హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. ఉద్యోగరీత్యా రాత్రిపూట పనిచేస్తుంటాను. దీనివల్ల సమయానికి భోజనం చేయలేకపోతున్నాను. ఎండోస్కోపీ చేయిస్తే గ్యాస్‌ట్రైటిస్ అన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా?
- అనిల్‌కుమార్, మిర్యాలగూడ
ఆధునిక జీవనశైలిలో మార్పుల 40 శాతం మంది గ్యాస్ట్రిక్ వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. జీర్ణకోశంలో నోటి నుంచి మలమార్గం వరకు ఒక ట్యూబ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ ఆహారమార్గంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని గ్యాస్‌ట్రైటిస్ అంటుంటారు.
కారణాలు: మానసిక ఒత్తిడి, పొగతాగడం, మద్యం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, భోజన వేళలు సరిగా పాటించకపోవడం, రాత్రివేళలలో ఎక్కువసేపు మేల్కొని ఉండటం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, రక్తంగడ్డకట్టడంలో లోపాలు, నొప్పి నివారణమాత్రలు, యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
లక్షణాలు: కడుపులో నొప్పి, మంట, కడుపులో ఉబ్బరం, ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, మలబద్దకం, కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు కావడం, బరువు తగ్గడం, ఉదయంపూట వాంతి వచ్చినట్లు ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది గ్యాస్ట్రిక్ అల్సర్‌కు దారితీయవచ్చు. మలంలో రక్తంపడటం కూడా జరగవచ్చు. నాభి పైభాగంలో నొప్పి ఈ సమస్యలో కనిపించే ప్రధానమైన లక్షణం. జీర్ణకోశం లోపల ఉండే సున్నితమైన మ్యూకోజల్ పొరలో వాపు, కమిలిపోవడం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా స్రవించడం దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య తీవ్రమైతే పుండు కూడా పడవచ్చు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు: రోగి లక్షణాలను బట్టి ఎక్స్‌రే, ఎండోస్కోపీ, ఎఫ్‌టీఎమ్, మలపరీక్ష, అమీబియాసిస్, సీబీపీ, ఈఎస్సార్, ఎల్‌ఎఫ్‌టీ, అల్ట్రాసౌండ్‌స్కానింగ్, కొలనోస్కోపీ, సీటీస్కాన్ లాంటి పరీక్షలు చేస్తారు.
నివారణ మార్గాలు: ఆహారం విషయంలో సమయపాలన, మద్యం-పొగతాగే అలవాట్లను మానివేయడం, మిత వ్యాయామం, కారం, మసాలాలకు దూరంగా ఉండటం, రోజుకు 6-8 గంటలు పాటు సరైన నిద్ర, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రాణాయామం, ధ్యానం చేయడం వంటివి అనుసరించాలి.
చికిత్స: హోమియోలో అంకురం నుంచి చికిత్స చేస్తారు. నవీన పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, కాన్‌స్టిట్యూషన్ చికిత్స ద్వారా మానసిక ఒత్తిడి, పేగులోని పుండ్లు మానేలా చేయడం ద్వారా వ్యాధిని అదుపు చేస్తారు. శారీరక, మానసిక లక్షణాలను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం వల్ల రోగి త్వరగా కోలుకుంటారు.
డాక్టర్ మురళి అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
స్కిన్ కౌన్సెలింగ్
నా వయసు 28 ఏళ్లు. నా చేతుల వేళ్లు విపరీతంగా దురద పెడుతున్నాయి. దాంతో చేతులను ఎప్పుడూ రుద్దుకుంటూ ఉంటున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- కుమారస్వామి, తణుకు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు అలర్జీకి సంబంధించిన కాంటాక్ట్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. బహుశా దుమ్ము, ధూళి, డిటర్జెంట్, పుప్పొడి వంటి ఏవో అంశాలు మీకు సరిపడకపోవడం వల్ల మీకు విపరీతమైన దురద వస్తుండవచ్చు. మీరు ఒకసారి ఈ కింద పేర్కొన్న వైద్య పరీక్షలు చేయించాలి. అవి... సీబీపీ అబ్‌సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్ మలపరీక్ష. కొన్నిసార్లు మన కడుపులో లేదా పేగుల్లో ఏవైనా క్రిమికీటకాలు, పరాన్నజీవులు ఉండటం వల్ల కూడా ఇలా ఒంటి మీద దురద వస్తుంటుంది.
చికిత్స: మీకు సరిపడవని తెలిసిన అంశాల నుంచి దూరంగా ఉండండి. (అంటే ఉదాహరణకు డిటర్జెంట్, దుమ్ము, పుప్పొడి వంటివి) మీ కడుపులో ఉండే క్రిములు పడిపోవడానికి ఆల్బెండిజోల్ 400 ఎంజీ మాత్రలు నోటి ద్వారా తీసుకోవాలి వైద్య పరీక్షల్లో ఒకవేళ మీ ఇజినోఫిల్ కౌంట్ ఎక్కువని తేలితే మాంటెలుకాస్ట్ వంటి యాంటీహిస్టమైన్ మందులను రెండు నుంచి నాలుగు వారాల పాటు వాడాలి ఏదైనా ర్యాష్ వంటివి వస్తే వేళ్ల మీద మూడు రోజుల పాటు మోమాటజోన్ క్రీమ్ రాయాలి ప్రతి రోజూ చేతుల మీద మాయిష్చరైజింగ్ క్రీమ్ వాడుతుండాలి. అప్పటికీ సమస్య తగ్గకపోతే వెంటనే చర్మ నిపుణులను సంప్రదించండి.
నా రెండు చేతుల మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తే చాలాసేపు గీరుకున్నాను. దాంతో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. నా చర్మం మామూలయ్యేందుకు ఏం చేయాలి?
- పద్మ, నిజామాబాద్
మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి పాటించాల్సిన సూచనలు: సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే చోట ఎస్‌పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్‌తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి.ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. మీరు అలర్జీని అదుపులో ఉంచుకునే మందులూ వాడాలి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి హైదరాబాద్
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా కూతురి వయసు 36 ఏళ్లు. ఆమెకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇప్పటికి ఐదుసార్లు గర్భం వచ్చింది. కానీ ప్రతిసారీ ఏడో వారంలో గర్భస్రావం అయ్యింది. ఈ తర్వాత ఏడాదికి గర్భం వచ్చింది కానీ ఈ సారి తొమ్మిదోవారంలో గర్భస్రావం అయ్యింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం గర్భం వచ్చి ఎనిమిది వారాలకు గర్భస్రావం అయ్యింది. ఆమెకు మాటిమాటికీ గర్భస్రావం కావడానికి కారణాలు ఏమిటి? నా కూతురికి గర్భం వస్తుందా, రాదా?
- ఒక సోదరి, మహబూబ్‌నగర్
గర్భం రావడం, గర్భస్రావం కావడం మూడు సార్లు వరసగా జరిగితే దాన్ని వరస గర్భస్రావాలు (రికరెంట్ మిస్‌క్యారేజెస్) అంటారు. సాధారణంగా మన సమాజంలో ఒక శాతం మందిలో ఇలా జరుగుతుంటుంది. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావం అయ్యే అవకాశాలూ పెరుగుతుంటాయి. అండాల సంఖ్య, నాణ్యత... ఈ రెండూ తగ్గుతుండటం వల్ల జరిగే ప్రక్రియ ఇది. చాలా సందర్భాలలో దీనికి కారణాలు తెలియవు. అయితే రెండు శాతం నుంచి ఐదు శాతం మందిలో దీనికి క్రోమోజోముల్లో సమస్య ఉండటం కారణం కావచ్చు. ఇలా మాటిమాటికీ గర్భస్రావాలు అవుతున్న మహిళల్లో 15 శాతం మందిలో యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ కారణంగా ఇది జరుగుతుంది. ఇదేగాక రక్తానికి, గర్భసంచి (యుటెరైన్)కి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. ఒకవేళ క్రోమోజోమస్ సమస్యలు ఉంటే ప్రీ-నేటల్ పరీక్షలు లేదా ఐవీఎఫ్, ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ వంటివి చేయాలి. ఒకవేళ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉంటే తక్కువ మోతాదులో ఆస్పిరిన్, హెపారిన్ వంటి మందులు వాడటం వంటివి ఉపయోగపడతాయి. ఒకసారి మీ అమ్మాయికి అన్నిరకాల పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె గర్భస్రావాలకు నిర్దిష్టమైన కారణం బయటపడితే దాన్ని అనుసరించి చికిత్స చేయాలి.
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్
రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్
కడుపులో క్రిములున్నా.. ఒంటి మీద దురద!
Published Tue, Feb 2 2016 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM
Advertisement
Advertisement