
ఆసియా అమ్మాయిలు ఎంతో గొప్పగా అమెరికా అమ్మాయిల్ని నెత్తిన పెట్టుకుంటే, వీళ్లేం చేశారో చూడండి! బాల్య చాపల్యంతో తెలియక చేసిందే. కానీ, వీడియోను చూస్తే ఈ కోతుల్ని పట్టలేం బాబోయ్ అనిపిస్తుంది. అంత ‘బుల్లీయింVŠ ’ చేశారు ఇంత అందమైన ముఖాలు వేసుకుని!
పైన వీడియో గ్రాబ్ చూడండి. మధ్యలో ఉన్న అమ్మాయి మిస్ యు.ఎస్.ఎ. శారా రోజ్ సమ్మర్స్. కుడివైపున ఉన్నది మిస్ ఆస్ట్రేలియా ఫ్రాన్సెస్కా హంగ్. ఎడమవైపున మిస్ కొలంబియా వలేరియా మొరేల్స్. ఈ ముగ్గురిలో ఒకరికి ఇవాళ బ్యాంకాక్‌లో జరుగుతున్న ‘మిస్ యూనివర్స్’ పోటీలలో టైటిల్ వస్తే కనుక ఆ ఒకరి పేరు నాన్–ఇంగ్లిష్ దేశాలకు అలవాటవడానికి కొన్నాళ్లు పట్టొచ్చు. శారా, ఫ్రాన్సెస్కా, వలేరియా.. నోరు తిరగని పేర్లేమీ కానప్పటికీ.. ఐశ్వర్యలా, సుస్మితలా మనకు వెంటనే స్ఫురణకు రాని ఇంగ్లిష్ పేర్లవి.. ‘హు వన్ మిస్ యూనివర్స్ 2018?’ అంటే!
పేర్లను, పదాలను అటుంచితే.. ఇంగ్లిష్ అంతా వేరుగా ఉంటుంది. ఆ ఉచ్చారణ, గ్రామర్, పదాల విరుపుల్లోని ఆ స్టెయిల్.. మనది కాదు.
ఐశ్వర్యను తిన్నగా పలకడం మొదట్లో వాళ్లకెలా చేతనై ఉండదో.. ఇంగ్లిష్ పేర్లను పలకడం, గుర్తుపెట్టుకోవడం, పెట్టుకుని సరిగ్గా అలానే ప్రొనౌన్స్ చెయ్యడం మనకు చేతకాదు. టై కట్టుకోవడం ఎలాగో యూట్యూబ్‌లో చూసి చేర్చుకోగలం. ప్రాక్టీస్ చేసి సూది మొనలా ఉండే హై హీల్స్ మీద నడవగలం. ఆ భాషే.. ఒక పట్టాన ఒంటబట్టదు. మాట్లాడలేం ఇంగ్లిష్‌లో గడగడ. గడగడలాడించేవారు మనలోను ఉంటారు. కానీ విన సొంపుగా ఉండదు. స్టెయిల్ మిస్సవుతుంది. స్టెయిల్‌ని కూడా సాధన చేసి మాట్లాడితే మనకే అన్‌నేచురల్‌గా అనిపిస్తుంది. కానీ మాట్లాడాలి. ఇంగ్లిష్ మాట్లాడలేకపోతే మన ఊళ్లో ఉన్న మార్ట్‌లోనే చెల్లుబాటు కాని ముఖంతో నిల్చోవాల్సి వస్తుంది. ఇంక బెంగుళూరు వెళ్లేం మాట్లాడతాం? వీసా ఆఫీస్‌కి బలహీనమైన భాషతో ఎలా నడిచి వెళ్తాం? మాతృభాషను బలహీనం అనడం కాదు. అమ్మ మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటుంది. ఇంగ్లిష్ పెద్దమ్మ అలాక్కాదు. చికాగ్గా ముఖం పెడుతుంది.‘సే ఇట్ వన్సెగైన్’ అని. చచ్చినట్లు కంట్లోంచి ఇంగ్లిష్ ఉబికి రావల్సిందే. ఇంగ్లిష్ లేకుండా, ఇంగ్లిష్ మాట్లాడ్డం రాకుండా బతకలేం. అయినా కూడా.. వెస్టర్న్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. అందాల పోటీలకు వెళ్తున్న మన అమ్మాయిలకు ధైర్యంగా బెస్టాఫ్ లక్ చెబుతున్నాం.
మనమే కాదు, మనకంటే తక్కువ ఇంగ్లిష్ తెలిసిన దేశాల్లోని వాళ్లు కూడా వచ్చిన రెండు ముక్కల్తోనే, నాలుగు రాళ్ల కోసం దేశాటనకు చద్దిమూటల్ని కట్టుకుంటున్నారు. ఇంగ్లిష్ దేశాల వాళ్లకు మళ్లీ ఇంత కష్టం ఉండదు. మన ఊళ్లోకొచ్చి కూడా వాళ్లు హాయిగా ఆ వచ్చిన రెండు రోజులు బతికేసి వెళ్లిపోగలరు. మనమే వాళ్ల భాషలో వండిపెడతాం కాబట్టి. ఇప్పుడీ అమ్మాయిలున్నారు కదా.. వాళ్లు ఏం చేశారంటే, అందాల పోటీలో కంటెస్ట్ చెయ్యడానికి దేశం కాని దేశంలోకి, భాష తెలియని దేశంలోకి వచ్చి కూడా, వాళ్లతో పాటు కంటెస్ట్ చెయ్యడానికి వచ్చిన లోకల్ వియత్నాం అమ్మాయినీ, లోకల్ కాంబోడియా అమ్మాయిని.. ఇంగ్లిష్ మాట్లాడ్డం రాదని వెక్కిరించారు! నేరుగా వెక్కిరించలేదు. వీడియో ఒకటి తీసి దాన్ని నెట్‌లోకి అప్‌లోడ్ చేశారు! పాపం అంతకు ముందే కాంబోడియా కంటెస్టెంట్ రెర్న్ సైనత్.. మధ్యలో ఉన్న అమ్మాయి పక్కన నిలబడి గొప్పగా ఆ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకుంది.. ‘చూశారా! నేనూ, నా పక్కన ఇంగ్లిష్ అమ్మాయి’ అన్నట్లు! ఆసియా అమ్మాయిలు అంత గొప్పగా అమెరికా అమ్మాయిల్ని నెత్తిన పెట్టుకుంటే, వీళ్లిలా కోతుల్లా చేశారు! బాల్య చాపల్యంతో తెలియక చేసిందే. కానీ వీడియోను చూస్తే ఈ కోతుల్ని పట్టలేం బాబోయ్ అనిపిస్తుంది.
అంత ‘బుల్లీయిం ’ చేశారు ఇంత అందమైన ముఖాలు వేసుకుని!‘‘తనెంత తెలివైందో చూడు! ఇంగ్లిష్ వచ్చినట్లే యాక్ట్ చేసింది. సంభాషణంతా అయ్యాక చివర్న ఒక ప్రశ్న అడుగు.. బ్లాంక్ ఫేస్ పెడుతుంది, ఏం అర్థంకాక’’ (మిస్ వియత్నాం హెన్నీ హావభావాల్ని పెద్ద నవ్వుతో ఇమిటేట్ చేస్తూ.. మధ్యలో ఉన్న మిస్ యు.ఎస్. అన్న మాట).ఆ మాటకు.. ‘అవునవును’’ అని ఎడమవైపు మిస్ కొలంబియా నవ్వు. ‘‘ఏదేదీ మళ్లీ చేసి చూపించు’’ అని కుడివైపు మిస్ ఆస్ట్రేలియా నవ్వు. ఈ అమ్మాౖయెతే ఎంత కోతిలా బిహేవ్ చేసిందో వీడియోలో చూడాల్సిందే. లేదంటే పందొమ్మిదో శతాబ్దపు అమెరికన్ సోషల్ క్రిటిక్ టి.ఎస్.ఇలియట్.. సమాధిలోంచి లేచి వచ్చి వర్ణించాలి. ఆ తర్వాత ముగ్గురూ మిస్ కాంబోడియా రెర్న్ సైనత్ మీద పడ్డారు. ‘‘ఆ పిల్ల నోట్లోంచి ఒక్క ఇంగ్లిష్ ముక్క రాలేదు చూశావా!’’, ‘‘ఎంత అయోమయంగా ఉంటారో ఇలాంటి వాళ్లు ఎవరితోనూ కలవలేక. ఒక్కరు కూడా ఇక్కడ ఆ పిల్ల భాషలో మాట్లాడేవాళ్లు లేరు’’ (సైనత్ గురించి మిస్ యు.ఎస్., మిస్ ఆస్ట్రేలియా). వీళ్ల తీరుకు సోషల్ మీడియా విస్తుపోయింది. అక్షింతలు కూడా వేసింది.
చివరికి ఆ మధ్యలో ఉన్న అమ్మాయి శారా రోజ్ సమ్మర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సారీ’ చెప్పింది. తనే హీరోయిన్ ఈ ఎపిసోడ్ మొత్తానికి. ఒకవేళ మిస్ యూనివర్స్ టైటిల్ ఈ ముగ్గురికీ మిస్ అయి, ఆ ఇద్దరిలో ఒకరికి వచ్చినా వీళ్లు బాధపడే యోగ్యత లేదిప్పుడు. అంతగా పశ్చాత్తాపంలో ఉన్నారు. ‘ప్రతి కల్చర్ గొప్పది. ప్రతి భాష గొప్పది. హెన్నీ, సైనత్‌ల మీద నాకు రెస్పెక్ట్ ఉంది. మేమంతా ఎక్కడెక్కడి నుంచో ఒక చోటికి వచ్చిన వాళ్లం. మేం అక్కచెల్లెళ్లం’ అని చక్కటి అందమైన ఇంగ్లిష్‌లో కామెంట్ పెట్టింది శారా రోజ్.తెలిసిన భాషలో భావయుక్తంగా మాట్లాడ్డంలో లేని అందం, భాష తెలియకపోయినా భావం వ్యక్తం అయ్యేలా మాట్లాడ్డంలో ఉంటుంది. సారీ అమ్మాయిలూ.. మీ అంత మంచి ముఖాల్ని కోతులు అన్నందుకు! కోతి వేషాల్ని ఆపేందుకు పెద్దవాళ్లు అనేమాటే ఇది. ఆల్ ది బెస్ట్. టైటిల్ కొట్టుకొచ్చేయండి. కొట్టుకురాలేకపోయినా పర్లేదు. మీరు అందాల రాణులే. అపాలజీ చెప్పడం వల్ల మీ శిరస్సులపై కిరీటం లాంటి ధగధగల వెలుగులేవో ఈసరికే వచ్చి చేరడం మీరూ గమనించుకునే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment