బాబుకు ఆస్తమా... తగ్గుతుందా? | Babu ... slump in asthma? | Sakshi
Sakshi News home page

బాబుకు ఆస్తమా... తగ్గుతుందా?

Published Thu, Jun 23 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

Babu ... slump in asthma?

హోమియో కౌన్సెలింగ్

 

మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది. ఎప్పుడు హాస్పిటల్‌లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా? - నాగరాజు, గుంటూరు
ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది.

 
కారణాలు:  దుమ్ము, ధూళి, కాలుష్యం  వాతావరణ పరిస్థితులు, చల్లగాలి  వైరస్‌లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్  పొగాకు  పెంపుడు జంతువులు  సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు  పుప్పొడి రేణువులు  వంశపారంపర్యం మొదలైనవి.


లక్షణాలు:  ఆయాసం  దగ్గు రాత్రిపూట రావడం  గాలి తీసుకోవడం కష్టం కావడం;  పిల్లికూతలు  ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం.

 
వ్యాధి నిర్ధారణ : ఎల్‌ఎఫ్‌టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు.

 
చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు.

 

డాక్టర్ మురళి  కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్

 

చెయ్యి వణుకు... తగ్గడం ఎలా?
న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. ఏదైనా పనిచేసేటప్పుడు నా కుడి చెయ్యి వణుకుతూ ఉంది. ఈ మధ్య మాట కూడా వణుకుతోంది. నా సమస్యకు పరిష్కారం ఉందా? - రామచంద్రరావు, నిడదవోలు
మీరు ఎసెన్షియల్ ట్రెమర్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఏదైనా పనిచేస్తున్నప్పుడు... అంటే... కాఫీ తాగేటప్పుడు, పెన్నుతో రాసేటప్పుడు.. ఇలా ఏదైనా పనిచేస్తున్నప్పుడు చేయి వణుకుతూ ఉంటుంది. టెన్షన్ ఎక్కువైనా, పని ఒత్తిడి పెరిగినా ఇలా వణకడం పెరగవచ్చు. వణుకు కొద్దిమాత్రంలో ఉంటే మందులు వాడాల్సిన పని లేదు. అయితే ఎక్కువగా వణకుతుండేవారిలో ప్రొపనలాల్, ప్రిమిడోన్ అనే మందులు వాడటం ద్వారా ఆ సమస్యను తగ్గించవచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను కలిసి, తగిన మందులు తీసుకోండి. మీ సమస్య తీవ్రత తగ్గుతుంది.

 

నా భర్త వయసు 56 ఏళ్లు. మద్యం అలవాటు ఉంది. ప్రతిరోజూ తాగుతారు. ఒక్కోసారి ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడు. మద్యం తాగకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. మద్యం తాగకపోతే వణుకు వస్తుంటుంది. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి.  - సులోచన, వరంగల్
మద్యం తాగేవారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ఇంటాక్సికేషన్‌తో ఫిట్స్ రావచ్చు. చీప్‌లిక్కర్‌కు అలవాటు పడిన వారిలో కొంతమందికి ఒక్కసారిగా మానేయడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. మద్యం ఆపేసిన కొద్దిమందిలో రెండురోజులు పొంతనలేకుండా మాట్లాడటం, ఉమ్మివేయడం వంటివి చేస్తుంటారు. దీన్ని డెలీరియమ్ ట్రెమర్స్ అంటారు. దీన్ని మందులతో తగ్గించవచ్చు. అయితే మద్యం జోలికి పోకుండా క్రమం తప్పకుండా  టాబ్లెట్స్ తీసుకునేలా చూడాలి. కొంతమందిలో మందులతో ఈ అలవాటును మాన్పించలేకపోతే ‘డీ-అడిక్షన్’ సెంటర్‌లో ఉంచి చికిత్స అందించాలి. మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌నూ, సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స అందేలా చూడండి.

 

డాక్టర్ మురళీధర్ రెడ్డి  కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement