
తాను ఎవరో తెలియని ప్రదేశానికి వెళ్లాలని ఆశపడతారు హేర్తా మూలర్. సాధారణ జనాలకు దూరంగా ఉండాలని కాదు; తాను ఏ జాతి మనిషో నిర్ణయింపబడకుండా ఉండాలని. హేర్తా 1953లో రొమేనియాలో జన్మించిన జర్మన్. కమ్యూనిస్టు ప్రభుత్వం, ముఖ్యంగా నికోలాయ్ చౌషెస్కు నేతృత్వంలోని ప్రభుత్వం సాగించిన హింసాకాండ, సృష్టించిన భయోత్పాతాలను ఒక జర్మన్ మైనారిటీ వ్యక్తిగత కోణంలోంచి చిత్రిస్తారు హేర్తా.
ద ల్యాండ్ ఆఫ్ గ్రీన్ ప్లమ్స్, ది అపాయింట్‌మెంట్, ద హంగర్ ఐంజిల్ ఆమె ప్రసిద్ధ రచనలు. కవిత్వం, వ్యాసాలు రాశారు. ఆమె రచనలు సుమారు ఇరవై భాషల్లోకి అనువాదమైనాయి. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లు అనువాదకురాలిగా పనిచేశారు. రహస్య పోలీసులకు సహకరించని కారణంగా ఆ ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఆమె తొలి కథల సంకలనం రొమేనియాలో సెన్సార్ చేయబడింది. కొన్ని కథల ప్రతుల్ని జర్మనీకి రహస్యంగా చేరవేశారు. ‘ఏడవడానికి తగిన ఎన్ని కారణాలైనా ఉండనీ ఏడవొద్దని చెప్పే అలిఖిత చట్టాల్నించి’ తప్పించుకుని ముప్పైల్లో ఉన్నప్పుడు ఆమె తన భర్త, రచయిత రిచర్డ్ వాగ్నర్‌తో కలిసి జర్మనీకి తరలి వెళ్లారు. అయినా ఆమె రచనల కేంద్రం రొమేనియాలో తను పుట్టిన పల్లెటూరే. ఉద్వాసనకు గురైనవారి జీవితాల్ని చిత్రిస్తున్నందుకుగానూ 2009లో ఆమెను నోబెల్ పురస్కారం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment