Jawaharlal Nehru stadium
-
ఫ్రాంచైజ్ లీగ్ టోర్నమెంట్లో గోవా చాలెంజర్స్ శుభారంభం
చెన్నై: ఫ్రాంచైజీ లీగ్ టోర్నీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఐదో సీజన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ శుభారంభం చేసింది. చాలెంజర్స్ 9–6 పాయింట్ల తేడాతో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న జైపూర్ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 1–2 తేడాతో చో సుంగ్ మిన్ చేతిలో ఓడగా... మహిళల సింగిల్స్‌లో ల్యూ యాంగ్ జి 3–0తో సుతాసిని సవేతాత్ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో హర్మీత్–ల్యూ ద్వయం 2–1తో రోనిత్ భాంజా–సుతాసినిలపై గెలుపొందింది. రెండో పురుషుల సింగిల్స్‌లో మిహాయి బొబొసికా 2–1తో రోనిత్ భాంజాను ఓడించగా... రెండో మహిళల సింగిల్స్‌లో నిత్యశ్రీ మణి 2–1తో యశస్విని ఘోర్పడేపై విజయం సాధించింది.ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో మూడు మ్యాచ్‌లు నెగ్గిన గోవా ఖాతాలో 9 పాయింట్లు చేరగా... రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పేట్రియాట్స్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. అంతకుముందు తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ లీగ్‌ను ప్రారంభించారు. -
'పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం
Struggle of Young Pole Vaulter Devraj: భారతదేశంలో క్రీడలంటే మొదటగా గుర్తుకువచ్చేది.. క్రికెట్. క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్, చెస్ లాంటి క్రీడలకు కాస్తో కూస్తో ప్రాధాన్యం ఉందని చెప్పొచ్చు. మనకు తెలియకుండా వివిధ రంగాల క్రీడల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను చూపెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఆ రంగంలో రాణించేలా ఆయా ప్రభుత్వాలు ఆటగాళ్లను ప్రోత్సహించడం లేదు. ఆ కోవకు చెందినవాడు దేవరాజ్. రాజస్తాన్‌కు చెందిన దేవరాజ్‌కు గొప్ప పోల్‌వాల్టర్ కావాలనేది కల. చిన్నప్పటి నుంచే పోల్‌వాల్ట్‌పై మమకారం పెంచుకున్న అతను.. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లేనప్పటికి తన సొంతకాళ్లపై కష్టపడుతూనే పోల్‌వాల్ట్‌ను ఇష్టపడి నేర్చుకున్నాడు. 23 ఏళ్ల వయసు వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్‌వాల్ట్‌లో మెళుకువలు అందిపుచ్చుకున్న దేవరాజ్..తన శిక్షణలో మరింత రాటుదేలేందుకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఎంచుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవరాజ్ 2019లో ఢిల్లీలో అడుగుపెట్టాడు. నెహ్రూ స్డేడియానికి ఆనుకొని పక్కనే ఒక డ్రైనేజీ ఉంటుంది.. దానికి ఆనుకొని ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే దేవరాజ్ అద్దెకు ఉండేవాడు. పోల్‌వాల్ట్ కర్ర తన రూమ్‌లో ఉంచడం సాధ్యం కాకపోవడంతో ఇంటి టెర్రస్‌కు తాడుతో కట్టేవాడు. ఉదయం నాలుగు గంటలకే లేచి మూడు గంటలపాటు నెహ్రూ స్డేడియంలో సాధన చేసేవాడు. అనంతరం పొట్టకూటి కోసం సైకిల్‌పై వెళ్లి ఎక్కడ ఏ పని దొరికినా ఇష్టంతో చేసేవాడు. చదవండి: ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్ ఎలాగైనా పోల్‌వాల్టర్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపెట్టడంతో పాటు.. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కల గన్నాడు. అతను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. అతను వచ్చిన ఆరు నెలల్లోనే కరోనా మహమ్మారి ఉపద్రవం ముంచుకొచ్చింది. దీంతో తాను రోజు ప్రాక్టీస్ చేసే నెహ్రూ స్టేడియాన్ని మూసేశారు. దీంతో ఇంటికి తిరిగి వెళ్లలేక.. చేసేందుకు పనిలేక నానా అవస్థలు పడ్డాడు. అయితే తన ఆశయాన్ని మాత్రం దేవరాజ్ ఎన్నటికి విడవలేదు. పరిస్థితులు సద్దుమణిగాక నెహ్రూ స్డేడియాన్ని మళ్లీ తెరిచారు. ఈసారి దేవరాజ్ సరికొత్తగా సిద్ధమయ్యాడు. పొద్దంతా నెహ్రూ స్టేడియంలో పోల్‌వాల్ట్ సాధన చేస్తున్న దేవరాజ్..రాత్రుళ్లు నిర్మాణంలో ఉన్న భవనాలకు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ బతుకుతున్నాడు. ప్రస్తుతం తాను సంపాదిస్తున్న ప్రతీ రూపాయి అద్దెకు.. తిండికే సరిపోతున్నాయి. తన ఆటను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సహకారమందిస్తుందనే ఆశతో దేవరాజ్ ఎదురుచూస్తున్నాడు. చదవండి: Neeraj Chopra: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా రికార్డు -
సచిన్ జ్ఞాపికలు చోరీ
కొచ్చి: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన వన్డే బౌలింగ్ కెరీర్లో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ రెండూ కొచి్చలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోనే (5/32– ఆస్ట్రేలియాపై 1998లో, 5/50 పాకిస్తాన్‌పై 2005లో)∙రావడం విశేషం. అతని పేరిట ఈ మైదానంలో సచిన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అభిమానులకు ప్రదర్శించడం కోసం సచిన్ తన టీమ్ జెర్సీ, సంతకం చేసిన బ్యాట్, బంతి జ్ఞాపకంగా అందజేశాడు. అయితే ఇప్పుడు సచిన్ పెవిలియన్‌లో వాటి జాడ కనిపించడం లేదు. విషయం బయటపడే సరికి స్టేడియం అధికారులు ఇతరులపై తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వెతికినా అవి లభించలేదు. చివరకు ప్రా«థమిక విచారణలో వాటిని ఎవరో దొంగతనం చేసినట్లు తేలింది. అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు కానీ... ఒక దిగ్గజ క్రికెటర్‌కు సంబంధించి వస్తువులను కనీసం జాగ్రత్తగా కూడా ఉంచకుండా అధికారులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మలీ్టపర్పస్ స్టేడియం కేరళ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ పరిధిలోనే ఉంది. -
2019 మంది తల్లులకు పాదపూజ
గోదావరిఖని(రామగుండం): అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం 2019 మంది మాతృమూర్తులకు పాదపూజ చేశారు. కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్దసంఖ్యలో మాతృమూర్తులు హాజరయ్యారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన తల్లి పాదాలను కడిగి ఆశీర్వాదం అందుకున్నారు. రామగుండం నియోజకవర్గంలోని 2019 మంది తల్లులకు వారి పిల్లలు పాదాభిషేకం నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్దగా ఈ తరహా కార్యక్రమం నిర్వహించిన విజయమ్మ ఫౌండేషన్‌కు వండర్బుక్ రికార్డును సంస్థ ప్రతినిధులు బింగి నరేందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. -
‘పరీక్ష’ మొదలైంది!
కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం వచ్చే నెల 6 వరకు కొనసాగనున్న ప్రక్రియ తొలి రోజు 1407 మంది హాజరు పర్యవేక్షించిన సీపీ, రూరల్ ఎస్పీ వరంగల్ : పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఎంపికైనవారికి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో, రూరల్ పోలీసు విభాగం పరిధిలో ఎంపికైన వారికి కేయూ మైదానంలో ఫిజికల్ టెస్ట్‌లు జరిగారుు. గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షల్లో 32,070 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఉదయం 5 గంటలకే అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే మైదానాలకు చేరుకున్నారు. ముందుగా అభ్యర్థుల ఆధార్ కార్డులను పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలి ముద్రలను సేకరించారు. అనంతరం 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారి శారీరక కొలతలు తీసుకున్నారు. శారీరక కొలతల పరంగానూ అర్హులేనని ధ్రువీకరణ పొందిన వారికి ఇతర ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జేఎన్ఎస్లో 557 మంది హాజరు.. హన్మకొండ జేఎన్ఎస్లో కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలను ఉదయం 6 గంటలకు సీపీ సుధీర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 6 వరకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతాయన్నారు. కాగా, తొలిరోజున జేఎన్‌ఎస్‌కు 557 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక్కడ నిర్వహించిన 800 మీటర్ల పరుగు పందెంలో 70 మంది మహిళా అభ్యర్థినులు అర్హత సాధించడంతో వారికి ఈవెంట్స్ నిర్వహించారు. కేయూ మైదానంలో 850 మంది... వరంగల్ రూరల్ పోలీసు విభాగం పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీకి కాకతీయ యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన ఫిజికల్ టెస్ట్‌లను ఉదయం 6 గంటలకు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తొలిరోజు పరీక్షలకు 850 మంది హాజరయ్యారన్నారు.ఈ పరీక్ష కేంద్రాల్లో అదనపు డీసీపీ యాదయ్య, వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ , పరిపాలన అధికారి స్వరూపారాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్‌కుమార్, డీఎస్పీలు రాజమహేంద్రనాయక్, సత్యనారాయణరెడ్డి, సుధీంద్ర, రాంచందర్‌రావు పాల్గొన్నారు. ‘పాలిటెక్నిక్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది’ వరంగల్ : కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం జిల్లాలో నిర్వహిస్తున్న అర్హత పరీక్షల్లో పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ధర్మభిక్షం అనే అభ్యర్థి ఓ ప్రకటనలో ఆరోపించాడు. శుక్రవారం జరిగిన 800 మీటర్ల పరుగు పందేన్ని తాను 166 సెకన్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనలో ‘నీవు పాలిటెక్నిక్ విద్యార్థివి అయిందున అనర్హుడివి’ అంటూ పోలీసు అధికారులు తనను ఇతర పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నోటిఫికేషన్ 9వ పేజీలో ఎస్సీ, ఎస్టీలు, పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ లేదా తత్సమాన అర్హత ఉంటే చాలని పేర్కొన్నప్పటికీ తనకు అవకాశం రాకపోవడం అన్యాయమన్నాడు. పేద వర్గానికి చెందిన తనకు పోలీసు అధికారులు మిగిలిన పోటీలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. -
భారత అథ్లెట్లకు ‘పవర్’ కోత
చేజారిన ‘రియో’ బెర్త్‌లు న్యూఢిల్లీ: ఓ స్టేడియంలోని విద్యుత్ వెతలు భారత అథ్లెట్లకు తీరని వ్యథను మిగిల్చాయి. అథ్లెట్ల విజయాలు మొదలు... జాతీయ రికార్డులు, ఒలింపిక్ క్వాలిఫికేషన్ టైమింగ్‌లన్నీ పుటలకెక్కని రికార్డులుగానే మిగిలాయి. ఇదెక్కడో సాదాసీదా పట్టణంలోనో, నగరంలోనూ జరిగిందనుకునేరు! సాక్షాత్తు దేశ రాజధానిలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఇండియన్ గ్రాండ్‌ప్రికి వేదికైన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కరెంట్ లేని కారణంగా చేతిరాతతో రాసిన రికార్డులు, విజయాలు అసలు లెక్కలోకే రాకుండా పోయాయి. ఒలింపిక్ నిర్వాహకులు ఫొటో ప్రింట్ డిజిటల్ గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పెన్నులు, పెన్సిళ్లతో రాసిన మాన్యువల్ రికార్డులను ఏమాత్రం తీసుకోరు. దీంతో పలువురు అథ్లెట్లు సాధించిన విజయాలు, మీట్ రికార్డులన్నీ నీటిమూటలయ్యాయి. పురుషుల, మహిళల 100 మీ. స్ప్రింట్‌లో ఒడిశా అథ్లెట్లు అమియా కుమార్ (10.09 సె.), శర్బాని నంద (11.23 సె) సాధించిన ఘనతలు అంతర్జాతీయ గుర్తింపునకు నోచుకోలేకపోయాయి. రియో క్వాలిఫికేషన్ టైమింగ్ (10.16 సె. పురుషులకు, 11.32 సె. మహిళలకు)కు ఎంతో మెరుగైనప్పటికీ క్రీడాపాలకుల నిర్లక్ష్యంతో ఈ స్ప్రింటర్లు బలిపశువులయ్యారు. దీనిపై ఢిల్లీ అథ్లెటిక్ సంఘం... ‘సాయ్’పై ధ్వజమెత్తింది. షార్ట్ సర్క్యూట్ వల్లే విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, ఇవన్నీ సంబంధిత రాష్ట్రాలే చూసుకోవాలని ‘సాయ్’ చేతులు దులుపుకుంది. -
నేటి నుంచి ఐఎస్ఎల్ సెమీస్
తొలి అంచెలో ఢిల్లీ, గోవా పోరు న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో సెమీస్ అంకానికి తెర లేచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గోవా, నాలుగో స్థానంలో నిలిచిన ఢిల్లీల మధ్య జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య రెండో అంచె సెమీస్‌న 15న జరుగుతుంది. మరోవైపు చెన్నైయిన్, కోల్‌కతాల మధ్య తొలి అంచె సెమీస్ రేపు పుణేలో జరుగుతుంది. ఐఎస్ఎల్లో ఇప్పటివరకూ ఢిల్లీ జట్టు గోవాపై ఎప్పుడూ గెలవలేదు. లీగ్ దశలో గోవా అత్యధిక గోల్స్ (29) చేయగా ఢిల్లీ ప్రస్తుతం సెమీస్‌కు చేరిన జట్లలో అత్యల్ప (18) గోల్స్ సాధించింది. స్టార్ స్పోర్ట్స్-2లో రాత్రి 7 నుంచి ప్రత్యక్ష ప్రసారం -
మరో బెంచ్‌కు జులుం
కోర్టులో పిటిషన్‌తో సర్కారు అలర్ట్ నెహ్రూ స్టేడియానికి చేర్చండి స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు వినతి సాక్షి, చెన్నై : స్వచ్ఛంద సంస్థలు, సంఘాల మీద సాగిన జులుం వ్యవహారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ నేతృత్వంలోని బెంచ్‌కు మారింది. ఆయా సంఘాలు, సంస్థలకు సహకారం అందించే రీతిలో ప్రభుత్వం చర్యల్లో పడింది. సహాయకాలను నెహ్రూ ఇండోర్ స్టేడియానికి తరలించాలని, అధికారుల సమన్వయంతో పంపిణీ చేయాలని సూచించే పనిలో పడింది. చెన్నైలో వరద బాధితులకు సాయం అందిస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలపై ఒత్తిళ్లు , నిర్బంధం పర్వం సాగిన విషయం తెలిసిందే. అధికార పక్షం సేనల జులుం చివరకు హైకోర్టుకు చేరింది. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు భద్రత కల్పించాలని, ఎన్డీఆర్ఎఫ్ నేతృత్వంలో సహాయకాల పంపిణీ సాగే రీతిలో చర్యలు తీసుకోవాలని సింగిల్ బెంచ్ ముందు దాఖలైన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీవ్రంగానే పరిగణించారు. మానవతా హృదయంతో ముందుకు వస్తున్న వాళ్ల మీద సాగుతున్న దాడుల్ని పరిగణలోకి తీసుకున్న సంజయ్ కిషన్ కౌల్ పిటిషన్ విచారణను తన నేతృత్వంలోని తొలి బెంచ్ ద్వారా సాగించేందుకు నిర్ణయించినట్టు ఉన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ప్రభుత్వానికి తీవ్ర అక్షింతలు వేసి ఉన్న ఆయన, తాజా పిటిషన్ విచారణలో ప్రభుత్వం, అధికార వర్గాల మీద తీవ్రంగానే స్పందించే అవకాశాలు ఎక్కువే. ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం పిటిషన్ విచారణకు రాబోతోంది. ఈ సమయంలో పిటిషన్ సింగిల్ బెంచ్ నుంచి ప్రధాన బెంచ్‌కు మారడంతో అధికార వర్గాలు ఇరకాటంలో పడే అవకాశాలు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు బాసటగా నిలిచే విధంగా ఆగమేఘాలపై ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సహాయకాలను నేరుగా కాకుండా నెహ్రూ ఇండోర్ స్టేడియానికి తరలించాలని, అక్కడున్న అధికారులకు అప్పగించాలని సూచించారు. అప్పగించిన వస్తువుల వివరాలను అక్కడి అధికారుల వద్ద నమోదు చేయించాలని, అక్కడి నుంచి ఆయా వస్తువులు బాధితులకు కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుందని సూచించడం గమనార్హం. -
అట్టహాసంగా ఐఎస్ఎల్ ప్రారంభం
-
ఆధునికత...సంప్రదాయం...
అట్టహాసంగా ఐఎస్ఎల్ ప్రారంభం చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. సంప్రదాయం... ఆధునికత మేళవింపుతో రూపొందించిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం ఆరు గంటలకు జవహర్లాల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు హిందీ నటుడు అర్జున్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా... మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, యువ నటి ఆలియా భట్ తమ నృత్యాలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్, బాలీవుడ్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, అమితాబ్ బచ్చన్‌లతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని హోదాలో సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. 79 రోజుల పాటు ఇక ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే. ముందుగా కేరళ సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. అనంతరం ఆలియా భట్ హిందీ ఫాస్ట్ బీట్ పాటలకు వేసిన స్టెప్పులతో ప్రేక్షకులు హుషారెత్తారు. ఆలియా అనంతరం మాజీ మిస్‌వరల్డ్ ఐశ్వర్యా రాయ్ తనదైన శైలిలో అలరించింది. మెడ్లీలో భాగంగా ముందుగా తమిళ రోబో పాటతో ఆరంభించి ధూమ్.. మచాలే, ధోలా రే ధోలా అంటూ స్టేడియంలో ఒక్కసారిగా జోష్‌ను నింపింది. ఆ తర్వాత వేదికపైకి కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని సచిన్‌ను ఆహ్వానించడంతో స్టేడియంలో ఒక్కసారిగా సా..చిన్, సా..చిన్ అంటూ నినాదాలు మార్మోగాయి. నీతా అంబానీ, ఐశ్వర్య, ఆలియా కూడా వేదికపైకి ఎక్కారు.ఓపెన్ టాప్ జీపులో ఫుట్‌బాల్‌ను తీసుకువచ్చిన రజనీకాంత్ వేదికపై ఉన్న నీతాకు అందించారు. దీంతో టోర్నీ ఆరంభమైనట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. చివరిగా స్టేడియంలోకి చెన్నై, కోల్‌కతా జట్లు వచ్చిన అనంతరం ఏఆర్ రెహమాన్ జాతీయగీతాలాపన చేశాడు. -
దుమ్ము రేపిన గోవా
నార్త్ఈస్ట్ యునెటైడ్పై 3-0తో గెలుపు ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు అద్భుత రీతిలో చెలరేగుతోంది. సొంత మైదానంలో వరుసగా మూడో విజయాన్ని సాధించి తమ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సోమవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 3-0తో నెగ్గింది. ఈ విజయంతో 18 పాయింట్లతో కోల్‌కతాను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం నార్త్ఈస్ట్ 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 33వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్‌తో బోణీ చేసిన గోవా 45+1 నిమిషంలో మిరోస్లావ్ స్లెపికా రెండో గోల్‌తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో నార్త్ఈస్ట్ గోల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే 74వ నిమిషంలో గోవాకు ఆండ్రీ సాంటోస్ గోల్ అందించగా తిరుగులేని విజయం ఖాయమైంది. -
పచ్చందనాల అద్భుతం...
తేయాకు తోటలతో పచ్చని కొండప్రాంతాలు, అరేబియా సముద్ర అందాలు గల కేరళను చూసే అవకాశం ఇటీవల మా వారికి సెమినార్ రూపంలో రాగానే వదలాలనిపించలేదు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన మేము గంటన్నరలో ‘కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’లో దిగాం. చుట్టూ చూస్తే ‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అన్న పాట గుర్తుకొచ్చింది. మేం దిగుతున్నప్పుడే సన్నని తుంపర పడుతోంది. ఆ తుంపరలో తడుస్తూనే ఫొటోలు తీసుకున్నాం. అక్కడ నుంచి ఒక టాక్సీ తీసుకొని ఐఎమ్ఎ హౌజ్‌కు వెళ్లాం. మాకిచ్చిన రూమూ, మా వారి కాన్ఫరెన్సూ అక్కడే. అది జవహర్లాల్ నెహ్రూ స్టేడియమ్‌కు వెనకవైపే ఉంది. కొచ్చిన్ చాలా శతాబ్దాలుగా మసాలా దినుసుల వ్యాపారానికి ప్రధాన కేంద్రం. కేరళకూ, లక్షద్వీప్‌కూ సంబంధించిన హైకోర్టు కొచ్చిన్లోనే ఉంది. త్రివేండ్రం కేరళకు రాజధాని అయినప్పటికీ కొచ్చినే పెద్దది. కొచ్చి ఫోర్టు నుండి కొలంబో, లక్షద్వీప్‌లకు ఓడలో వెళ్లే సౌకర్యం ఉంది. బీచ్‌లో సూర్యాస్తమయం... సెమినార్ పూర్తయ్యాక పోర్టుకు బయల్దేరాం. దూరంగా పెద్ద పెద్ద ఓడలు, వరసగా చైనీస్ ఫిషింగ్ నెట్స్.. సూర్యాస్తమయ సమయంలో ఎంతో అందంగా కనువిందు చేశాయి. బీచ్‌లో మామిడికాయ ముక్కలు, ఊరబెట్టిన ఉసిరికాయలు రుచి చూశాం. ఇక్కడ నుంచి అతిపెద్దదైన ‘మెరైన్ డ్రైవ్’కు వెళ్లాం. ఇక్కడ బోటింగ్ సదుపాయమూ ఉంది. ఇక్కడ కేరళ సందర్శన గుర్తుగా ఒక పడవ బొమ్మను కొనుక్కొని ‘డచ్ హౌస్’కు వెళ్లాం. హోటళ్లకు, బడులకు తెలుగు పేర్లు... ‘డచ్‌హౌస్’ఒక మ్యూజియం. గోడలకు మ్యూరల్ పెయింట్స్ చాలా ఉన్నాయి. నాటి రాజులు వాడిన వస్తువులు, ఆయుధాలూ, చెక్కతో, ఏనుగుదంతంతో, రోజ్‌వుడ్‌తో.. చేసిన మేనాలూ ఉన్నాయి. అంత పెద్ద మేనాలు అప్పటి బోయీలు ఎలా మోసేవారో.. అనిపించింది. ఎక్కువగా రామవర్మ, కేరళవర్మ అనే రాజులవి, వాళ్ల దివానులవి, రాణులవి, పిల్లలవి చిత్రపటాలు ఉన్నాయి. వాటిని బట్టి అప్పట్లో వాళ్లు వస్త్రధారణతో రాచరికం వలె దర్ఫంతో కాక సాధారణ ప్రజానీకంలాగా ఉన్నారని అర్థమైంది. స్త్రీలూ, పురుషులు అందరూ తెల్లని వస్త్రాలనే ధరించేవారని తెలిసింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించినప్పుడు రామవర్మ అనే రాజు వారి దేశ జెండాతో సహా భారతదేశ జెండాను ఎగరవేస్తూ ఉన్న చిత్రపటం ఉంది. భారత స్వాతంత్య్ర సమయంలో ఇండియన్ యూనియన్‌లో కలవడానికి కొచ్చిన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఇక చైత్రం ఫుడ్స్, శ్రావణ నిలయం.. అంటూ మన తెలుగు నెలల పేర్లు షాపులకు కనిపించాయి. ‘ఎలా ఉన్నారు?’ అని అడగడానికి ‘సుగమాణ’ అనాలని నేర్చుకున్నాం. దక్షిణ ద్వారక గురువాయూర్... ‘దక్షిణ భారత ద్వారక’గా పేరుగాంచిన ‘గురువాయూర్’కు వెళ్లేదారిలో ‘జూబిలీ మిషన్ మెడికల్ కాలేజీ’, ‘ఎలిఫెంట్ క్యాంప్’ చూశాం. ఇక్కడ దాదాపు అరవై డెబ్బై ఏనుగుల దాకా ఉన్నాయి. ఇవి దేవస్థానానికి సంబంధించిన ఏనుగులట. వీటన్నింటినీ ఒకే చోట చూడటం అబ్బురమనిపించింది. అక్కడే మావటి వాళ్లు వాటికి సపర్యలు చేస్తూ కనిపించారు. వాళ్లు చెప్పినట్టు ఏనుగులన్నీ బుద్దిగా నడుచుకోవడం భలే అనిపించింది. గురువాయూర్ ఆలయ ప్రవేశం చేయాలంటే పురుషులు ధోవతి, కండువా మాత్రమే ధరించాలి. స్త్రీలు చీరలు లేదా పంజాబీ డ్రెస్సులు ధరించాలి. గర్భగుడిలో కృష్ణుడి రూపం మనోహరం. ఇవన్నీ చూస్తూ కొచ్చి కొచ్చాక ‘లులూ’ అనే షాపింగ్ మాల్‌కు వెళ్లాం. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. సామాన్లు తీసుకెళ్లే ట్రాలీలు కార్ల ఆకారంలో ఉన్నాయి. కార్లలో పిల్లలు కూర్చుని స్టీరింగ్ తిప్పుతూ ఆడుకుంటుంటే, కార్లపైన సామాన్లు పెట్టుకుంటూ తీసుకెళుతున్నారు తల్లితండ్రులు. అందాల నగరిలో పచ్చందనాల అద్భుతాలు చూసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం. - కందేపి రాణీ ప్రసాద్, హైదరాబాద్ -
ఐఎస్ఎల్: ఢిల్లీపై గోవా విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు సత్తా చూపించింది. గురువారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభమైన 18వ నిమిషంలోనే బెంజెలోన్ గోల్‌తో గోవా ఖాతా తెరిచింది. ఆ తర్వాత 48వ నిమిషంలో బెంజెలోన్ రెండో గోల్ సాధించాడు. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీని సీనియర్ మిడ్‌ఫీల్డర్ రాబర్ట్ పైర్స్ గోల్‌గా మలిచి జట్టుకు 3-0 ఆధిక్యాన్ని అందించాడు. 60వ నిమిషంలో ఒజ్బే గోల్‌తో గోవా తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అయితే 73వ నిమిషంలో ఢిల్లీకి పెనాల్టీ కిక్ రూపంలో సాంటోస్ ఓ గోల్ అందించాడు. -
ఐఎస్ఎల్: రెండు మ్యాచ్‌లూ ‘డ్రా’లే
మార్గో: ఇండియన్ సూపర్ లీగ్‌లో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గానే ముగిసాయి. ముంబయి-గోవా, కేరళ-ఢిల్లీల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజయాలతో ఊపుమీదున్న ముంబయి సిటీ ఎఫ్‌సీ జట్టుకు... ఎఫ్‌సీ గోవా జట్టు ఈ మ్యాచ్‌లో బ్రేకులు వేసింది. గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్స్ చేసే అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. టోర్నీ ఆరంభం నుంచి సత్తా చాటలేకపోతున్న కేరళ బ్లాస్టర్స్, ఢిల్లీ డైనమోస్ మధ్య కొచ్చిలో జరిగిన మ్యాచ్ కూడా నిరాశజనకంగానే ముగిసింది. గోల్స్ సాధించడంలో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఐఎస్ఎల్లో సోమవారం మ్యాచ్‌లు లేవు. -
30 ఏళ్ల క్రితం ఇక్కడే ఆడా
కోలాహలంగా స్టేడియం రాష్ట్రంలో తొలిసారి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తుండడంతో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం క్రీడాకారులతో కోలాహలంగా మారిపోయింది. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలకు పది జిల్లాల నుంచి దాదాపు 700మంది క్రీడాకారులు, మరో 300మంది టెక్నికల్, కోచ్‌లు హాజరయ్యారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. క్రీడాకారులు శుక్రవారం రాత్రే స్టేడియంకు చేరుకోవడంతో సందడి నెలకొంది. హన్మకొండ చౌరస్తా : 30ఏళ్ల క్రితం ఇదే గ్రౌండ్లో ఆటలాడిన.. మళ్లీ ఇప్పుడు అధికార హోదాలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది.. అంటూ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, రిటైర్డ్ ఐఏఎస్ బీవీ పాపారావు తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన పాపారావు పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. తాను చదువుకున్న రోజుల్లో క్రీడాకారులకు ఎటువంటి సదుపాయాలు లేకున్నా జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులున్నారన్నారు. తాను ఐఏఎస్ అయ్యాక అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుతో కలిసి ప్రత్యేక విమానంలో హన్మకొండ వచ్చి స్టేడియం కోసం స్థలాన్ని పరిశీలించామని, ఆయన చలువతోనే ఈ స్టేడియం ఏర్పడిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, త్వరలోనే జేఎన్ఎస్లో అథ్లెటిక్స్ కోసం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, డీఎస్డీఓ సారయ్య, ప్రొఫెసర్ పాండురంగారావు, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు. అండర్ 14 (బాలురు) : 600 మీటర్ల రన్నింగ్ డి.శ్రీకాంత్ (నల్గొండ), నిఖిల్‌కుమార్ (హైదరాబాద్), గణేష్ (వరంగల్) అండర్ 14(బాలురు) : హైజంప్ ఆర్.ముని (నల్గొండ), జి.కన్నారావు (ఖమ్మం), ఇంద్రసేన (వరంగల్) అండర్ -14(బాలురు) : షాట్‌పుట్ సత్యవన్(హైదరాబాద్), అవినాష్కుమార్సింగ్(రంగారెడ్డి), సురేష్(కరీంనగర్) అండర్-16(బాలురు) : డిస్కస్ త్రో సాహిల్ (హైదరాబాద్), ఎం.రవి (కరీంనగర్), రాహుల్ (వరంగల్)అండర్-16 (బాలురు) : లాంగ్‌జంప్ రమేష్ (వరంగల్), రజనీకుమార్ (వరంగల్), అజీబాబా (కరీంనగర్) అండర్-18 (బాలురు) : డిస్కస్ త్రో కిరణ్‌కుమార్ (ఖమ్మం), సాయికుమార్ (నిజామాబాద్), వెంకటేష్ (వరంగల్) అండర్-20 (బాలుర) : 800 మీ. రన్నింగ్ చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్), రాము (హైదరాబాద్), లోకేష్‌కుమార్ (రంగారెడ్డి) అండర్-14 ( బాలికలు) : లాంగ్‌జంప్ దివ్యపావని (ఖమ్మం), లిఖిత (మహబూబ్‌నగర్), శైలజ (ఆదిలాబాద్) అండర్-14 (బాలికలు) : షాట్‌పుట్ బి.సరిత (వరంగల్), శిరీష (నల్గొండ), సునీత (మహబూబ్‌నగర్) అండర్-16 (బాలికలు) : 200 మీటర్ల రన్నింగ్ నిత్య (హైదరాబాద్), భానుచంద్రిక (ఖమ్మం), మౌనిక (వరంగల్) అండర్-18 (బాలికలు) : 500 మీటర్ల వాకింగ్ హర్షశ్రీ (రంగారెడ్డి), వాసవి (కరీంనగర్), భవానీ (కరీంనగర్) అండర్-18(బాలికలు) : జావెలిన్ త్రో ఆర్.రాధిక (నిజామాబాద్), వి.కవిత (ఆదిలాబాద్) అండర్-18 (బాలికలు) : లాంగ్ జంప్ ఎస్.సుజాత (ఆదిలాబాద్), సీహెచ్.సమ్మక్క (ఖమ్మం), ఎన్.రోజా (నల్గొండ) అండర్-20(బాలికలు) : 200 మీటర్ల రన్నింగ్ లేఖ(వరంగల్), హారికాదేవి(హైదరాబాద్), అశ్విని (వరంగల్) అండర్-20(బాలికలు) : డిస్కస్ త్రో ఎం.అలివేలు (మహబూబ్‌నగర్), ఆష్మ (రంగారెడ్డి) అండర్-20 (బాలికలు) : లాంగ్ జంప్ సవంతి (నిజామాబాద్), శాంతికుమారి (మహబూబ్‌నగర్), శోభ (నల్గొండ) -
ఢిల్లీ గురించి అంతగా తెలియదు: మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ భౌగోళిక స్థితిగతుల గురించిగానీ, నగరంలోని వీధుల గురించిగానీ తనకు సరైన అవగాహన లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన బీజేపీ జాతీయ మండలి తొలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పైవిధంగా పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఆయన ఏమిచేస్తారని ప్రజలు అనుకుంటుంటారు. అప్పుడప్పుడూ నేను కూడా అలాగే అనుకుంటాను’ అని అన్నారు. -
జేఎల్ఎన్ స్టేడియం వద్ద నేడు ట్రాఫిక్ ఆంక్షలు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నం దున నగరవాసులు దక్షిణ ఢిల్లీలోని లోధీరోడ్, బీషమ్ పితామహ మార్గ్, లాలా లజ్‌పత్ రాయ్ మార్గ్‌లకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీ సులు శుక్రవారం సూచించారు. జేఎల్ఎన్ స్టేడియంలో శనివారం డేరా సచ్చా సౌదా అనే సంస్థ ఉద యం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనుంది. సుమారు 20 వేల మంది వాలంటీర్లు రక్తదానం చేసేం దుకు ఇక్కడకు వస్తారని భావిస్తున్నారు. వీరంతా ప్రైవేటు బస్సులు, కార్లు, మెట్రో రైళ్లు, ఇతర షటిల్ సర్వీసులలో ప్రగతి మైదాన్ నుంచి లోధీరోడ్డుకు చేరుకుంటారని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. విధానపరంగా లోధీరోడ్డు, భీషమ్‌పితామహ మార్గ్‌పై పార్కింగ్‌ను అనుమతించరు. ఇక ఆదివారం నాడు అదే సంస్థ సాయంత్రం 4.00 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ‘మాస్ట్రో మస్త్ రుహానీ నైట్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి 30వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు బస్సులు, కార్లను సునేరీ పుల్లా, బారాపుల్లా క్లస్టర్ బస్ డిపోల్లో పార్కింగ్ చేయాలి. ప్రత్యేక స్టిక్కర్లు అతికించిన కార్లను జేఎల్ఎన్ స్టేడియంలోని రెండో నెంబర్ పార్కింగ్ లాట్లో నిలపాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇతర ప్రయాణికులు ఈ రెండు రోజులు లోధీరోడ్డు, భీషమ్‌పితామహ మార్గ్, లాలా లజ్‌పత్‌రాయ్ మార్గ్‌లలో కాకుండా ఇతర మార్గాలలో ప్రయాణించేందుకు ప్రయత్నించాలని సూచించారు.