నా వయసు 42 ఏళ్లు. నేను క్రికెట్ ఎక్కువగా ఆడతాను. ఇటీవల కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. ఎన్ని మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?
మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటాము. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్‌కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు.
శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
కారణాలు:వయసు పెరగడం, గాయం కావడం. ∙వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిగ ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి.
క్రీడల వల్ల...
పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది ∙కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది.
లక్షణాలు:∙టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం ∙ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం ∙కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం ∙ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
∙కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్‌లో సర్దుబాటు చేసుకోవడం పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
చికిత్స: జెనెటిక్ కాన్స్‌టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించండం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
ఉబ్బిన రక్తనాళాలు, చికిత్స చెప్పండి
నా వయసు 46 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా?
మీకు ఉన్న సమస్యను వేరికోస్ వెయిన్స్ అంటారు. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఈ వేరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యలో రక్తనాళాల రంగు మారడం లేదా నలుపు రంగుకి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు.
ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు:ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు:కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం.
వ్యాధి నిర్ధారణ:అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్.
చికిత్స:వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
ఒళ్లంతా తెల్లమచ్చలు పెరుగుతున్నాయి... తగ్గేదెలా?
నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి.
శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది.
►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు.
►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు.
►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు.
దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు.
►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది.
►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది.
లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు.
చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment