బ్యాట్‌మెన్ 3
బయోగ్రఫీ
బ్యాట్‌మన్ ఓ సూపర్ హీరో... కలలో మాత్రమే సాధ్యమయ్యే వాటిని క్షణాల్లో చేసి చూపిస్తాడు. భారత క్రికెట్‌కు అలాంటి బ్యాట్‌మెన్ ముగ్గురున్నారు. ఆడినంతకాలం ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్... ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్‌ను బంగారుబాట పట్టించేందుకు కంకణం కట్టుకున్నారు.
మైదానంలో ఎదురుగా ధోని, కోహ్లిల వంటి హేమాహేమీల్లాంటి ఆటగాళ్లు... వారిని ఎలా నిలువరించాలా అనేది ప్రత్యర్థి జట్ల ఆలోచన. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లుగా... మరికొందరు దిగ్గజాలు ఆటగాళ్ల వెన్నంటి నిలిచి వ్యూహాలకు పదును పెడితే... ఇక వారి కోసం కూడా అవతలి జట్లు ప్రతివ్యూహం పన్నాల్సి వస్తుందేమో. భారత క్రికెట్ భవిష్యత్తును దూరదృష్టితో చూస్తే ఇదే దృశ్యం ఇప్పుడు మన ముందు కనిపించనుంది. ఎందుకంటే ఇకపై భారత జట్టుకు దశ, దిశను ఇచ్చేందుకు నాటి స్టార్ క్రికెటర్లు దిగుతున్నారు. పుష్కర కాలానికి పైగా కలిసి ఆడిన తమ సమష్టి అనుభవంతో త్రిమూర్తులు... ఇప్పుడు మార్గదర్శనం అందించేందుకు సిద్ధమయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఇకపై సలహాదారులుగా జట్టుకు అండగా నిలవనున్నారు.
భారత క్రికెట్ జట్టుకి అనుభవం లేదు... అంతా కుర్రాళ్లే... సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఇది. ఇది వాస్తవమే. కానీ మాస్టర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా గత ఏడాదిన్నరగా మనోళ్లు చాలా చోట్ల మెరుపులు మెరిపించారు. అయితే కొన్ని చోట్ల మోకరిల్లారు. ఫలితాల్లో తేడాలు ఉన్నా, అనుభవం లేకపోయినా కొత్త కుర్రాళ్లు సాన పెట్టిన వజ్రంలా రాటుదేలుతూ పోయారు. అయితే విజయాలు ఒక్కటే కాదు... ఇంకేదో కావాలి. అలనాటి విండీస్ లాగానో, ఆ తర్వాతి ఆస్ట్రేలియాలానో భారత్ కూడా అజేయ శక్తిలా నిలవాలి. సరిగ్గా చెప్పాలంటే ఐసీసీలో కాదు ఆటలో కూడా సూపర్ పవర్ కావాలి. అదిగో... దానికోసమే బీసీసీఐ త్రిమూర్తులను ముందుకు తెచ్చింది.
ఈ ముగ్గురినీ ఆటలో మళ్లీ భాగం చేసింది. తమ అనుభవాన్ని నవ తరానికి అందించమని కోరింది. మైదానం బయట కూడా తమదైన ముద్ర వేసేందుకు మరో అవకాశం కల్పించింది. వీరంతా తమ 1308 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లలో స్ఫూర్తి నింపితే, మార్గదర్శనం అందిస్తే ఇక తిరుగేముంది. ఈ ముగ్గురిలో ఎవరి పాత్ర ఏమిటనే విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... సంవత్సరాల పాటు భారత క్రికెట్‌కు మూల స్తంభాలుగా నిలిచినన ఈ త్రయం తెర వెనుక నుంచి కూడా మరో చరిత్రకు అంకురార్పణ చేయగలదనే నమ్మకం ఉంది.
సచిన్: వివాద రహితంగా మెలగడం
మాస్టర్ బ్లాస్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తన 24 ఏళ్ల కెరీర్‌లో ఎక్కడా ఒక్క వివాదం కూడా లేదు. మైదానం లోపల, బయట కూడా మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇకపై భారత బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ చిన్న తప్పులు చేస్తున్నా నెట్స్‌లో సరిదిద్దడానికి సచిన్ ఉంటాడు. నిజానికి సచిన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటమే ఓ పాఠం. తన అనుభవాలు చెప్తే చాలు స్ఫూర్తి పెరుగుతుంది.
ఫలానా మ్యాచ్‌లో ఇలాంటి ఒత్తిడిలో నేను ఇలా ఆడా అని మాస్టర్ చెప్పినా అదే కొండంత ధైర్యాన్నిస్తుంది. 2003 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన సచిన్ ఆ టోర్నీలో తాను ఒక్కసారి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదని చెబితే ఆశ్చర్యం కలగడమే కాదు... మరో రకమైన సన్నాహకం దాని వెనక ఉందనే విషయం తెలిస్తే యువ ఆటగాళ్లు అదో పెద్ద పాఠం.
ఇటీవల కాలంలో ఆటతీరు ఎలా ఉన్నా మైదానం లోపల, బయట కూడా భారత క్రికెటర్లు పదే పదే వివాదాల్లోకి వెళుతున్నారు. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ కోహ్లి ఇందులో ముందుంటున్నాడు. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పే బాధ్యత ఇకపై సచిన్ తీసుకోవచ్చు.
గంగూలీ: సమపాళ్లలో దూకుడు
భారత జట్టు కెప్టెన్‌గా ప్రత్యర్థులతో దూకుడు ఎలా వ్యవహరించాలో తొలుత నేర్పినవాడు గంగూలీ. అయితే తను ఏనాడూ శృతి మించలేదు. గీత దాటి వేటు పడేదాకా పరిస్థితిని తెచ్చుకోలేదు. అలాగే వ్యూహాల విషయంలో తనకు తనే సాటి. ఆట కంటే మిగిలిన విషయాలలో గంగూలీ అనుభవం యువ జట్టుకు ఎక్కువగా ఉపయోగపడొచ్చు. ఇక గంగూలీలో మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య వారధిగా తను ఉపయోగపడతాడు. తను కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో యువ క్రికెటర్లను వెనకేసుకొచ్చి సెహ్వాగ్, హర్భజన్ లాంటి వాళ్లు నిలదొక్కుకునేలా చేసిన ఘనత తనది. మరోసారి ఇప్పటితరం క్రికెటర్లు కూడా గంగూలీని నమ్ముకోవచ్చు. నైపుణ్యం ఉన్న క్రికెటర్‌ను గుర్తించి, తనకు అండగా నిలవడంలో దాదా ఎప్పుడూ ముందుంటాడు.
లక్ష్మణ్: విదేశాల్లో బాగా ఆడటం
ప్రస్తుత క్రికెటర్లు లక్ష్మణ్ నుంచి నేర్చుకోవాల్సిన తొలి పాఠం విదేశీ గడ్డపై ఎలా ఆడాలో తెలుసుకోవడమే. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై మన రికార్డు అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుత టి20 తరంలో బ్యాట్స్‌మెన్ టెక్నిక్‌ను బాగా మెరుగుపరిస్తే ఈ రికార్డును సరిజేయొచ్చు. ఈ బాధ్యతను లక్ష్మణ్ సమర్థంగా నిర్వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్ జట్టు మెంటర్‌గా, బెంగాల్‌లో యువ బ్యాట్స్‌మెన్‌కు శిక్షకుడిగా కొంత అనుభవం కూడా తను గడించాడు. నిజానికి తమ తరంలో ఎక్కువగా అన్యాయం జరిగిన క్రికెటర్ లక్ష్మణ్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కాలేదు. అయినా ఏనాడూ బయటకు ఒక్క మాట అనలేదు. వివాదాలను తెచ్చుకోలేదు.
ఈ ముగ్గురూ తమ తొలి ఇన్నింగ్స్‌లో క్రికెట్ ఆడుతూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. తాము ఆడినంత కాలం భారత క్రికెట్‌ను శిఖరాన నిలబెట్టారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తమ అనుభవంతో యువ జట్టును కూడా అదే స్థాయికి చేరుస్తారా..? చూద్దాం... త్వరలోనే దీనికి సమాధానం దొరకొచ్చు.
- బత్తినేని జయప్రకాష్
భవిష్యత్ కోసం ద్రవిడ్
సలహా కమిటీలో త్రిమూర్తులు మాత్రమే ఉండి ద్రవిడ్ లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి బీసీసీఐ ద్రవిడ్‌ను కూడా ఈ కమిటీలో ఉండాలని కోరింది. అయితే తాను భారత క్రికెట్ భవిష్యత్ కోసం పని చేస్తానని ‘వాల్’ స్పష్టం చేశాడు. దీంతో భారత్ ఎ, అండర్-19 జట్లకు తనని కోచ్‌గా నియమించారు. భారత్ జట్టు తరఫున క్రికెట్ ఆడే వాళ్లంతా ఈ రెండు జట్లలో ఏదో ఒక దశలో ఆడి రావాల్సిందే. కాబట్టి క్షేత్రస్తాయిలోనే ఆటగాళ్లను సాన బెట్టాలనే ఆలోచన తనది. త్రిమూర్తులతో పోలిస్తే ద్రవిడ్‌దే కఠినమైన పని. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో జట్టు భారాన్ని అనేకసార్లు ఒంటిచేత్తో మోసిన రాహుల్ ద్రవిడ్‌కు ఇలాంటి సవాళ్లంటేనే ఇష్టం.