నాకు నేను మెరుగులు దిద్దుకుంటూనే ఉంటాను... | Artist bali special interview | Sakshi
Sakshi News home page

నాకు నేను మెరుగులు దిద్దుకుంటూనే ఉంటాను...

Published Sun, Apr 26 2015 11:21 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

నాకు నేను మెరుగులు  దిద్దుకుంటూనే ఉంటాను... - Sakshi

నాకు నేను మెరుగులు దిద్దుకుంటూనే ఉంటాను...

ప్రముఖ చిత్రకారుడు బాపు తర్వాత అంతటి  పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు బాలి. లక్షల చిత్రాలు గీసిన చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన ‘చిత్ర’ యానాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో పనిచేసి, ఇప్పుడు సొంతగడ్డ విశాఖలో స్థిరపడ్డ బాలి జీవన ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే..
 
మా తండ్రి లక్ష్మణరావు బ్రిటిష్ వారి పాలనలో ఆర్మీలో సుబేదార్  ఆయనకు చిత్రకళపై ఆసక్తి ఉండేది. వీలు చిక్కినప్పుడల్లా బొమ్మలు వేసేవారు. అమ్మ అన్నపూర్ణ అందమైన ముగ్గులు వేసేవారు. అలా వారిద్దరి నుంచి నాకు చిత్రకళ అబ్బింది. ఆరేళ్ల వయసు నుంచే ఏకాంతంగా కూర్చుని ఏవేవో బొమ్మలు గీసేవాడ్ని. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా పీడబ్ల్యుడీలో చేరాను. అందులో ఉండగా నాకిష్టమైన బొమ్మలు వేసుకునే తీరికుండేది కాదు. దీంతో ‘బొమ్మలేసుకుని బతకలేనా?’ అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకొచ్చేశాను.

నేను గీసిన ‘ఉబుసుపోక’ అనే రేఖాచిత్రం 1958లో ఆంధ్రపత్రిక వారపత్రికలో తొలిసారిగా అచ్చయింది. ఆ తర్వాత కొన్ని తెలుగు దినపత్రికల్లో కార్టూనిస్టుగా, స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేశాను. అలా పనిచేస్తూనే నవలలకు కవర్ డిజైన్లు, బ్రోచర్ డిజైన్లు గీస్తూనే అందమైన బొమ్మలు వేసేవాడ్ని. మల్లాది, యండమూరి, లత, రంగనాయకమ్మ, అడవి బాపిరాజు, కొడవటిగంటి సహా దాదాపు ప్రముఖ రచయితలందరి నవలలకు కవర్ పేజీ డిజైన్లు వేశాను. కథలు రాశాను. కార్టూన్లపై ఎనిమిది పుస్తకాలు, జోక్స్‌పై రెండు సంకలనాలు తెచ్చాను. రెండు చిన్నపిల్లల నవలలు, ‘చిన్నారులు బొమ్మలు వేయడం ఎలా’? అనే పుస్తకం కూడా ముద్రించాను.

బాలి ఇలా..  

నేను పత్రికల్లో పనిచేసేటప్పుడు శంకర్ పేరు మీద ఆర్టులు, కార్టూన్లు వేసేవాడ్ని. అప్పటికే శంకర్ పేరుతో పలువురు ఆర్టిస్టులున్నారు. దీంతో అప్పటి పత్రికా సంపాదకుడు పురాణం గారు నన్ను ‘బాలి’గా మార్చారు.

పురస్కారాలు..

నాకెన్నో పురస్కారాలొచ్చాయి. న్యూజిలాండ్ బైబిల్ సొసైటీకి బొమ్మలు గీసినందుకు, పర్యావరణ పరిరక్షణపై జర్మనీ నిర్వహించిన పోటీలో ప్రతిభ చూపినందుకు ప్రశంసలందుకున్నాను. చిన్నపిట్టల పెద్దమనసు అనే పిల్లల నవలకు ఎన్‌సిఇఆర్‌టి బహుమతినిచ్చింది. ఇంకా చిత్రకళా సమ్రాట్, హంస వంటి పలు అవార్డులు దక్కాయి. నేను వేసిన పెయింటింగ్‌లను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మచిలీపట్నం డిప్యూటీ కలెక్టర్ ఆఫీసుల్లో అలంకరించారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చికాగో (అమెరికా)ల్లో నేను వేసిన బొమ్మలను ప్రదర్శించారు.

సాగరతీరంలో కాలక్షేపం..

నా సతీమణి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో కన్నుమూసింది. రెండేళ్ల క్రితం విశాఖలోని సొంతింటికి వచ్చేశాను. పిల్లలు అమెరికాలో సెటిలవ్వడంతో ఒక్కడినే ఉంటున్నాను. నా వంట నేనే చేసుకుంటాను. టిఫిన్‌కు బదులు పెరుగన్నం తినడమే నా ఆరోగ్య రహస్యం. పగలంతా ప్రశాంతంగా కూర్చుని బొమ్మలు వేసుకుంటాను. రోజూ సాయంత్రం వేళ సమీపంలోని బీచ్‌కి నడిచి వెళ్తాను. నాకు టీవీ అంటే ఇష్టం ఉండదు. సినిమా చూసి 30 ఏళ్లవుతోంది. బొమ్మలపై ఉన్న ఇష్టంతో ఒక్కడినే ఉన్నా నాకు బోర్ అనిపించదు. రాత్రివేళ కథల పుస్తకాలు చదువుతాను.

స్వయంకృషితోనే చిత్రకళను అభ్యసించాను. ఆర్టిస్టు ఎప్పుడూ సమాజాన్ని గమనిస్తూ ఉండాలి. బొమ్మల్లో మార్పులతో కొత్తదనం తెచ్చుకోవాలి. బొమ్మలెప్పుడూ మూసలా ఉండకూడదు. నేను రాసిన 30 కథలను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాను. జీవితాంతం బొమ్మలు గీస్తూనే ఉంటాను.
 ...::: బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం
 ఫోటోలు: శ్రీనివాస్ ఆకుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement