ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి)కు సరికొత్త చికిత్స లభించనుంది. అంతా కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. ఎలుకల మెదళ్లలో కొన్ని న్యూరాన్లను తొలగించినప్పుడు అవి విపరీతంగా బరువు పెరగడాన్ని గుర్తించిన డాక్టర్ కొరేరా ఆ దిశగా మరిన్ని పరిశోధనలు చేపట్టారు. పెరిగిన బరువు కండరాలు, కొవ్వుల్లో కాకుండా ఎముకల్లో మాత్రమే ఉండటం.. ఖనిజ సాంద్రత కూడా ఎక్కువ కావడం గుర్తించిన కొరేరా ఈ పద్ధతిని బోలు ఎముకల వ్యాధి చికిత్సకు వాడవచ్చునని గుర్తించారు.
మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తరువాత ఎముకలు బోలుగా మారిపోవడం ఎక్కువన్నది తెలిసిందే. సాధారణ ఎలుకలతో పోలిస్తే ఈస్ట్రోజెన్ రిసెప్టర్ ప్రొటీన్లు తొలగించిన వాటిల్లో ఎముకల ద్రవ్యరాశి దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండటం తాము గమనించామని... మెదడులోని హైపోథాలమస్‌లో ఇలాంటి ప్రొటీన్లు కొన్ని వందల రకాలు ఉన్నట్లు తెలుసుకున్నామని కొరేరా వివరించారు. ముదిమి వయసులో ఈ న్యూరాన్లు ఎముకల పెరుగుదలకు తక్కువ శక్తిని కేటాయించేలా సంకేతాలు పంపడం వల్ల ఎముకలు గుల్లబారుతున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ న్యూరాన్లను ఎలా నియంత్రించాలన్న అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని.. అది తెలిస్తే వయసు మళ్లిన తరువాత కూడా ఎముకలు దృఢంగా ఉండేలా చేయడం సాధ్యమవుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment