గులాబీలతో...
కప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి, ఇందులో కొద్దిగా పాలు, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. తరచు ఈ విధంగా చేస్తుంటే చేతులు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతాయి.
కప్పు నీళ్లలో పది గులాబీ రేకలు వేసి మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత వడపోసి దీంట్లో టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం, సాయంత్రం రోజూ ఈ నీటిలో దూది ఉండను ముంచి ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.
పొడిబారిన జుట్టుకు...
చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. ఎందుకంటే పొడిబారిన చర్మంలాగే జుట్టు కూడా నిస్తేజంగా కనిపిస్తుంది. వారానికి రెండు సార్లు పెరుగును మాడుకు, వెంట్రుకలంతా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. అలాగే షాంపూ వాడిన తర్వాత తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించాలి. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, బాదంపప్పు, పాల ఉత్పత్తులు, తాజా కాయగూరలను చేర్చాలి. ఈ జాగ్రత్తలు పొడిబారిన జుట్టుకు జీవం తీసుకువస్తాయి.
బ్లాక్ అండ్ వైట్ హెడ్స్...
చాలా పార్లర్ లలో స్వేదరంధ్రాలలో పొడవాటి ఇనుప పుల్లను గుచ్చి, బ్లాక్‌హెడ్స్ తీస్తుంటారు. దీనివల్ల స్వేదరంధ్రాలు మరీ సున్నితమవుతాయి. పోర్స్ ఓపెన్ అయితే చర్మం కళ తప్పుతుంది. అలాకాకుండా, మార్కెట్లో బ్లాక్‌హెడ్స్ రిమూవల్ ఫోమ్ లభిస్తుంది. దీనిని రాసి బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు.
కమిలిన చర్మానికి చాకొలెట్!
చర్మం మృదువుగా మారడానికి, ఎండవల్ల నల్లబడిన చర్మం తిరిగి సహజరంగుకు రావడానికి చాకొలెట్ ఫేషియల్ సహాయపడుతుంది. చాకొలెట్ క్రీమ్‌లు, స్క్రబ్ దీనిలో ఉపయోగిస్తారు. అన్ని చర్మతత్వాలకు సరిపోయే ఫేషియల్ ఇది. ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలంటే- ముందుగా క్లెన్సింగ్ చేసి, రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రపరచాలి. బ్రౌన్ కలర్ షుగర్, కాఫీ గింజలను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత ముఖం మీద కొద్దిగా నీళ్లు చిలకరించి, మృదువుగా రుద్ది, నీటితో కడగాలి. తరువాత చాకొలెట్ మసాజ్ క్రీమ్‌ను ముఖానికి రాసి, మరొకసారి మృదువుగా రాసి, శుభ్రపరిచాలి. చాకొలెట్ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి వేసి, 20 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.