చిన్నప్పుడు సెలవులొస్తే అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో మనకు వేసవి విడిది. అయితే ఈ చిన్నారి ఉన్న చోటనే ఉండి, రోజూ చల్లటి కథల పుస్తకాలను పిల్లలకు పంచిపెడుతూ చుట్టుపక్కల తండాలన్నిటినీ వేసవి విడిదులుగా మార్చేస్తోంది!
‘‘అమ్మా... జూదం చెడ్డ ఆట కదా?’’.. జుట్టు దువ్వుతున్న తల్లిని అడిగింది తొమ్మిదేళ్ల కోమల్ పవార్.‘అవును’’ పోనీ టెయిల్‌కు రబ్బర్ బ్యాండ్ పెడుతూ అంది తల్లి. ‘ధర్మరాజు ఆ ఆట ఆడాడు కాబట్టే కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది కదా..’’ మళ్లీ కోమల్ ప్రశ్న. ‘‘ఊ’’ అంటూ కూతురిని తన వైపుకి తిప్పుకుంటూ ఆ అమ్మాయి చుబుకం పట్టుకొని నుదిటి మీద ముద్దుపెట్టుకుంది తల్లి. ‘అందుకే కౌరవులు ఎంత చెడ్డవాళ్లో జూదమాడిన ధర్మరాజూ అంతే చెడ్డవాడమ్మా..’’ నేల మీదున్న పుస్తకాల బ్యాగ్‌ను ఆయాసంతో భుజానికి తగిలించుకుంటూ అంది కోమల్!బిడ్డ ఆలోచనకు సంబరపడిపోతూనే ‘‘అంత బరువు మోయకపోతేనేం.. కొన్ని కొన్ని తీసుకెళ్లొచ్చు కదా’’ అంది తల్లి.‘‘ఇవన్నీ బస్తీ పిల్లల ఫర్మాయిష్ పుస్తకాలమ్మా! తీసుకెళ్లాలి. లేకపోతే బాధపడ్తారు పాపం.. అయినా సాయి వస్తాడు కదా.. వాడికీ ఇస్తాను కొన్నిమోయమని’’ జవాబు చెప్తూనే గడపదాటింది కోమల్. ‘జాగ్రత్త ఎండలో..’’ హెచ్చరించింది అమ్మ.
బడికే ఇన్‌స్పిరేషన్!
మహారాష్ట్రలోని సతారా జిల్లా హెకల్‌వాడీలో కోమల్ దినచర్య ఇది. నాలుగో తరగతి చదువుతోంది ఆ అమ్మాయి. పాఠ్యపుస్తకాలంటే ఇష్టం. కథల పుస్తకాలంటే ప్రాణం. కథలు చదవడం.. ఇదిగో ఇలా తన సందేహాలను అమ్మతో పంచుకోవడం..! తను చదివే హెకల్‌వాడీ జిల్లా పరిషత్ స్కూల్లో చిన్న లైబ్రరీ ఉంది. అందులోని పుస్తకాలను చదవడమే కాకుండా.. యేడాది కిందటి ఎండాకాలంలో తనకు నచ్చిన కథలను చేత్తో రాసి రెండు మూడు పుస్తకాల ప్రతులను తయారు చేసింది. వాటిని ఆ సెలవుల్లో తన ఊరు చుట్టూ ఉన్న తండాల్లో కథలంటే ఇష్టం ఉన్న పిల్లలకు పంచింది. స్కూళ్లు తెరిచాక ఈ విషయం టీచర్లకు తెలిసి కోమల్‌ను ప్రశంసించారు. వారే ఈ ఎండాకాలం ఓ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో కూడా స్కూల్ లైబ్రరీని తెరిచే ఉంచాలని!
ఎండల్లో తండాలకు
హెకల్‌వాడీ చుట్టూ నాలుగు తండాలున్నాయి. ఉదయం పూట పుస్తకాలను తండాలకు పంచి తిరిగి సాయంకాలం వాటిని స్కూల్ లైబ్రరీకి చేర్చాలి. కొన్నాళ్లు ఈ బాధ్యతను ఆ స్కూల్ లైబ్రేరియన్ తీసుకున్నారు. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొనసాగించలేకపోయారు. అప్పుడు ఇదిగో ఈ చిట్టి కోమలే ముందుకు వచ్చింది. పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి కథల పుస్తకాలను సంచీలో సర్దుకొని ఇంటికెళ్లి రెడీ అయి మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తండాలకు బయలుదేరుతుంది. తన ఈడు పిల్లలకు కథల పుస్తకాలు పంచడం, వాళ్లు ఆ పుస్తకాలను చదివేలా చూడ్డం అంటే ఆ పిల్లకు పండుగే. ఈ అమ్మాయి ఉత్సాహం, ఆమె జిల్లా పరిషత్ స్కూల్ ఇస్తున్న ప్రోత్సాహం గురించి తెలిసీ టాటా ట్రస్ట్ వాళ్లు ఈ పిల్లలకు బోలెడు పుస్తకాలను తెచ్చిచ్చారు. అలాగే చిన్న లైబ్రరీని కాస్తా పెద్దగా మార్చారు ఈ యేడు.
ఛోటీ గ్రంథపాల్
కోమల్‌ను చూసి ఇప్పుడు వాళ్లింటి చుట్టుపక్కల ఉన్న పిల్లలూ ఆమె సాయంగా తండాలు తిరుగుతున్నారు పుస్తకాలు పట్టుకొని. పొలాల్లో, అంగన్‌వాడీల్లో, చెరువు గట్ల మీద, వాకిళ్లలో, ఇలా పిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ పుస్తకాలు ఇస్తూ, వాళ్లు అవి చదివేలా చేస్తోంది కోమల్ అండ్ టీమ్. పైగా కిందటి రోజు చదివిన కథల గురించి తెల్లవారి చిన్న సైజు గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయట. ‘‘నాకు రామాయణ, మహాభారతం నుంచి నీతికథలు.. అన్ని.. అన్నీ ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా వాటన్నిటినీ చదవాలి. కథలు చదివితే ఇంకో ప్రపంచంలోకి వెళ్తా..’’ అంటుంది ఈ ఛోటీ గ్రంథపాల్. అన్నట్టు కోమల్‌కు తండాలవాళ్లు ఇచ్చిన పేరు అది. బుజ్జి లైబ్రేరియన్ అని!
– శరాది
Comments
Please login to add a commentAdd a comment