ఐ ఫోన్ 6ను జాగ్రత్తగా వాడమంటున్న యాపిల్!
ఒకవైపు యూట్యూబ్‌లో ఐఫోన్6 కి సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఐ ఫోన్ 6, 6ప్లస్‌లు వంగిపోతున్నాయని వాటి వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోన్ వంపు గురించి వివరిస్తూ వీడియోలను కూర్చి యూట్యూబ్‌కు ఎక్కిస్తున్నారు. దీంతో యాపిల్ కంపెనీ చిరాకుపడుతోంది.
ఈ ఫిర్యాదు ఏకంగా యాపిల్ మార్కెట్ విలువనే దెబ్బతీసేస్థాయిలో ఉండటంతో నివారణ చర్యలకు సిద్ధమైంది. ఐ ఫోన్ 6, 6 ప్లస్‌లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకే ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చాయి. అలా అందుబాటులోకి వచ్చిన వాటిని ఇలా కొనేసుకొన్న వినియోగదారులు రెండు మూడు రోజుల్లో ఫోన్‌లు బెండ్ అవుతుండటాన్ని గుర్తించారు. 5.5ఇంచ్ డిస్‌ప్లేతో 6.9, 7.1 మిల్లీమీటర్‌ల థిన్‌తో ఉండే ఈ ఫోన్‌లను ఎక్కువసేపు జేబులో పెట్టుకొంటే వంపు తిరుగుతున్నాయని వారు అంటున్నారు.
ఇంకేముంది, ఐ ఫోన్ 6 మీద ఎంత క్రేజ్ ఉందో... అంతే వైరల్‌గా ఈ వంపు వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫేస్‌బుక్, ట్విటర్‌ల ద్వారా ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏకంగా ట్విటర్‌లో ‘బెండ్ గేట్’ పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు ఏర్పడ్డాయి. ఫలితంగా యాపిల్ మార్కెట్ విలువ మూడు శాతం వరకూ పడిపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ ఫోన్‌ల విషయంలో ఈ నెగిటివ్ పబ్లిసిటీ యాపిల్‌ను ఈ విధంగా దెబ్బకొట్టింది.
ఈ పరిణామాల మధ్య యాపిల్ కంపెనీ ఒక ప్రకటన చేసింది. ఎక్కువసేపు ఫోన్‌ను బ్యాక్‌పాకెట్‌లో పెట్టుకొంటే అది వంగినట్టు అనిపించడం నిజమేనని ఆ సంస్థ ధ్రువీకరించింది. ఫోన్ నాజూకుగా ఉన్నందువల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని.. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటన చేసింది. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. ఈ సమస్య గురించి సమీక్షించామని.. ఇకపై రూపొందించే ఐ ఫోన్ 6, 6 ప్లస్ ఫోన్‌లలో ఈ సమస్య తలెత్తకుండా చూసుకొంటామని ఈ సంస్థ హామీ ఇచ్చింది.