కాలం ఆమె చక్రాల కుర్చీ | As long as her wheel chair | Sakshi
Sakshi News home page

కాలం ఆమె చక్రాల కుర్చీ

Published Thu, Jan 23 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

As long as her wheel chair

లక్ష్యం వైపు నడిపించేది కదలిక. కానీ ఆ కదలిక దివ్యలో లేదు. చిన్నప్పుడే సెరిబ్రల్ పాల్సీఆమెను కదలకుండా చేసింది. పెద్దయ్యాక చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. అయితే ఆమె ఏం చేసిందో తెలుసా?  కాలాన్నే తన చక్రాల కుర్చీగా మార్చుకుని ఉత్సాహంగా ముందుకు సాగిపోతోంది!
 
ముంబైలోని ఓ థియేటర్...
 
అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడెవరూ లేక కాదు. వందలమంది ఉన్నారు. కానీ ఎవ్వరూ చిన్న శబ్దం కూడా చేయడం లేదు. తీక్షణంగా స్టేజివైపే చూస్తున్నారు. ఒక్కక్షణం రెప్పవేసినా అద్భుతమైన దృశ్యమేదో మిస్సయిపోతామన్నట్టుగా మైమరచి చూస్తున్నారు. స్టేజిమీద నాటకం నడుస్తోంది. ఆరుగురు వ్యక్తులు తమ పాత్రల్లో లీనమై నటిస్తున్నారు. కానీ అందరి దృష్టి ఒకే ఒక అమ్మాయి మీద. వీల్ చెయిర్‌లో కూర్చుని ఉందామె. హావభావాలతోనే పాత్రను పండిస్తోంది. నిజమైన నటనకు భాష్యం చెబుతోంది. ఆమె ప్రతి కదలికలోనూ ప్రత్యేకత. ఆమె పలికే ప్రతి పదంలోనూ స్పష్టత.
 
కానీ కొన్నేళ్ల క్రితం తను అలా లేదు. ఆమెలో ఆ కద లిక కొత్తగా వచ్చింది. ఆమె పదాలకంత స్పష్టత... తన కృషితో అబ్బింది. ఆమె పేరు దివ్య అరోరా. వీల్ చెయిర్‌లో కూర్చుని ఎందరి హృదయాలనో గెలిచిన విజేత!


 మీ దినచర్య గురించి చెప్పండి అని దివ్యను అడిగితే... ‘‘ఉదయం ఏడింటికి లేస్తాను, రెడీ అయ్యి, టిఫిన్ తిని, ట్యాక్సీలో ఆఫీసుకు వెళ్తాను, సాయంత్రం తిరిగొస్తాను’’ అంటూ చెబుతుంది. కానీ ఆమె చెప్పనివి, చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. ఉదయం లేచి ఆమె ఇల్లంతా సర్దుకుంటుంది. వంట చేసుకుంటుంది. టిఫిన్ తినేసి, లంచ్‌బాక్స్ పట్టుకుని ఆఫీసుకెళ్తుంది. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ మార్కెట్టుకు వెళ్తుంది. కూరగాయలు, సరుకులు తెచ్చుకుంటుంది. మళ్లీ వంట చేసుకుంటుంది. రాత్రి ల్యాప్‌టాప్ ముందేసుకుని మెయిల్స్ చూసుకుంటుంది. స్క్రిప్టులు రాసుకుంటుంది.
 
మూడున్నరేళ్ల వయసులో సెరెబ్రల్ పాల్సీ వ్యాధి బారినపడి, శరీరమంతా చచ్చుబడిపోయిన అమ్మాయి... తనకు తాను సత్తువ సమకూర్చుకుని, అవయవాలను అదుపులోకి తెచ్చుకుని, అందరిలానే అన్ని పనులూ చేసుకోవడం సామాన్యమైన విషయమా?
 
న్యూఢిల్లో పుట్టింది దివ్య. పుట్టినప్పుడు అందరిలానే ఉంది. కానీ మూడున్నరేళ్లు వచ్చాక మాత్రం ఆమె అందరిలాంటిది కాదని అర్థమయ్యింది. సెరిబ్రల్ పాల్సీ అనే భయంకరమైన వ్యాధి ఆ చిన్నారి శరీరం నుంచి కదలికలను కాజేసింది. ఆమెకసలు మాటన్నదే రాకుండా చేసింది. తల్లిదండ్రులు కుంగిపోయారు.
 
తానే శిల్పి... తానే శిల్పం...

 
పదం పదం పట్టి పలుకుతుంటే తల్లిదండ్రులు చూసి విస్తుపోయారు. తమ కూతురు ఏదైనా సాధించగలదన్న నమ్మకం ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు దివ్య. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్... వరల్డ్ సినిమా, ఫ్రెంచ్ భాషల్లో డబుల్ ఎమ్.ఎ. చేసింది దివ్య. ఒక ట్యూటర్‌ని పెట్టుకుని మరీ ఆరు భాషల్లో ప్రావీణ్యత సంపాదించింది. కలం పట్టి కథలు రాసింది. నాటకాలు అల్లింది. వాటిని డెరైక్ట్ చేసింది. వాటిలో నటించింది. డెబ్భై రెండు భాషల్లో ఉన్న ఓ ఫేమస్ ఫ్రెంచ్ నాటకాన్ని ‘మెలోడీ ఆఫ్ లవ్’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించింది దివ్య.
 
మరో కొత్త పయనం...
 
మనదైన ముద్ర వేయడంలో ఉండే ఆనందం కోసం అనుక్షణం తపన పడుతుందామె. అందుకే మరో రంగంలో అడు పెట్టబోతోంది. ఈ యేడు ఒక సినిమా కూడా తీయబోతోంది దివ్య. కథ ఆమే రాసింది. డెరైక్షన్ కూడా తానే చేయబోతోంది. నిజానికి ఆమె ఎప్పుడో ఇది చేయాల్సింది. నాలుగేళ్ల క్రితమే కథ రెడీ చేసుకుని, దానికి దర్శకత్వం వహించమంటూ సంజయ్‌లీలా భన్సాలీ దగ్గరకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో ఆమె కోరిక నెరవేరలేదు. అయితే అతడు గుజారిష్ సినిమా తీయాలనుకోవడం దివ్య లైఫ్‌కి మరో టర్న్ ఇచ్చింది. వీల్‌చెయిర్‌కి అంకితమైపోయిన వ్యక్తిగా ఎలా నటించాలో హీరో హృతిక్ నేర్పించమని దివ్యను అడిగాడు సంజయ్. అతడిని నీ దగ్గరకు పంపించాలా, నువ్వు వస్తావా అన్నాడు. తానే వస్తానంది దివ్య. ఢిల్లీని వదిలి ముంబై చేసింది. హృతిక్‌కి తర్ఫీదునిచ్చింది. అది ఆమె పేరు సినీ ప్రపంచానికి కూడా పరిచయం చేసింది. అదే నేడు సినిమా తీసేందుకు ఆమెకు దారి చూపింది.
 
కార్ట్‌వీల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే యాడ్ ఏజెన్సీని నడుపుతుతోంది. సినీ అడిక్ట్స్ అనే సంస్థ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో దివ్య ఒకరు. వీటితో పాటు రచన, నటన, దర్శకత్వం, పాటలు రాయడం, తీరిక వేళల్లో చిత్రాలు గీయడం, సినిమా ప్లాన్లు... వీల్ చెయిర్‌లో కూర్చుని ఇదంతా ఎలా సాధించగలుగుతున్నారు అని ఎవరైనా అడిగితే... ‘‘ఓ వ్యక్తి ఏదైనా సాధించాలంటే అడ్డుపడేది అవకరం కాదు... అవగాహనా రాహిత్యం, ఆలోచనాలోపం’’ అంటుంది దివ్య నవ్వుతూ. ‘‘నా నాటకంలో ఏడుగురు ఉంటారు. నాతో కలిపి ఆరుగురు మనుషులు, ఏడోది నా వీల్ చెయిర్, అది కూడా ఎప్పుడో నా పనిలో భాగమైపోయింది, ఎందుకంటే అది లేకపోతే నేను లేను కదా’’ అనే దివ్య ఆత్మవిశ్వాసాన్ని కొలిచే ప్రమాణాలు ఉన్నాయా ప్రపంచంలో!
 
- సమీర  నేలపూడి
 
 దివ్య దృక్పథం


 గతంలో దివ్య కొన్నాళ్లు ఫ్రాన్స్‌లో నివసించింది. అక్కడి నుంచి వచ్చాక విదేశాలతో పోలిస్తే మన దేశంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ పట్ల ప్రజల ఆలోచనలు, దృక్పథాలు ఎంత వేరుగా ఉన్నాయో ఆమెకు అర్థమైంది. వారికి తగిన ప్రోత్సాహం, ఓదార్పు అందడం లేదని ఆమెకి అనిపించింది. అందుకే తనలాంటి కొందరికి ధైర్యా న్నివ్వడానికి, ముందుకు నడిపించడానికి ‘ఎహెడ్’ అనే సేవాసంస్థను నడుపుతోంది. మీ సంస్థ ఏం చేస్తుంది అనడిగితే.. నాలాంటి (వైకల్యం ఉన్నవారు) కొందరిని నాలాగే (ప్రతిభావంతులుగా) తయారు చేస్తుంది అంటూ నవ్వేస్తుంది దివ్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement