నడుమంత్రపు నొప్పి! | Back Pain Is More Common In Middle Aged People | Sakshi
Sakshi News home page

నడుమంత్రపు నొప్పి!

Published Thu, Oct 24 2019 2:17 AM | Last Updated on Thu, Oct 24 2019 2:17 AM

Back Pain Is More Common In Middle Aged People - Sakshi

తమ జీవితకాలంలో నడుమునొప్పి రానివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 35 ఏళ్లు పైబడితే ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సాధారణంగా నడుమునొప్పి అరుదుగా తప్ప అది పెద్దగా  ప్రమాదకరం కాదు. దాదాపు అందరూ ఎదుర్కొనే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.

నడుమునొప్పికి కారణాలు
నడుమునొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు... కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్క్‌లు, ఎముకలు... ఇలా ఎక్కడ సమస్య ఉన్నా నడుము నొప్పి రూపంలో బయటపడుతుంది. సాధారణంగా నడుమునొప్పికి ఎక్కువగా కారణమయ్యే అంశాలివి...
►నడుము కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై, స్ప్రెయిన్‌ కావడం
►లిగమెంట్లు దెబ్బతినడం
►నడుము పరిసరాల్లో ఉండే కండరాలు పట్టేయడం.
►పై కండిషన్లకు కారణమయ్యే అంశాలు...
►ఏదైనా బరువును సక్రమంగా ఎత్తకపోవడం
►ఎక్కువ బరువును అకస్మాత్తుగా ఎత్తడం
►సరైన పోష్చర్‌లో కాకుండా అడ్డదిడ్డంగా కదలడం లేదా నడవడం
►అకస్మాత్తుగా జరిగే ఒంటి కదలికలు...  ఇలాంటి సంఘటనలతో ఈ కింద పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి నడుమునొప్పి కారణమవుతాయి.
►ప్రతి రెండు వెన్నుపూసల మధ్య  కుషన్‌లాంటి ఒక డిస్క్‌ ఉంటుంది. ఏవైనా కారణాల వల్ల డిస్క్‌ దెబ్బతినడంతో అక్కడి నరం మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పి రావచ్చు
►వెన్నుపూసకు ఇరుపక్కలా ఉండే డిస్క్‌లో వాపు రావడం వల్ల నడుము నొప్పి వస్తుంది.

►సయాటికా: మనదేహంలో అన్నిటి కంటే పెద్ద నరం నడుము దగ్గర మొదలై అది కాలివరకు వెళ్తుంది. ఆ నరాన్ని ‘సయాటిక్‌’ నరం అంటారు. ఏవైనా కారణాల వల్ల ఆ నరం నొక్కుకుపోతే... నడుము దగ్గర నొప్పి మొదలై అది కాళ్ల వరకు పాకుతుంది. దీన్నే ‘సయాటికా నొప్పి’ అంటారు.

►కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ స్పాండిలోసిస్‌లో రెండు వెన్నుపూసల మధ్య ఉండాల్సిన గ్యాప్‌ తగ్గి, ఆ రెంటిమధ్యన నరం ఇరుక్కుపోవడంతో నడుమునొప్పి వస్తుంది.
►కొందరిలో వెన్ను అసహజంగా ఉంటుంది. ఈ కండిషన్‌ను ‘ఫ్లాట్‌ బ్యాక్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ అసహజ భంగిమ వల్ల కొందరిలో నొప్పి రావచ్చు. ఇది ఎక్కువగా తప్పుడు భంగిమల్లో కూర్చున్నవారిలో వస్తుంటుంది.
►మరి పొట్ట ఎక్కువగా ఉన్నా నడుమునొప్పి రావచ్చు.
►కొందరిలో ఎముకలు పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోయే ‘ఆస్టియోపోరోసిస్‌’ కండిషన్‌ ఏర్పడి వెన్ను కూడా విరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా నడుము లేదా వెన్ను నొప్పికి ఒక కారణం.

నడుం నొప్పి ముప్పును పెంచే అంశాలు (రిస్క్‌ ఫ్యాక్టర్స్‌) :
►వృత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉండటం
►మహిళల్లో గర్భధారణ ∙అదేపనిగా కూర్చొని పనిచేయడం 
► పెరిగే వయసు
►ఊబకాయం
►పొగతాగడం
►చాలా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం లేదా సరిగా చేయకపోవడం
►చాలా ఎక్కువగా చేసే శారీరక శ్రమ

నిర్ధారణ: నడుమునొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల ఆ నడుమునొప్పి వస్తుందో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరం. ఇందుకోసం ఎక్స్‌రే, అవసరాన్ని బట్టి సీటీస్కాన్‌ లేదా ఎమ్మారై, బోన్‌స్కాన్, ఎలక్ట్రోమయోగ్రఫీ వంటి పరీక్షలు చేయించడం అవసరమవుతుంది.

చికిత్స: ముందుగా కారణం తెలుసుకోవాలి. దాన్నిబట్టి నొప్పిని దూరం చేయడానికి ఫిజియోథెరపిస్ట్‌ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్‌ ఫెరెన్షియల్‌ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలు కూడా నడుమునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ట్రాన్స్‌క్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నర్వ్‌ స్టిమ్యులేషన్‌ అనే మాటలకు సంక్షిప్త రూపమైన ‘టెన్స్‌’ చికిత్స కూడా నడుమునొప్పికి పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోడ్‌ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్‌ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా  ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛ రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండెలో పేస్‌మేకర్‌ అమర్చిన వాళ్లకు టెన్స్‌ చికిత్స సరికాదు. ఇలాంటి చికిత్సలు వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి.
►ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు  ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్‌ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని పూర్తిగా చక్కబరుస్తారు.

తక్షణ నొప్పి నివారణ కోసం: నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం పెయిన్‌ కిల్లర్స్‌ అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. వీటిని రెండు వారాలకు మించి తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్‌ మెడిసిన్స్‌) వాడటం మరింత మంచిది.
►ఒకవేళ నడుమునొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మరికొన్ని అసాధారణ కారణాలు
కాడా ఈక్వినా సిండ్రోమ్‌: ప్రతి రెండు వెన్నుపూసల మధ్య నుంచి కొన్ని నరాలు బయటకు వచ్చినట్లుగానే... నడుము కింది వెన్నుపూస నుంచి నరాలన్నీ బయటికి వచ్చి నడుము కింది ప్రాంతమంతా విస్తరిస్తాయి. కొన్నిసార్లు వెన్నుపూస చివరి భాగం నుంచి వచ్చిన నరాలనుంచి ఒక సన్నటి నొప్పి (డల్‌ పెయిన్‌) బయల్దేరి... పిరుదులు, జననాంగాలు, తొడల భాగమంతా ఆ నొప్పి విస్తరిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పిరుదుల కింది భాగమంతా అసలు లేనేలేదేమో అన్న ఫీలింగ్‌ ఉంటుంది. దాంతో కొందరిలో అది మల, మూత్ర విసర్జన కలగబోయేముందు వచ్చే ఫీలింగ్‌ కూడా లేనట్లుగా ఉంటుంది. ఈ కండిషన్‌ను కాడా ‘ఈక్వినా సిండ్రోమ్‌’ అంటారు. 

వెన్నెముక క్యాన్సర్‌ : ఇది అరుదైన కండిషన్‌. ఇలాంటి సమయాల్లో వెన్ను కింది భాగంలో ఎక్కడైనా క్యాన్సర్‌ గడ్డ ఏర్పడి అది అక్కడి నరాలను నొక్కేయడం వల్ల నడుము నొప్పి రావచ్చు.

వెన్నెముక ఇన్ఫెక్షన్‌ : ఏదైనా వెన్నుపూసలో వాపు రావడం వల్ల అక్కడి మృదువైన భాగాల మీద ప్రభావం పడి నడుమునొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో జ్వరం కూడా ఉంటుంది.

ఇన్ఫెక్షన్లు: మహిళల్లో వచ్చే ‘పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌’ వంటి ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ బ్లాడర్‌ సమస్యలు, కిడ్నీ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు.
►నరాలకు వచ్చే ‘షింగిల్స్‌’ అనే సమస్య ఉన్నప్పుడు కూడా అది ఒకవేళ నడుము భాగంలోని నరాలు దెబ్బతింటే నడుమునొప్పి రావచ్చు.

పక్క సరిగా లేకపోయినా : కొన్ని సందర్భాల్లో పక్క సరిగా కుదరక... అది ఉండాల్సిన తీరులో లేనందువల్ల కూడా నడుము నొప్పి రావచ్చు.

కూర్చోవడంలో తప్పుడు భంగిమలు: కూర్చొని పనిచేసేవారిలో దాదాపు 80 శాతానికి  పైగా సరైన భంగిమలో ఎలా కూర్చోవాలో తెలియదు. దాంతో నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాంతోపాటు నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని  అంశాలివి...

►అసహజ భంగిమల్లో అకస్మాత్తుగా వంగడం లేదా పక్కకు తిరగడం
►నొక్కడం
►లాగడం
►ఎత్తడం
►చాలాసేపు నిలబడటం
►ముందుకు ఒంగడం
►ఒక్కపెట్టున తుమ్మడం
►దగ్గడం
►అతిగా ఒంగడం
►కంప్యూటర్‌ను చూస్తూ మెడను అసహజ భంగిమలో చాలాసేపు వంచి ఉంచడం
►చాలా సేపు  డ్రైవ్‌ చేయడం
డా. సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement