ఫిక్సింగ్ టు కుకింగ్ | Bangladesh's Mohammad Ashraful admits fixing | Sakshi
Sakshi News home page

ఫిక్సింగ్ టు కుకింగ్

Published Fri, Apr 25 2014 10:35 PM | Last Updated on Mon, Aug 13 2018 3:45 PM

ఫిక్సింగ్ టు కుకింగ్ - Sakshi

ఫిక్సింగ్ టు కుకింగ్

ఒకప్పుడు అష్రాఫుల్ బంగ్లాదేశ్‌లో పెద్ద క్రికెట్ స్టార్. తన ముద్దుపేరు ‘బంగ్లా సచిన్’. ఒకప్పుడు ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలన్నీ తన వెనక పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 29 ఏళ్ల వయసులో తన సహచరులు ఇంకా ఆడుతుంటే తాను మాత్రం క్యాటరింగ్ ఆర్డర్స్ కోసం అదే కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నాడు. అవును... అష్రాఫుల్ ఇప్పుడు ఢాకాలో ఓ చైనీస్ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
 
బత్తినేని జయప్రకాష్

ఓల్డ్ ఢాకా... సాయంత్రం 7 గంటలు... వెళ్లాల్సిన ప్రదేశం షెజ్‌వాన్ గార్డెన్స్... విపరీతమైన రద్దీ.. చుట్టూ బోర్డులన్నీ బెంగాలీలో... ఒక్కళ్లకీ హిందీ, ఇంగ్లీష్ రావడం లేదు... ఎలా..? ‘మీరు అడ్రస్ అడిగితే ఎవరూ చెప్పరు. అష్రాఫుల్ రెస్టారెంట్ ఎక్కడ?’ అని అడగండి (ఫోన్‌లో అష్రాఫుల్). ఫర్వాలేదు... అష్రాఫుల్‌కు ఇంకా గిరాకీ బాగానే ఉంది. పది నిమిషాల్లోనే రెస్టారెంట్‌కు వెళ్లగలిగిన పరిస్థితి. మ్యాచ్ ఫిక్సర్‌గా ముద్రపడ్డా తన రెస్టారెంట్‌కు డిమాండ్ కూడా బాగానే ఉంది.  
 
ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడం సహజం. పరిస్థితి బాగోక మారిపోయేవాళ్లు కొంతమందైతే... చేజేతులా కెరీర్‌ను నాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. ఇందులో రెండో కోవలోకి వచ్చే క్రికెటర్ అష్రాఫుల్. 2013 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా గ్లాడియేటర్స్‌కు కెప్టెన్‌గా ఆ జట్టు ఆడిన మ్యాచ్‌ను ఫిక్స్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనివల్ల ఎదురైన పరిణామాలకు ఎలా స్పందించాడు? భవిష్యత్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు అష్రాఫుల్ చెప్పిన సమాధానాలు అతడి మాటల్లోనే...
 
కోపంతో చేశా

బంగ్లాదేశ్ లీగ్ తొలి సీజన్‌లో ఢాకా గ్లాడియేటర్స్ నన్ను 1.60 కోట్ల టాకా(బంగ్లాదేశ్ కరెన్సీ)లకు కొనుక్కుంది. రెండో సీజన్ సమయానికి నా ఫామ్ పోయింది. కేవలం 48 లక్షల టాకాలకే అదే జట్టు కొనుక్కుంది. అయితే తొలి సీజన్‌కు సంబంధించి వాళ్లు నాకు కేవలం 86 లక్షల టాకాలు మాత్రమే ఇచ్చారు. మిగతావి ఇవ్వలేదు. దీంతో ఢాకా జట్టు ఓనర్‌కి, నాకు చాలాసార్లు వాగ్వాదాలు జరిగాయి. ఒక రోజు ఒక బుకీ నా దగ్గరకు వచ్చి 10 లక్షల టాకాలు ఇస్తా, మ్యాచ్ ఫిక్స్ చేయమని అడిగాడు. కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు ఢాకా ఓనర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత... నేను ఆ కోపంలో ఉండగానే బుకీ వచ్చాడు. 10 లక్షల టాకాలు ఇస్తా మ్యాచ్ ఓడిపోమని అడిగాడు. ఆ సమయంలో ఏం ఆలోచించానో తెలియదు. నా డబ్బులు నాకు రాలేదని కోపం బహుశా నన్ను అలా ఆలోచించేలా చేసిందేమో. నేను ఒప్పుకున్నాను. నా జీవితంలో నేను చేసిన తప్పు అదొక్కటే.
 
డబ్బు మనిషిని కాను
 
నిజానికి నేను డబ్బు మనిషినే అయితే గనక ఎప్పుడో ఐసీఎల్‌లోనే నాకు 15 కోట్ల టాకాలకు కాంట్రాక్ట్ ఇస్తామని వచ్చారు. కానీ ఆ లీగ్‌లో నేను ఆడితే బంగ్లాదేశ్ అభిమానులు నన్ను డబ్బు మనిషిగా భావిస్తారని వెళ్లలేదు. దేశం, అభిమానులు ముఖ్యమని అనుకున్నా కాబట్టే అప్పట్లో అంత భారీ మొత్తం ఇస్తామన్నా వెళ్లలేదు.
 
ఐసీసీ విచారణ
 
ఐసీసీ విచారణలో మొదట గంట పాటు నేనేం చెప్పలేదు. కానీ అప్పటికే నా మీద నిషేధం ఖాయమని తెలుసు. ఓ గంట తర్వాత ఎందుకో నా మనసుకు అనిపించింది. ఎందుకు అబద్దం చెప్పడం.? అదేదో నిజం చెప్పే నిషేధాన్ని ఎదుర్కొందాం అనుకున్నాను. బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అభిమానులు నన్ను ఎంతో ఆరాధించారు. కానీ తిరిగి వాళ్లకు నేనేం ఇచ్చాను. ఎలాగూ నా కెరీర్ ముగిసిపోతోంది. ఇక ఎందుకు అబద్దం ఆడటం?
 
స్నేహితులతో కలిసి రెస్టారెంట్
 
నిషేధం తర్వాత స్నేహితులు నాలో ధైర్యం పెంచారు. వాళ్లలో ఎక్కువమంది చిన్నప్పుడు నాతో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. నేనేంటో వాళ్లకు తెలుసు. అందుకే అందరం కలిసి ఈ రెస్టారెంట్ (షెజ్‌వాన్ గార్డెన్) పెట్టుకున్నాం. మా వాళ్లు సంబంధాలు చూస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటివరకూ గర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవడానికి సమయం సరిపోలేదు. క్రికెట్‌తో బిజీగా గడిపాను. ఇప్పుడు సమయం దొరికింది. కాస్త దైవం మీద కూడా శ్రద్ధ పెరిగింది. హజ్ వెళ్లి రావాలని అనుకుంటున్నాను.
 
ఆ రోజులు మరవలేను


2001లో 17 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ క్రికెట్ రాతను మార్చాను నేను. ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించే దేశంలో అభిమానులను క్రికెట్ వైపు మళ్లించింది నేనే. 17 ఏళ్ల వయసులో తొలి టెస్టు సెంచరీ చేయడంతో నాకు క్రేజ్‌వచ్చింది. ఓ దశలో జట్టు ఎలా ఆడినా, గెలిచినా ఓడిపోయినా వేరే వాళ్లు పరుగులు చేసినా... ఏం జరిగినా అన్ని పేపర్లలో మొదటి పేజీలో నా ఫొటోనే వచ్చేది. ఒకప్పుడు ‘అష్రాఫుల్’ అనేది బంగ్లాదేశ్ క్రికెట్‌కు మారుపేరు.
 
క్షమించండి: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నన్ను ఆదరించారు. కానీ నేను తిరిగి వాళ్లకు ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం ఒక్క బీపీఎల్ మ్యాచ్‌లో మాత్రమే నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మరొక్క అవకాశం ఇస్తే అందరి రుణం తీర్చుకుంటాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement