రాక్షసత్వం | Barack Obama wife as the former First Lady of America | Sakshi
Sakshi News home page

రాక్షసత్వం

Published Wed, Dec 5 2018 2:40 AM | Last Updated on Wed, Dec 5 2018 2:40 AM

Barack Obama wife as the former First Lady of America - Sakshi

రాక్షసిలా పని చెయ్యడం (లీనింగ్‌ ఇన్‌)..  స్త్రీని ఇప్పుడు ఆకాశంలోకి ఎత్తేస్తున్న ‘సుగుణం’! ఇంటినీ, ఆఫీస్‌నీ బ్యాలెన్స్‌ చేసుకుంటోందంటే ఆమె ఇంకా పెద్ద రాక్షసి. స్త్రీలోని ఆమె స్వాభావికతల కన్నా.. ‘లీన్‌ ఇన్‌’ అవడం అనే ఈ పని రాక్షసత్వమే ఆమెకు గుర్తింపు తెచ్చిపెడుతోందిప్పుడు! అయితే ‘అంతలేదు’ అని మిషెల్‌ ఒబామా నవ్వేస్తున్నారు. బహుశా ఆమె ఉద్దేశం.. ‘అంత అవసరం లేదని’ కావచ్చు. 

భర్త ఇంట్లో ఉంటే, బయటి సొంత పనులు తెముల్చుకోడానికి భార్యకు సౌఖ్యంగా ఉంటుంది. గ్యాస్‌ బాయ్‌ వచ్చి, ఎవరూ లేరని వెనక్కి వెళ్లిపోతాడేమోనని, మంచినీళ్ల ట్యాంకరొస్తే బిందెల్లోకి నీళ్లు పట్టేవారుండరనీ మనసు పీకులాట ఉండదు.  ఇంటి పనులు, ఆఫీసు పనులు కాకుండా స్త్రీలకు వేరే  సొంత పనులేం ఉంటాయని అనిపించవచ్చు! మీరు భర్త గనుకైతే, మీరు మీ ఆఫీసుకి ఒకరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి, అదే రోజు ఆమెనూ ఆమె ఆఫీసుకు సెలవు పెట్టమని చెప్పి.. ‘నీ పనులేమైనా ఉంటే చూసుకో. ఇంట్లో పనులు ఇవాళ నేను చూసుంటాను’ అని నమ్మకం ఇవ్వండి. అప్పుడామె.. పని మీద బయటికి వెళ్లినట్లుగా ఉండదు. పండక్కి పుట్టింటికి వెళ్తున్నట్లుగా  వెళ్తుంది. నిజం. చీరకు ఫాల్‌ కుట్టించుకునేందుకు తీరిక దొరకడం కూడా ఆమెకు పండగే. అంతగా ‘లీన్‌ ఇన్‌’ అయి ఉంటున్నారు గృహిణులు, ఉద్యోగినులూ! జాబ్‌ చేసే మహిళలంటే ఆఫీస్‌లోనూ పని చెయ్యాలి, ఇంటికొచ్చి బియ్యమూ కడిగి ఉడికించాలి. మరి గృహిణులకేమైంది? గృహిణులకేమైందీ కాదు.. గృహిణులకే అయింది. ఆఫీస్‌ పనిలోనన్నా మిగతా స్టాఫ్‌ నుంచి చెయ్యో, చేతులో సపోర్టుగా వస్తాయేమో కానీ.. గృహిణి చెయ్యలేకపోయిన పనిలో ఒక చెయ్యేసేవాళ్లెవరుంటారు? ఇంట్లో తనొక్కరిదే తన పని కాదు. ఇంట్లో వాళ్లందరి పనీ తనదే. పగలూ రేయీ చేస్తూ ఉండాల్సిందే. తెల్లారే సూర్యుడు కూడా ‘ఆలస్యంగా ఉదయించానా’ అని అనుమానపడి అవమానపడతాడు.. ఈ ‘రాక్షసి’ నాకంటే ముందెలా లేవగలుగుతోందని! లేదంటే.. సంశయపడతాడు.. రాత్రంతా నిద్రమానుకుని పని చూస్తూనే ఉందా ఏంటి అని.

రాక్షసిలా పని చెయ్యడం, రాక్షసిలా పరుగులు తియ్యడం.. రాక్షసిలా కెరీర్‌లో ఎదిగే ప్రయత్నం చెయ్యడం..  స్త్రీని ఇప్పుడు ఆకాశంలోకి ఎత్తేస్తున్న ‘సుగుణం’. ఇంటినీ, ఆఫీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటోందంటే ఆమె ఇంకా పెద్ద రాక్షసి. స్త్రీలోని ఆమె స్వాభావికతల కన్నా.. ‘లీన్‌ ఇన్‌’ అవడం అనే ఈ పని రాక్షసత్వమే ఆమెలో ప్రతిచోటా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు. ‘లీన్‌ ఇన్‌’ అంటే పెనుగాలికో, ఈదురుగాలికో లేక అలాంటి పరిస్థితులకో మనిషి ఒరిగిపోవడం. 2013లో ‘లీన్‌ ఇన్‌ : ఉమెన్, వర్క్, అండ్‌ ది విల్‌ టు లీడ్‌’ అనే పుస్తకం  మార్కెట్‌లోకి వచ్చాక  ‘లీన్‌ ఇన్‌’ కు ‘ఇంటినీ, ఆఫీస్‌నీ బ్యాలెన్స్‌ చేసుకునేంత రాక్షసత్వం’ అనే అర్థం బాగా వాడుకలోకి వచ్చింది. ఆ పుస్తక రచయిత్రి షిరిల్‌ శాండ్‌బర్గ్‌. ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌. ఆ పుస్తకం శాండ్‌బర్గ్‌ని ఎంత పాపులర్‌ చేసిందో, అందులోని ‘లీనింగ్‌ ఇన్‌’ అనే మాట అంత పాపులర్‌ అయింది. దూసుకెళ్లడం, పది చేతులతో పని చెయ్యడం, పైపైకి ఎదగడం, ఫాలో అవకుండా.. లీడ్‌ చెయ్యడం.. వీటన్నిటినీ కలిపి ‘లీన్‌ ఇన్‌’ అన్నారు శాండ్‌బర్గ్‌. అనడమే కాదు.. ప్రపంచ మహిళలారా ‘లీన్‌ ఇన్‌’ అవండి అని ఒక మూవ్‌మెంట్‌ని కూడా తెచ్చారు. లీన్‌ ఇన్‌ అవడానికి దుర్గమ్మకు ఉన్నంత శక్తి ఉండాలి. లేదంటే ఒక గృహిణికి, ఒక ఉద్యోగినికి ఉన్నంత శక్తి ఉండాలి.

మిషెల్‌ ఒబామా కూడా గృహిణే. బరాక్‌ ఒబామా భార్యగా ‘అమెరికా మాజీ ప్రథమ మహిళ’ అనే గుర్తింపు ఉండొచ్చు గాక.. ప్రజలకు పనికొచ్చే ఏవో ఒకట్రెండు ఉద్యమాలు మినహా ఉద్యోగాలేమీ చేయలేదు మిషెల్‌. గృహిణిగానే ఉండిపోయారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్లయ్యాక మిషెల్‌కి ఇంటి పనుల్నుంచి కాస్త తీరిక దొరికింది. ఆ తీరిక సమయంలోనే తన ఆత్మకథను రాసుకుని దానికి ‘బికమింగ్‌’ అని పేరు పెట్టుకున్నారు. బికమింగ్‌ ఈ ఏడాది నవంబర్‌ పదమూడున విడుదలైంది. ఇప్పటికే ఇరవై లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి! నాన్‌–ఫిక్షన్‌ కేటగిరీలో టాప్‌ సెల్లింగ్‌లో ఉంది. ఒబామా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మిషెల్‌ తన అభిమాన పాఠకుల కోసం యు.ఎస్‌. అంతా పర్యటించే వీలు చిక్కింది. అలా పర్యటిస్తూ.. డిసెంబర్‌ రెండున న్యూయార్క్‌లో బార్క్‌లేస్‌ సెంటర్‌లోకి వెళ్లడానికి ముందు ఓ టీనేజ్‌ అమ్మాయిల గుంపు మిషెల్‌ను కలిసింది. వాళ్లేదో అడగాలని చూస్తున్నారు. ‘ఊ.. కానివ్వండి’ అన్నారు మిషెల్‌ నవ్వుతూ. ‘‘నెక్స్‌›్ట అమెరికన్‌ ప్రెసిడెంట్‌ మీరే అంటున్నారు. పోల్‌ నంబర్స్, అప్రూవల్‌ రేటింగ్స్‌ కూడా మీ వైపే చూపిస్తున్నాయి. మరి మీరు కంటెస్ట్‌ చెయ్యబోతున్నారా?’’ అని అడిగారు ఆ పిల్లలు. మిషెల్‌ నవ్వారు. ‘‘ప్రెసిడెంట్‌ అవ్వాలని నాకు లేదు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ఒకర్ని పెళ్లి చేసుకున్నానే కానీ, రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు’’ అని చెప్పారు. అక్కడి నుంచి బార్క్‌లేస్‌ సెంటర్‌ లోపలికి వెళ్లాక అక్కడా ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఈమధ్య ఆడవాళ్లంతా.. గ్రేటర్‌ క్వాలిటీస్‌ అని, రెస్పెక్ట్‌ ఇన్‌ వర్క్‌ప్లేస్‌ అనీ అంటున్నారు.. కదా’’ అని ఎవరో అన్నారు. అందుకు మిషెల్‌.. ‘‘ఇట్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌ టు లీన్‌ ఇన్‌. బికాజ్‌ దట్‌ షిట్‌ డజెంట్‌ ఆల్వేస్‌ వర్క్‌’’ (‘లీన్‌ ఇన్‌’ అయినంత మాత్రాన సరిపోదు. ఆ దరిద్రం అన్ని సమయాల్లో పనిచేయదు) అని అన్నారు. ఒకటే చప్పట్లు, అరుపులు. మిషెల్‌ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని పేరు. మనసులో ఉన్నది కూడా ఉన్నట్లే మాట్లాడారు.మిషెల్‌ అన్న ఈ మాటలు నెట్‌లో ఇప్పుడు విశేషంగా ప్రచారం అవుతున్నాయి. ఎరిన్‌ స్ట్రెకర్‌ అనే అమ్మాౖయెతే.. మిషెల్‌ మాటల్ని అన్నవి అన్నట్లు తన ఒంటిపై టాటూ వేయించుకుంది. ఇంకో అమ్మాయి.. ‘మిషెల్‌ ఒబామా ఈజ్‌ మై ప్రెసిడెంట్‌’ అని ట్వీట్‌ చేసింది. 

ముందు తరంతో పోలిస్తే ఈ తరం పురుషులు ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెడుతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ స్త్రీల పనులు మాత్రం తగ్గలేదు! బ్యాలñ న్సింగ్‌ ఇంకో అదనపు పని. వర్క్‌ లైఫ్‌నీ, హోమ్‌ లైఫ్‌నీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ‘లీన్‌ ఇన్‌’ అవడం స్త్రీల మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. సమానత్వాన్ని రుజువు చెయ్యడానికైతే మాత్రం స్త్రీకి అంత ఒత్తిడి అవసరం లేదేమోనని మిషెల్‌ ఒబామా భావిస్తున్నట్లు ఆమె మాటల్ని బట్టి అర్థంచేసుకోవాలి.   

∙మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement