పచ్చందనాల అద్భుతం...
తేయాకు తోటలతో పచ్చని కొండప్రాంతాలు, అరేబియా సముద్ర అందాలు గల కేరళను చూసే అవకాశం ఇటీవల మా వారికి సెమినార్ రూపంలో రాగానే వదలాలనిపించలేదు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన మేము గంటన్నరలో ‘కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’లో దిగాం. చుట్టూ చూస్తే ‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అన్న పాట గుర్తుకొచ్చింది. మేం దిగుతున్నప్పుడే సన్నని తుంపర పడుతోంది. ఆ తుంపరలో తడుస్తూనే ఫొటోలు తీసుకున్నాం. అక్కడ నుంచి ఒక టాక్సీ తీసుకొని ఐఎమ్‌ఎ హౌజ్‌కు వెళ్లాం. మాకిచ్చిన రూమూ, మా వారి కాన్ఫరెన్సూ అక్కడే. అది జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియమ్‌కు వెనకవైపే ఉంది. కొచ్చిన్ చాలా శతాబ్దాలుగా మసాలా దినుసుల వ్యాపారానికి ప్రధాన కేంద్రం. కేరళకూ, లక్షద్వీప్‌కూ సంబంధించిన హైకోర్టు కొచ్చిన్‌లోనే ఉంది. త్రివేండ్రం కేరళకు రాజధాని అయినప్పటికీ కొచ్చినే పెద్దది. కొచ్చి ఫోర్టు నుండి కొలంబో, లక్షద్వీప్‌లకు ఓడలో వెళ్లే సౌకర్యం ఉంది.
బీచ్‌లో సూర్యాస్తమయం...
సెమినార్ పూర్తయ్యాక పోర్టుకు బయల్దేరాం. దూరంగా పెద్ద పెద్ద ఓడలు, వరసగా చైనీస్ ఫిషింగ్ నెట్స్.. సూర్యాస్తమయ సమయంలో ఎంతో అందంగా కనువిందు చేశాయి. బీచ్‌లో మామిడికాయ ముక్కలు, ఊరబెట్టిన ఉసిరికాయలు రుచి చూశాం. ఇక్కడ నుంచి అతిపెద్దదైన ‘మెరైన్ డ్రైవ్’కు వెళ్లాం. ఇక్కడ బోటింగ్ సదుపాయమూ ఉంది. ఇక్కడ కేరళ సందర్శన గుర్తుగా ఒక పడవ బొమ్మను కొనుక్కొని ‘డచ్ హౌస్’కు వెళ్లాం.
హోటళ్లకు, బడులకు తెలుగు పేర్లు...
‘డచ్‌హౌస్’ఒక మ్యూజియం. గోడలకు మ్యూరల్ పెయింట్స్ చాలా ఉన్నాయి. నాటి రాజులు వాడిన వస్తువులు, ఆయుధాలూ, చెక్కతో, ఏనుగుదంతంతో, రోజ్‌వుడ్‌తో.. చేసిన మేనాలూ ఉన్నాయి. అంత పెద్ద మేనాలు అప్పటి బోయీలు ఎలా మోసేవారో.. అనిపించింది. ఎక్కువగా రామవర్మ, కేరళవర్మ అనే రాజులవి, వాళ్ల దివానులవి, రాణులవి, పిల్లలవి చిత్రపటాలు ఉన్నాయి. వాటిని బట్టి అప్పట్లో వాళ్లు వస్త్రధారణతో రాచరికం వలె దర్ఫంతో కాక సాధారణ ప్రజానీకంలాగా ఉన్నారని అర్థమైంది. స్త్రీలూ, పురుషులు అందరూ తెల్లని వస్త్రాలనే ధరించేవారని తెలిసింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించినప్పుడు రామవర్మ అనే రాజు వారి దేశ జెండాతో సహా భారతదేశ జెండాను ఎగరవేస్తూ ఉన్న చిత్రపటం ఉంది. భారత స్వాతంత్య్ర సమయంలో ఇండియన్ యూనియన్‌లో కలవడానికి కొచ్చిన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఇక చైత్రం ఫుడ్స్, శ్రావణ నిలయం.. అంటూ మన తెలుగు నెలల పేర్లు షాపులకు కనిపించాయి. ‘ఎలా ఉన్నారు?’ అని అడగడానికి ‘సుగమాణ’ అనాలని నేర్చుకున్నాం.
దక్షిణ ద్వారక గురువాయూర్...
‘దక్షిణ భారత ద్వారక’గా పేరుగాంచిన ‘గురువాయూర్’కు వెళ్లేదారిలో ‘జూబిలీ మిషన్ మెడికల్ కాలేజీ’, ‘ఎలిఫెంట్ క్యాంప్’ చూశాం. ఇక్కడ దాదాపు అరవై డెబ్బై ఏనుగుల దాకా ఉన్నాయి. ఇవి దేవస్థానానికి సంబంధించిన ఏనుగులట. వీటన్నింటినీ ఒకే చోట చూడటం అబ్బురమనిపించింది. అక్కడే మావటి వాళ్లు వాటికి సపర్యలు చేస్తూ కనిపించారు. వాళ్లు చెప్పినట్టు ఏనుగులన్నీ బుద్దిగా నడుచుకోవడం భలే అనిపించింది. గురువాయూర్ ఆలయ ప్రవేశం చేయాలంటే పురుషులు ధోవతి, కండువా మాత్రమే ధరించాలి. స్త్రీలు చీరలు లేదా పంజాబీ డ్రెస్సులు ధరించాలి. గర్భగుడిలో కృష్ణుడి రూపం మనోహరం. ఇవన్నీ చూస్తూ కొచ్చి కొచ్చాక ‘లులూ’ అనే షాపింగ్ మాల్‌కు వెళ్లాం. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. సామాన్లు తీసుకెళ్లే ట్రాలీలు కార్ల ఆకారంలో ఉన్నాయి. కార్లలో పిల్లలు కూర్చుని స్టీరింగ్ తిప్పుతూ ఆడుకుంటుంటే, కార్లపైన సామాన్లు పెట్టుకుంటూ తీసుకెళుతున్నారు తల్లితండ్రులు. అందాల నగరిలో పచ్చందనాల అద్భుతాలు చూసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం.
- కందేపి రాణీ ప్రసాద్, హైదరాబాద్