ఆ మందులు వాడుతున్నారా.. కాస్త జాగ్రత్త! | be Careful with medicines! | Sakshi
Sakshi News home page

ఆ మందులు వాడుతున్నారా.. కాస్త జాగ్రత్త!

Published Tue, Feb 16 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

be Careful with medicines!

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. ఆర్నెల్లుగా మెడ, చెవుల వద్ద దురద వస్తోంది. నేను రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు ధరించడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్ని ఆయింట్‌మెంట్స్, క్రీమ్స్ రాస్తున్నా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా?
 - సునీత, కర్నూలు

 
డర్మటైటిస్ అనేది ఒక చర్మవ్యాధి. శరీరంలో పేరుకుపోయి విషపదార్థాలు దీనికి కారణాలు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి.
 
కాంటాక్ట్ డర్మటైటిస్: ఈ రకం చర్మవ్యాధిలో చర్మం గులాబీ లేదా ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. రబ్బరు తొడుగులు లేదా ఆభరణాలు, నికెల్/కోబాల్ట్ వంటి లోహాల వల్ల ఈ తరహా అలర్జీ కలుగుతుంది. జుట్టురంగులు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల కూడా ఇది రావచ్చు.
 
నుములార్ డర్మటైటిస్: ఈ తరహా చర్మవ్యాధిలో నాణెం ఆకృతిలో ఎరుపు మచ్చలు వస్తాయి.

ఇవి సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ.
 ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. దీర్ఘకాలిక చర్మ ఇన్ఫెక్షన్‌ను ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపురంగులోకి మారడం, కమిలినట్లు కావడం, కొద్దిగా పొరలుగా తయారు కావడం కనిపిస్తాయి. ఎగ్జిమా బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపురంగులోకి మారి, ఆ తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. అవి క్రమంగా నీటిపొక్కులగా కూడా మారవచ్చు.
 
సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా ముఖం, నెత్తి మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. దీని తీవ్రతవల్ల జుట్టు రాలవచ్చు.
 
కారణాలు: డర్మటైటిస్‌కు చాలా కారణాలు ఉంటాయి. అవి...  కొన్ని రకాల మందులు  జుట్టుకు వాడే రంగులు  జంతు చర్మాలతో తయారయ్యే వస్తువులు  రోల్డ్‌గోల్డ్ నగలు  బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల.
 
చికిత్స: డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్ క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్, వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా తగ్గుతుంది.
 
- డాక్టర్ మురళి అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్

 
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 60. ఏడాది క్రితం బై-పాస్ ఆపరేషన్ అయ్యింది. ఆ తర్వాత కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి, రక్తం పలచగా ఉండటానికి డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. అయితే రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయని కొందరు మిత్రులు చెప్పారు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తప్రసరణ త్వరగా ఆగదని అంటున్నారు. ఈ విషయంపై నాకు తగిన సలహా ఇవ్వండి.
 - కె. జనార్దన్, చిత్తూరు


గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గుండె పంపింగ్ సరిగా లేకపోతే ఆపరేషన్ కంటే ముందుగా బీటా బ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్ వంటి మందులతో గుండె పంపింగ్‌ను సరిచేయవచ్చు. రక్తాన్ని పలచబార్చే మందుల్లో ప్లేట్లెట్స్ కణాల మీద ప్రభావం చూపేవీ, రక్తం గడ్డ (క్లాట్) మీద ప్రభావం చూపేవీ రెండు రకాలు ఉంటాయి.

యాంటీప్లేట్‌లెట్ (యాస్పిరిన్, క్లోపెడోగ్రెల్) వల్ల రక్తస్రావం అయ్యే అవకాశాలు తక్కువ. కానీ యాంటీకోయాగ్యులెంట్స్ మీద ఉంటే మాత్రం (ఎసిట్రోమ్, వార్‌ఫేరిన్  ఇచ్చినట్లయితే) అప్పుడు రక్తస్రావం కాకుండా, దెబ్బలేమి తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మందులు వాడే వారిలో రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనా కారణం వల్ల రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేకాకుండా ‘ఐఎన్‌ఆర్’ను 2 నుంచి 3 మధ్యలో ఉంచుకోవాలి.
 
నాకు ఐదు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. తక్షణం హాస్పిటల్ వెళ్లాం. అక్కడ హార్ట్ ఎటాక్ అని చెప్పి యాంజియోగ్రామ్ చేసి, స్టెంట్ అమర్చారు. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. ఇప్పుడు నేను అన్ని పనులూ చేసుకోవచ్చా? మందులు ఎన్ని రోజులు వాడవలసి ఉంటుందో వివరించండి?
 - శ్రీనివాసరావు, కొత్తగూడెం  

 
ఇప్పుడు మీ హార్ట్ పంపింగ్ ప్రక్రియ అంతా నార్మల్‌గానే ఉందని మీ లేఖలోని వివరాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి గుండెజబ్బు రాకముందు మీరు ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని ఆహారనియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మంచిది.

ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ మాత్రలు తప్పనిసరిగా ఒక ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వాడాలి. అవేగాక స్టాటిన్స్ వంటి మందులు జీవితాంతం వాడాలి. కాబట్టి వాటిని మీ కార్డియాలజిస్ట్ సూచించిన మోతాదులో వాడుతుంటే ఇకపై మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కొత్త జనరేషన్ స్టెంట్‌ల మన్నిక ఎక్కువ కాబట్టి తిరిగిపూడుకుపోతాయనే భయం లేదు.
 
- డాక్టర్ సి. రఘు
కార్డియాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్స్
అమీర్‌పేట, హైదరాబాద్

 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కెరీర్ మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. మరో 3 - 5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పుడు సమస్యల్లా ఇలా వైవాహిక జీవితాన్ని వాయిదా వేసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే విషయంలో ఏమైనా సమస్యలు వస్తాయా? నాలో అండం ఉత్పత్తి కావడం, వాటి పనితీరులో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? దయచేసి వివరంగా చెప్పండి.
 - సునంద, హైదరాబాద్

 
సంతాన సాఫల్యం విషయంలో వయసు చాలా కీలకమైన భూమిక పోషిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల ఉత్పత్తి, వాటి నాణ్యత తగ్గుతుంటుంది. పైగా మీరు పెళ్లి చేసుకోవాలన్న సమయానికి మీ రుతుక్రమం కూడా ఆగిపోయే వయసు వస్తుంది. ఆ సమయంలో గర్భధారణ అవకాశాలు తగ్గవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 38 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు బాగా తగ్గిపోతాయి.
 
ఇప్పుడు మీ అండాల సామర్థ్యాన్ని తెలుసుకోడానికి చాలా మంచి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మీ ఒవేరియన్ సమర్థతను కొన్ని రక్త పరీక్షల ద్వారా  తెలుసుకోవచ్చు. ఇప్పుడు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులలో త్వరగా మెనోపాజ్ వచ్చే మెడికల్ చరిత్ర ఉంటే మీకూ రుతుస్రావం త్వరగా ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ.
 
పైగా వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఫైబ్రాయిడ్స్, ట్యూబ్‌లకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డయాబెటిస్, హైబీపీ వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇవన్నీ గర్భధారణతో పాటు, గర్భస్రావాలనూ  పెంచవచ్చు. పైగా పెద్ద వయసులో నెల తప్పిన వాళ్లలో పిండంలో క్రోమోజోముల సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికం అవుతుంటాయి.
 
పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కెరియన్ ప్లానింగ్‌కూ, కుటుంబ జీవితానికీ సమతౌల్యం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా ఫెర్టిలిటీ నిపుణులతో చర్చించి, వారి నుంచి సలహాలూ, సూచనలు తీసుకోండి. మీ అండాలను భద్రపరిచేలా అవకాశాలను పరిశీలించి, వారు మీకు సరైన రీతిలో మార్గనిర్దేశనం చేస్తారు.
 
- డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement