళ్లే మౌనంగా ఉన్నారు, నాకెందుకులే అనుకోలేదు. నీటిసమస్యను పరిష్కరించడం గురించి అధ్యయనం చేసింది. అందరి దాహాన్ని తీర్చే మార్గాన్ని వెదికింది.
పంచాయతీ కమిటీని దారికి తెచ్చింది!
ముందుగా తమ గ్రామ సమస్యను ఒక స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లింది అనూరాధ. వారు గ్రామస్థితిగతులు గమనించి ‘‘ఒక వాటర్ ట్యాంక్‌ను నిర్మిస్తే మీ ఊరి నీటికరువు తీరుతుంది. దానికి పంచాయతీ ద్వారా నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది’’ అని అనూరాధకు వివరించారు. అనూరాధలోని ఉత్సాహాన్ని చూసి ఆమెకు అండగా నిలబడ్డారు. వాటర్ ట్యాంక్ విషయంలో ఎవరెవరిని కలవాలనే దాని గురించి గెడైన్స్‌ను ఇచ్చారు. ఆ మాత్రం సాయం చాలనుకుంది అనూరాధ.
కొంత మంది ప్రభుత్వాధికారులను కలిసి తమ ఊరి పరిస్థితి గురించి వివరించింది. అయితే దాంతో పెద్దగా ప్రయోజనం కనపడలేదు. చివరకు పంచాయతీ పెద్దలపై ఒత్తిడి పెంచసాగింది. పదేపదే అర్జీలు ఇస్తూ వాటర్‌ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేయసాగింది. గ్రామపంచాయతీకి ఉన్న శక్తి సామర్థ్యాలతో ఊరిలో వాటర్‌ట్యాంక్‌ను కట్టించడం పెద్ద పనేం కాదని, అయినా పంచాయతీ పెద్దలు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులకు వివరించింది అనూరాధ. దీంతో గ్రామస్థుల్లో కదలిక వచ్చింది. అందరూ ఆమెతో స్వరం కలిపారు.
పంచాయతీ పెద్దలు నిర్లక్ష్యం వీడి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పూనుకొన్నారు. రెండులక్షల రూపాయల నిధులతో నీటికరువును తీర్చారు. అనూరాధ అంతటితో ఆగలేదు. ఆ గ్రామానికి పంచాయతీ ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ముందు తను అవగాహన తెచ్చుకుని, తర్వాత పంచాయతీ పెద్దలపై ఒత్తిడి తీసుకు వచ్చింది. దీంతో బొమ్మనల్లి బతుకు చిత్రం మారిపోయింది. ఊరిలో వీధిదీపాలు వెలిగాయి, రోడ్ల నిర్మాణం జరిగింది.
ఆ విధంగా ఆ గ్రామాన్ని అనూరాధ మార్చేసింది. కనీస బాధ్యతలు నె రవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్న పంచాయతీ కమిటీని దారికి తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. లీడర్స్ యాక్సిలరేటింగ్ డెవలప్‌మెంట్(లీడ్) అనే జాతీయస్థాయి ఎన్జీవో అనూరాధను గ్రామాభివృద్ధి కోసం పాటు పడిన యువతిగా గుర్తించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా చేతుల మీదుగా అవార్డును ఇప్పించింది.
చొరవ అవసరం...
‘‘మన దేశంలో మనకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే వాటిని మనం ఉపయోగించుకోవడంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకొంటూ, వ్యవస్థను సరిదిద్దుకొంటూ సాగితే ఎలాంటి సమస్యా లేకుండా సాఫీగా జీవించడానికి అవకాశం ఉంది. నిర్లక్ష్యపూరిత వ్యవస్థను సరిదిద్దుకోవాలనే చొరవ అవసరం. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటే మంచిది...’’ అని అంటుంది అనూరాధ. తన ఊరిని ఆదర్శగ్రామంగా మార్చిన ఈ యువతి భావన కూడా ఆదర్శనీయమే!
- జీవన్
మన దేశంలో మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే వాటిని మనం ఉపయోగించుకోవడంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకొంటూ, వ్యవస్థను సరిదిద్దుకొంటూ సాగితే ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా జీవించడానికి అవకాశం ఉంది.
- అనూరాధ